Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిప్రెషన్... ఓ సుడిగుండం లాంటిది. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా, పేద గొప్పా తేడా లేదు. ఎప్పుడైనా, ఎవర్నైనా, ఎంతటివారినైనా తనలోకి లాక్కునే శక్తి దీనికుంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు ఐదు శాతం మంది డిప్రెషన్ బాధితులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. నిజానికి ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో మానసిక కుంగుబాటుకు గురవుతూ ఉంటాం. అయితే పడిలేచినట్టే, దాని నుండి బయటకొచ్చే స్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అది అసాధ్యమవుతుంది. తీవ్రమైన మానసిక కుంగుబాటు డిప్రెషన్ అనీ, దానికి చికిత్స ఉందనే అవగాహన కూడా కొందరికి ఉండదు. ఇది ఒక పార్శ్వం మాత్రమే! మరోవైపు చికిత్స వరకూ వెళ్లినా, దాన్నీ సక్రమంగా కొనసాగించకుండా ఆత్మహత్యతో జీవితాల్ని అంతం చేసుకునే వాళ్లూ ఉన్నారు.
ఈ మధ్య కాలంలో డిప్రెషన్ రుగ్మత పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉరుకులుపరుగులెత్తే జీవితాలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఉమ్మడి కుటుంబాలు కరువవడం, అనుబంధాలు బలహీనపడడం, అక్రమ సంబంధాలు, బాధ్యతలు, పోటీతత్వం పెరగడం... ఇలా చెప్పుకుంటూపోతే మనిషిని ఒంటరితనం, కుంగుబాటు, నిరాశానిస్శృహల్లోకి నెట్టేసే అంశాలు ఎన్నో. మాట్లాడుకోవడానికి, బాధలు పంచుకోవడానికి మనుషులు కరువవడం, సెల్ఫోన్లు, కంప్యూటర్ల వాడకం పెరిగి, ముఖాముఖి సంభాషణలు తగ్గిపోవడం వల్ల కుంగదీసే అంశాలను లోలోపలే దాచుకునే తత్వాలు పెరిగిపోతున్నాయి. స్వీయ స్వేచ్ఛ, ఇండివిడ్యువాలిటీలతో ఆవహించే అహం కూడా బాధల్ని వెల్లడించడానికి అడ్డంకిగా మారుతుంది. వీటిన్నిటి వల్ల ఒక సమస్య ఎదురైనప్పుడు, విశ్లేషించి సానుకూలంగా పరిష్కరించుకునే మెలకువలు తక్కువైపోతున్నాయి. దాంతో డిప్రెషన్‌కు గురవడం, అందుకు చికిత్స తీసుకోకపోవడం, అది తీవ్రమై ఆత్మహత్యకు ప్రయత్నించడం చేస్తూ ఉంటారు.
ఏ ఇద్దరి వ్యక్తిత్వాలూ ఒకేలా ఉండవు. అలాగే డిప్రెషన్‌కు స్పందించే తీరు కూడా ఏ ఇద్దర్లో ఒకేలా ఉండదు. కొందరు ఎంతటి సమస్యనైనా మానసికశక్తితో కోల్పోకుండా పరిష్కరించుకోగలుగుతారు. ఇంకొందరు మానసిక కుంగుబాటుకు లోనైనా కూడా తిరిగి కోలుకోగలుగుతారు. మరికొందరు మాత్రం ఆత్మహత్యే పరిష్కారంగా ఎంచుకుంటారు. ఇలాంటి బలహీన మనస్తత్వం తల్లితండ్రుల పెంపకం, వారి నుంచి జన్యుపరంగా సంక్రమించిన లక్షణాలు, బాల్య అనుభవాల నుంచి రూపం పోసుకుంటుంది. వీటన్నిటిమూలంగా పెరిగి పెద్దయ్యాక ఒక భిన్నమైన వ్యక్తిత్వం, మనస్తత్వం రూపుదిద్దుకుంటుంది. యాంగ్జయిటీ, డిపెండెన్సీ, బార్డర్‌లైన్ పర్సనాలిటీ కలిగిన వాళ్లు మిగతావారికంటే తేలికగా డిప్రెషన్‌కు గురవుతూ ఉంటారు. జీవితం ఏ చిన్న లోటుపాటుకు గురైనా నిరాశలో కూరుకుపోతూ ఉంటారు.