Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం. అయితే పగలు ఎంతో హుషారుగా ఉండే పిల్లలు రాత్రిపూట మాత్రం సతాయిస్తుంటారు. నిద్ర మధ్యలో లేచి ఏడుస్తుంటారు. ఉలిక్కి పడుతుంటారు. మీ పిల్లల విషయంలోనూ ఇలాంటి సందర్భాలు తరచూ ఎదురవుతున్నాయా..? అయితే బుజ్జాయి ఏ కలతలూ లేకుండా హాయిగా బజ్జోవాలంటే ఇలా చేయండి...
పెద్దలతో పోలిస్తే చిన్న పిల్లలు ఎక్కువ సమయం పాటు నిద్ర పోతారు. ఈ సమయం వారి వయసును బట్టే ఉంటుంది. పుట్టిన తర్వాత రెండు నెలల వరకు రోజులో 18 గంటల వరకు నిద్రలో ఉంటారు. 3 నెలల నుంచి 12 నెలల వరకు 15 గంటల పాటు నిద్రపోతుంటారు. ఏడాది తర్వాత నుంచి మూడేళ్ల వరకు రోజులో 12 నుంచి 14 గంటల మేర నిద్రిస్తారు. మూడేళ్ల తర్వాత ఐదేళ్ల వరకు వారి నిద్ర సమయం 11 గంటల నుంచి 13 గంటల వరకు ఉంటుంది. ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల వరకు 10 గంటల వరకు ఉంటుంది.
అయితే పిల్లల వయసుతో పాటు నిద్రకు, ఆహారానికీ సంబంధం ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, అమైనో యాసిడ్లు ఉన్న ఆహారంతో పిల్లలకు గాఢ నిద్ర వస్తుంది. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం కూడా నిద్రకు ఉపకరిస్తాయట. అందుకే గోరువెచ్చని పాలు పట్టమని వైద్యుల సలహా. గోధుమలు, బియ్యంతో చేసిన ఆహారం, అరటిపండు, గుడ్డు కూడా మంచిదేనట. నిద్రకు ముందు షుగర్ ఎక్కువగా ఉన్నవి, తేనె వంటివి ఇవ్వకూడదు. దీనివల్ల పిల్లలు ఇంకా యాక్టివ్ గా మారతారు.
జోలపాట, జో కొట్టడం వంటివి పిల్లలను నిద్రపుచ్చడం లో మంచి ఫలితాన్నిస్తాయి. చిన్నారుల కోసం లాలిపాటలు పాడడం ఎప్పటినుంచో ఆచరణలో ఉంది. లాలిపాటలు విశ్రాంతికి దారితీస్తాయి. వారికి నచ్చిన పాటే రోజూ పాడటం చిన్నారులు ఇష్టపడతారట.
చిన్న పిల్లలకు పడకగది చీకటిగా ఉంటే భయంగా అనిపించవచ్చు. అందుకే నిద్రకు ఇబ్బంది కలిగించని లైట్ బ్లూ కలర్ బల్బ్ ఆన్ చేసి ఉంచడం మంచిది. అదే సమయంలో పడకగదిలో వెలుతురు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఇంకా ఏవైనా భయాలున్నాయేమో గమనించి తాను కూడా పక్కనే ఉంటానని తల్లి ధైర్యం చెబుతూ వారిపై చేయి వేసి నిద్ర పుచ్చడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు నిపుణులు.
అదే ఏడాదిన్నర వయసున్న పిల్లలకు చెబితే కొంతమేరకు అర్థమవుతుంది. అందుకే మరో అరగంటలో నిద్రపోతామనగా... వారికి కథ చెబుతూ, కథ అయిన తర్వాత నిద్రపోవడం అలవాటు చేయాలి. దీంతో రోజూ నిర్ణీత వేళల్లో నిద్రించడానికి పిల్లలు అలవాటు పడతారు.
ఇక ఎప్పుడు చూసినా పిల్లల చేతుల్లో సెల్ఫోన్లు కనిపిస్తున్నారు. ఇవి పడక మంచం దగ్గర లేకుండా చూసుకోవాలి. చిన్నారులు ఉన్న బెడ్రూంలలో టీవీలను చూడకుండా ఉండటం మంచిది.
రాత్రి వేళల్లో పిల్లలకు వేసే వస్త్రాలు చాలా సౌకర్యంగా ఉండాలి. వేసవిలో కాటన్, శీతాకాలంలో ఉన్ని ఇలా అన్నమాట. అలాగే మూడేళ్ల పిల్లలైతే నిద్ర మధ్యలో ఆటంకం కలుగకుండా ఉండేందుకు ముందుగానే మూత్ర విసర్జన చేసేలా అలవాటు చేయాలి.