Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ... భావనే ఎంత తీయగా ఉంటుంది కదా! అలాంటి ప్రేమికుల రోజు వేడుకకు అంతకంటే తీయని శుభారంభం కచ్చితంగా కావాల్సిందే! మరీ అంతటి తీయనివంటే అందరికీ గుర్తొచ్చేది చాక్లెట్సే. ప్రేమికులకు కానుకతోపాటు ఓ చాక్లెట్ కచ్చితంగా ఇస్తారు. ఆ చాక్లెట్ మీరు చేసిందైతే దానికి మరింత తీపి జతకూడుతుంది. సో బయట కొనడం మానేసి.. మీరే తయారు చేయండి...
పీనట్ బట్టర్ చాక్లెట్
కావల్సిన పదార్థాలు : చాక్లెట్(బార్) - 250 గ్రాములు, పీనట్ బట్టర్ -100 గ్రాములు
చాక్లెట్ మోల్డ్
తయారీ విధానం : చాక్లెట్ ని స్టవ్ మీద కానీ మైక్రోవేవ్ లో కానీ కరగబెట్టుకోవాలి. దీనిని మోల్డ్ లో పలుచగా వెయ్యాలి. అది కొంచం ఆరాక దాంట్లో పీనట్ బట్టర్ వెయ్యాలి. దానిని సర్ది పైన జాగ్రత్తగా మళ్ళీ కరిగిన చాక్లెట్ వేసి ఫ్రిజ్లో ఒక అరగంట పెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన చాక్లెట్ ని నెమ్మదిగా ఒక ప్లేట్ లోకి తెరికోవాలి. పీనట్ బట్టర్ చాక్లెట్ రెడీ.
పాల చాక్లెట్
కావాల్సిన పదార్ధాలు :
పాలు -1కప్పు, పెరుగు- 1కప్పు, చక్కెర - 1కప్పు, నెయ్యి - చెంచా, యాలకులపొడి - కొద్దిగా.
తయారీ విధానం : ఒక గిన్నెలో పాలు తీసుకొని బాగా మరిగించాలి. తరువాత చక్కెర, పెరుగు, యాలకులపొడి ఒకదాని తరువాత ఒకటి వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా వచ్చిన తరువాత నెయ్యి చేర్చి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని బిళ్లల్లా చేసుకోవాలి. అంతే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పాల చాక్లెట్ రెడీ.
పళ్ళతో చాక్లెట్
కావలసిన పదార్థాలు : అరటి పండు/స్ట్రాబెర్రీ/ఆపిల్ వాడచ్చు. చాక్లెట్ బార్
తయారీ విధానం : చాక్లెట్ కరగపెట్టి. దాంట్లో పళ్ళని ఒక ఫోర్క్ తో ముంచాలి. వాటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లో పెట్టాలి. ఆ ప్లేట్ ని కొంచం సేపు ఫ్రిజ్లో పెట్టుకుని తింటే బాగుంటుంది.
వైట్ చాక్లెట్ క్రాన్బెర్రీ పిస్తా ఫడ్జా
కావలసిన పదార్థాలు : వైట్ చాక్లెట్ చిప్స్ -200 గ్రాములు, కండెన్స్డ్ మిల్క్ (మిల్క్మేడ్)-1 టిన్, వెనిల్లా ఎసెన్స్ - ఒక చెంచా, ఎండిన కాన్బెర్రీస్ - ఒక కప్పు, పిస్తా - సగం కప్పు, ఉప్పు -చిటికెడు
తయారీ విధానం :
ముందుగా స్టవ్ మీద కానీ... మైక్రోవోవెన్లో కానీ.. వైట్ చాక్లెట్, కండెన్స్డ్ మిల్క్ కలిపి తక్కువ వేడితో కరిగించాలి. ఇలా చాక్లెట్ మృదువుగా అయ్యేవరకు చేయాలి. స్టవ్ ఆపేసి వెంటనే.. ఆ మిశ్రమంలో వెనిల్లా ఎసెన్స్, ఎండిన కాన్బెర్రీస్, పిస్తా, ఉప్పు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన స్టీలు పల్లెలోకి మార్చి.. సమానంగా చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలు కట్ చేసుకోవాలి. మూత గట్టిగా ఉన్న సీసాలో నిల్వ చేసుకోవచ్చు.