Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పిల్లలు ఏమి తినాలి..? ఏ దుస్తులు వేసుకోవాలి..? ఏం చదవాలి..? స్నేహితులతో ఎలా మెలగాలి..? ఇలా ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకుంటూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు. మరీ చిన్నప్పుడైతే తప్పదు.. కానీ.. యుక్త వయసుల్లోకి వచ్చిన తరువాత కూడా ఇలా చేస్తే.. బొమ్మరిల్లు ఫాదర్... లేకపోతే ఇంకో పేరేదో పెడతారు. పేర్లు పెట్టడం ఎలా ఉన్నా... అతి జోక్యం వల్ల వస్తున్న సమస్యలేంటి? అసలు తల్లిదండ్రుల పాత్రేమిటి? ప్రత్యేకించి తల్లి... కూతురి విషయంలో ఎలా ఉండాలి? తెలియాలంటే ఇది చదవాల్సిందే!
పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. ఉండాల్సిందే కూడా! కానీ అది మితిమీరిపోకూడదన్నది నిపుణుల సలహా. ఎందుకంటే ఆ మితిమీరిన ప్రేమ పేరుతో... పిల్లల అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంటారు తల్లిదండ్రులు. పిల్లల బాల్యంలో అయితే.. వాళ్లకు లోకం తెలియదు. అప్పుడు జోక్యం చేసుకోవాల్సిందే! మంచేదో, చెడేదో చెప్పాల్సింది తల్లిదండ్రులే. కానీ యుక్త వయసుకు వచ్చాక కూడా తల్లిదండ్రులు జోక్యం చేసుకోవచ్చా? అంటే. వద్దే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే తల్లిదండ్రుల అతిజోక్యంతో ఎదిగిన యువతీయువకులు.. ఎన్నో అంశాల్లో వెనకబడిపోతున్నారు. ఈ విషయాన్ని చాలా అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
విశ్వాసం సన్నగిల్లుతుంది...
అతిగా జోక్యం చేసుకునే తల్లిదండ్రులున్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం చాలా తక్కువవుతోంది. బట్టల దగ్గరనుంచి, చదువు వరకు, స్నేహితుల నుంచి జీవిత భాగస్వామి వరకు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల అతి జోక్యం పిల్లలను బాగా ఇబ్బంది పెడుతున్నది. దీని వల్ల వాళ్లు.. ఏ విషయంలోనూ తమంతట తాము నిర్ణయం తీసుకోలేరు. జీవితంలో ఏ క్లిష్టమైన సమస్యవచ్చినా అస్సలు తట్టుకోలేరు. ఈ అతిజోక్యం ఎక్కువగా తల్లి నుంచే అయితే మాత్రం దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందట. ఇలాంటి యువతలో కనీసం తాము ఓ పని మొదలుపెట్టి విజయవంతంగా పూర్తిచేస్తామనే ఆత్మవిశ్వాసం కూడా కనిపించదట. ఇలాంటివాళ్లలో కొందరు మానసిక ఆందోళనా, కుంగుబాటుకి లోనయ్యే ప్రమాదం ఎక్కువని ఓ అధ్యయనం హెచ్చరించింది. కాబట్టి తల్లులు కూతుళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సున్నితంగా చెప్పండి...
ఈ వయసులో అన్నీ తమకే తెలుసనుకోవడం సహజం. అలాంటివారికి ఏదయినా వద్దని చెబితే ఎదిరించేందుకు సిద్ధమైపోతారు. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఏ విషయాన్నయినా నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయాలి. అలాని ఉపన్యాసంతో ఊదర గొట్టేయకుండా, సున్నితంగానే వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తే అర్థంచేసుకుంటారు. అమ్మగా కన్నా స్నేహితురాల్లా ఉండేలా చూసుకోవాలి. వాళ్ల స్నేహితులతోనూ కలిసిపోగలగాలి. అప్పుడే మీతో ప్రతీ విషయాన్నీ పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
అనుబంధం పెంచుకోండి...
మీకు సమయం ఉన్నా లేకపోయినా. రోజూ మీ అమ్మాయితో కాసేపు మాట్లాడండి. తన రోజు ఎలా గడిచిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొన్నిరోజులయ్యాక మీరు అడగకపోయినా తనంతట తానుగా మీతో పంచుకోవడం ప్రారంభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే గనుక చిన్నప్పుడు వారితో గడిపేందుకు ఎలా సమయం కేటాయించుకునేవారో ఇప్పుడూ అదే చేయండి. ఇంటిపనుల్లో వారి సాయం తీసుకోండి. ఇద్దరూ కలిసి షాపింగ్‌కి వెళ్లండి. వ్యాయామం చేయండి. వీటన్నింటివల్ల మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. మనసువిప్పి మాట్లాడుకునేందుకు సమయమూ దొరుకుతుంది.
