Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్త సరఫరాలో అవరోధాలు (బ్లాక్స్) ఏర్పడడం వల్ల 85 శాతం వరకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మిగతా 15 శాతం బ్లీడింగ్ వల్ల ఉత్పన్నమవుతుంది. గుండెజబ్బులు, అధిక బరువు, కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్, మధుమేహం కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. గుండెపోటు వచ్చిన వారికి, హైపర్‌టెన్షన్ ఉన్న వారికి ఒత్తిడి అధికమైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. కొలెస్ట్రోల్ శాతం పెరగడం ఒక కారణం. బయట తినే ఆహారం నిల్వ ఉండడం వల్ల ఉప్పు, నూనె వంటి పదార్థాల వల్ల చెడు కోలెస్ట్రాల్ ఎక్కువగా శరీరంలోకి వచ్చి చేరుతుంది. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. చివరకు హైపర్‌టెన్షన్ బారిన పడడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్‌ను ముందే పసిగట్టి చికిత్స తీసుకోవాలి. శరీరంలో ఒక భాగం, ప్రాంతం మొద్దుబారినట్లు, ముఖం కండరాలు పక్కకు లాగినట్లు ఉండడం. ఒక భాగంలో తిమ్మిర్లు రావడం, ఒక్కసారిగా కంటిచూపు మందగించడం, వణుకుడు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రందించాలి. పరీక్షలు చేయించుకోవాలి. మూడు గంటల్లోగా చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. దీని నుండి బయటపడాలంటే రాత్రివేళ ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు. రోజూ దూర ప్రయాణం చేయడం మానుకోవాలి. మానసిక ఒత్తిడికి గురయ్యే పనులకు దూరంగా ఉండాలి. కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజూ సమయం కేటాయించుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, పిండి పదార్ధాలను తగ్గించాలి. మంచి సంగీతం వినాలి. ఆఫీసులో అరగంటకుపైగా ఒకే విధంగా కుర్చీలో కూర్చోకూడదు. కూర్చులో పనిచేసే వారు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తలవెనుక భాగంలో తరుచూ నొప్పి వస్తుంటే వెన్నుపై భారం పడుతున్నట్లు భావించాలి. నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతో పాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది. రోజూ కనీసం గంటసేపు వ్యాయమం చేయాలి. అధిక బరువు, హైపర్‌టెన్షన్, మధుమేహం వంటి సమస్యలుంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.