Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రిజ్‌లో చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆహారాన్ని బట్టి... ఒక్కో కంపార్ట్ మెంట్లో నిల్వ చేయాల్సిఉంటుంది. కానీ అలా కాకుండా వాటన్నింటినీ ఒకే విధంగా వాడుతుంటాం మనం. నిజానికి ఆ కంపార్ట్మెంట్ను బట్టి... ఆహారపు నిల్వ కాలం ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు ఆహారపదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టే విధానాన్ని బట్టి... ఫ్రిజ్ మన్నికా ఉంటుంది. ఎందుకంటే ఒక్కో కంపార్ట్మెంట్కి ఒక్కో ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ గైడ్‌లైన్స్‌ను బట్టే మీరు నడుచుకోవాలి.
ప్రతి ఇంట్లో పాలు.. కాగబెట్టిన గిన్నెలోనే ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అది కూడా మెయిన్ కంపార్ట్మెంట్లో. పాలకు నాలుగు డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రత కావాలి. కాబట్టి అదే కరెక్టు. కానీ కొందరు బాటిల్స్‌లో నిల్వ చేస్తుంటారు. అలాంటివాళ్లు కచ్చితంగా డోర్షెల్ఫ్లోనే పాలబాటిల్ ఉంచాలి.
బ్రెడ్... గది ఉష్ణోగ్రతలోనే ఉండాలి. అయితే ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే... ఫ్రీజర్‌లో పెట్టాలి. లేకపోతే బ్రెడ్ తేమను కోల్పోయి గట్టిగా మారుతుంది. ఫ్రిజ్‌లో పెడితే ఈ ప్రాసెస్ నెమ్మదవుతుంది.
టమాట ఫ్రిజ్‌లో పెడితే తాజాగా, ఎర్రగా, జ్యూసీగా ఉంటాయని... అందరి నమ్మకం. కానీ టమాటలకు గది ఉష్ణోగ్రత సరిపోతుంది. ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉంటేనే కూరగాయలు పెట్టే బాక్స్‌లోనే పెట్టాలి.
ఇక కోడిగుడ్లు.. వాటికి ఉన్న ట్రేలల్లో మాత్రమే పెట్టాలి. బటర్, ఛీజ్ వంటి పాల ఉత్పత్తులన్నీ... డైరీ కంపార్ట్మెంట్లోనే పెట్టాలి. ఈ కంపార్ట్మెంట్ మెయిన్ కంపార్ట్మెంట్ కంటే కొద్దిగా వేడిగా ఉంటుంది.
మాంసం నిల్వ చేయాలంటే... ఉష్ణోగ్రత జీరో డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. అలా ఫ్రిజ్‌లో పెట్టిన మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అక్కడ పెట్టడం వల్ల దాని వాసన మిగిలిన ఆహారపదార్థాలకు పట్టదు. అందుకే మాంసాన్ని నిల్వ చేయడానికి చిల్లర్స్ ఉంటాయి. అవి లేకపోతే... ఫ్రిజ్ లోపలి భాగంలోకానీ... కింది షెల్ఫుల్లో కానీ నిల్వ చేయాలి.