బాధ్యతపడతారు...
ఈ వయసులో స్నేహితులు ఎక్కువ. వాళ్లతో గడపాలని ఎక్కువగా ఉంటుంది. అలాగే... ఈ వయసులో పార్టీలకు పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడం కూడా ఎక్కువే! వాళ్లు వెళ్తామంటారు... మీరు వద్దంటారు. ఈ విషయంలో తల్లీ కూతుళ్ల మధ్యా ఒక్కోసారి వాదనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు తల్లిగా మీ భయాలు మీకుంటాయి. కూతురుగా ఆమె ఇష్టాలు ఆమెకుంటాయి. మీ అభిప్రాయంలో నిజం ఉన్నా, మీ అమ్మాయి అర్థంచేసుకోలేకపోవచ్చు. ఆ సమయంలో వాళ్లతో వాదించి ప్రయోజనం ఉండదు. వాస్తవాన్ని ఉదాహరణలతో వారికి వివరించే ప్రయత్నం చేయాలి. నిర్ణయాధికారం అమ్మాయికే వదిలేసి చూడండి. నిర్ణయం తీసుకున్నది వాళ్లు కాబట్టి.. మంచైనా చెడైనా వాళ్లే భరిస్తారు. బాధ్యతపడటం తెలుస్తుంది. వాళ్ల మీద వాళ్లు ఒక అంచనాకు వస్తారు.
సమయాన్ని కేటాయించండి...
ఈ రోజుల్లో ఉద్యోగస్తులయినా, కాకపోయినా తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు. అయినా మీ రోజులో కొంత సమయాన్ని పిల్లలకోసం కేటాయించండి. ప్రతిరోజూ కనీసం ఒకపూటైనా వారితో కలిసి భోజనం చేయండి. ఆ సమయంలో అతిగా ప్రశ్నలు వేసి... వాళ్లకు సంబంధించిన విషయాలు ఆరా తీసే ప్రయత్నం వద్దు. ఎలా చదువుతున్నారు? ఏం చేస్త్తున్నారు? స్నేహితులు.. వంటి వివరాలను నెమ్మదిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా వారిని మాట్లాడించిన తరువాతే మీరు ప్రశ్నలు వేయండి. అది కూడా ఆరా తీసినట్టుగా ఉండొద్దు. విషయం తెలుసుకుంటున్నట్టుగా మాత్రమే ఉండాలి.
అభిరుచులు కొనసాగించండి...
సినిమాలూ, షికార్లూ, క్రికెట్ మ్యాచ్‌లు... ఇలా ప్రతిదానికీ మీరు వారితో వెళ్లలేక పోవచ్చు. అయితే వారికి ఇష్టమైన అభిరుచులను తెలుసుకోండి. అవి ఆటలూ, చిత్రలేఖనం, సంగీతం, డాన్స్.. ఇలా ఏవో ఉంటాయి వారంలో ఒకసారి వారితో కలిసి ఆడండి, పాడండి. వాళ్ల ఇష్టం, మీ ఇష్టం ఒకటే అయితే ఇంకా బాగుంటుంది. మీకు కొనసాగింపు... వాళ్లకు నేర్చుకున్నట్టుగా ఉంటుంది. మీ క్వాలిటీ సమయాన్ని వారికి కేటాయించినట్టుగా కూడా ఉంటుంది. దానివల్ల... పిల్లలు సంతోషపడతారు.
అడిగి నేర్చుకోండి...
టీనేజ్ పిల్లలు తమకు అన్ని తెలుసని అనుకుంటారు. తల్లిదండ్రులు దగ్గరుండి ఇదిలా చెయ్యి, అది అలా చదువు అంటూ చెప్పడం నచ్చదు. కాబట్టి ఆజ్ఞాపిస్తున్నట్టు కాకుండా కాసేపు మీరే వాళ్లలా మారిపోండి. తల్లిదండ్రులకు ఏం తెలియదు? అనే ఆలోచనలో ఉంటుంటారు పిల్లలు. కాబట్టి... అన్ని విషయాల్లో అప్డేటెడ్గా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు తెలియని విషయాలు వారి దగ్గర నుంచి నేర్చుకోండి. నేర్పమని వారినే అడగండి. అది ఏదయినా కావచ్చు. అప్పుడు వారు చెప్పినట్లుగా నడుచుకోండి. క్రమంగా మీ దారిలోకి వస్తారు. పిల్లల్లో పిల్లల్లా, పెద్దల్లో పెద్దల్లా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా అన్ని విషయాలు తెలిసి ఉండటం వల్ల పిల్లలకు మీ మీద గౌరవం పెరుగుతుంది. మీ కన్నుగప్పి ఏదైనా చేసేందుకు ప్రయత్నించరు.