Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ చిగురించడానికి ఎక్కువ కాలం అక్కరలేదు. కానీ... ఆ ఇద్దరి మధ్యా చిగురించిన ప్రేమ కలకాలం నిలవాలంటే వారి మధ్య ప్రేమాభిమానాలతోపాటు పరస్పర నమ్మకం ఉండాలి. కాబట్టి అతడి ప్రవర్తనను గమనించాలి. మీ ఒక్కరితోనే కాదు... మీచుట్టూ ఉన్నవారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా చూడాలి.
- మనిషన్నాక తప్పులు చేయకుండా ఉండరు. అప్పుడప్పుడు అనుకోకుండా పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా ధైర్యంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడా అనేది కూడా అంచనా వేయాలి.
- ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఒకరికి ఒకరుంటే సరిపోతుంది అనుకుంటారు చాలా మంది. కానీ... మీకంటూ ఓ కుటుంబం ఉంటుంది. మీతోపాటు మీ కుటుంబ సభ్యుల పట్ల అతడి వైఖరి ఎలా ఉంటుందనేది జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ అతడు మీతో మాత్రమే మంచిగా ఉంటూ మిగతావారితో బాధ్యతారహితంగా, మర్యాద లేకుండా ప్రవర్తిస్తోంటే ప్రేమను అంగీకరించడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడమే మంచిది.
- అతడి పద్ధతులు, అలవాట్లు నెమ్మదిగా తెలుసుకోండి. అయితే అతని అలవాట్లు, అభిరుచులన్నీ మీకు అన్నీ నచ్చాలనే నియమమేమీ లేదు. మీకు ఇబ్బంది కానంత వరకూ కొన్నింటిని చూసీ చూడనట్లు వదిలేయడమే మంచిది. స్నేహితులు, బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు ఎలా స్పందిస్తున్నాడో గమనించాలి. దాంతో తనది సాయం చేసే మనస్తత్వమా లేదా విమర్శించే వైఖరా అనేది తెలుస్తుంది.
- ప్రేమ పంచుకోవడం అంటే.. కేవలం సుఖాలను పంచుకోవడం మాత్రమే కాదు... అతని కష్టసుఖాలను పంచుకోవడం. అతని ఆశయాలను కూడా పంచుకోవడం. అతని ఆశలు, ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోండి. ఉన్నతమైన లక్ష్యాలు, ఆలోచనలు, ఆశయాలు మనుషులను ఉన్నతంగా నిలబెడతాయి. ఎలాంటి లక్ష్యాలు లేకుండా దారం తెగిన గాలిపటంలా ఉండే వ్యక్తిత్వమైతే మీరు ఆలోచించాల్సిందే.
- కొందరు మనుషుల ముందు ఒక తీరు, తరువాత ఒక తీరుగా ఉంటారు. కాబట్టి... అతడు మీ ముందు ఎలా ఉంటున్నాడు, మీ తరువాత ఎలా ఉంటున్నాడనేది ముఖ్యం. మాటతీరు, నడకా, ప్రవర్తనా, మీ పట్ల చూపుతున్న శ్రద్ధ అన్నీ నిజమా కాదా అన్నది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. తన ప్రేమను మీతో చెప్పినప్పుడు వాటన్నింటిని పరిగణించాలి. అతడు చెబుతున్నదానికి కట్టుబడి ఉంటున్నాడా లేదా అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో తను ఎలా ఉంటున్నాడనేది చూడాలి.