Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నువ్వంటే నా నవ్వు.. నేనంటేనే నువ్వు..' అంటూ తెలుగు సంగీత ప్రియులందరినీ మనసులను సొంతం చేసుకుంది. 'హే పిల్లగాడా... ఏందిరో పిల్లగాడా.. ' అంటూ తన స్వరంతో కుర్రకారు గుండెల్లో లొల్లి పెట్టింది. ఇటీవల 'పడిపడి లేచే మనసూ..' యువత అంతరంగాన్ని ఆవిష్కరించింది. తెలుగు, తమిళ్ కన్నడ.. భాషేదైనా భావమిట్టే పట్టేస్తుంది. కర్ణాటక, సినిమా, పాశ్చాత్య సంగీతమేదైనా తన గొంతుతో మాయ చేసేస్తుంది. ఆ సుమధుర గాయని...
సింధూరి విశాల్. ఇండిస్టీకి వచ్చి నాలుగేండ్లే... తెలుగులో పాడింది ఎనిమిది పాటలే... అయినా తనదైన ముద్రతో, అవకాశాలతో దూసుకుపోతున్నది. ఆమె పరిచయం...
సంగీతం మీద ఆసక్తి ఎలా పుట్టింది?
మా ఇంట్లో పూర్తిగా సంగీత వాతావరణం. మా అమ్మ, బామ్మ ఇద్దరూ సంగీతం నేర్పేవారు. వాళ్లతో కలిసి కూర్చుని వినేదాన్ని. నేర్చుకునేదాన్ని. అలా ఐదేండ్ల వయసునుంచే సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాను. అయితే సినిమాల్లో పాడాలన్న గోల్ ఏమీ లేదు. కానీ ఇష్టంతో నేర్చుకుంటూనే ఉన్నా. మా నాన్నగారికి గజల్స్ అంటే ఇష్టం. ఇంట్లో గజల్స్, వెస్ట్రన్, సూఫీ మ్యూజిక్ ఇలా అన్నీ వింటూ ఉండేవాళ్లం. నేను మొట్టమొదట పాడింది గజల్స్. స్కూలింగ్ అయిపోయాక... ట్వెల్త్ చదువుతున్నప్పుడు... మ్యూజిక్ షో 'రాగమాలిక'లో పార్టిసిపేట్ చేశాను. చాలా పోటాపోటీగా సాగిన ఆ కార్యక్రమంలో ద్వితీయ స్థానంలో నిలిచాను.
నేపథ్య గాయనిగా ఎప్పుడు మారారు?
చిన్నప్పుడు అన్ని వినేదాన్నని చెప్పాను కదా! ఆ వర్సటాలిటీ అభివృద్ధి కావాలని, కర్ణాటిక్ నేర్చుకుంటూనే... వెస్ట్రన్ మీద దృష్టి సారించిన. 'రాగమాలిక' షో తరువాత నుంచే రికార్డింగ్ అవకాశాలు వచ్చాయి. మొట్టమొదట రికార్డింగ్‌లో పాడిన పాట డివోషనల్ ఆల్బమ్‌లో. నేరుగా పాడటం వేరు... రికార్డింగ్ స్టూడియోలో పాడటం వేరు. శబ్దం భిన్నంగా ఉంటుంది. మొదట ఏమీ తెలియక, కొంచెం ఇబ్బందయ్యింది... కానీ బాగానే పాడేశాను. ఆ తరువాత అవకాశాలు వచ్చాయి. కానీ... చదువుకోసం మధ్యలో ఆపేశాను.
సంగీత దర్శకులు విశాల్ చంద్రశేఖర్‌తో మీది ప్రేమ పెండ్లా?
అవును. విశాల్ నాకు.. కాలేజీలోనే అంటే.. 2006 నుంచే పరిచయం. తరువాత ఇద్దరం డేటింగ్లో ఉన్నాం. ఐదేండ్ల కిందట పెండ్లి చేసుకున్నాం. వ్యక్తులుగానే కాదు... సంగీతం ప్రపంచంలోనూ ఇద్దరం కలిసి ఎదిగాం. ఇంట్లో కూడా 24 గంటలు సంగీతమే అన్నట్టుగా ఉంటుంది. అయితే నేను మొదట జాబ్‌లో చేరాను. ఎందుకంటే ప్లేబ్యాక్ ఆలోచన అప్పటికి రాలేదు. కాకపోతే... విశాల్ సినిమాలకు సంగీత దర్శకత్వం చేస్తున్నప్పుడు... ప్రారంభంనుంచి చివరి వరకు తనతోపాటు కలిసి పనిచేసేదాన్ని. కంపోజింగ్‌కి కూర్చోవడం, టేక్స్ తీసుకోవడం. మ్యూజిక్ సూపర్వైజర్లాగా పనిచేస్తాను. రీ రికార్డింగ్ ఐడియాస్ అన్ని చర్చిస్తాం.
తెలుగులో 'నువ్వంటే నా నవ్వు...' పాడే అవకాశం ఎట్లా వచ్చింది?
ఏదైనా పాట కంపోజ్ చేసినప్పుడు... ట్రాక్ ఎవరో ఒకరితో పాడించాలి. ఏ సమయంలోనైనా తనకు అందుబాటులో ఉంటాను కాబట్టి... ఆ ట్రాక్ నాతో పాడించడం మొదలుపెట్టారు. అలా పాడినప్పుడు... విన్న సినిమా దర్శకులు కొందరు నేను పాడినది విని... నాతోనే పాడించమని చెబుతుంటారు. అలా మళ్లీ ప్లేబ్యాక్ సింగింగ్‌లోకి వచ్చాను. మొదట తమిళ్లో పాడాను. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో తెలుగులో అడుగుపెట్టాను. ఆ పాట మోడ్రన్ కాదు. చాలా మూలాల్లోకి తీసుకెళ్లే పాట. అలాంటి పాట ఈ తరానికి బాగా నచ్చింది. ఈ పాటకోసం 'హరిచరణ్ ఉత్తమ గాయకుడి'గా అవార్డు అందుకున్నారు. స్ట్రింగ్ సెక్షన్ అంటే చాలా ఇష్టం నాకు ఈ పాటలో.
ఇంకా తెలుగులో పాడిన పాటలు?
తరువాత శక్తికాంత్ సంగీత దర్శకత్వం వహించిన 'ఫిదా' సినిమాలో 'హే పిల్లగాడా...' పాడే అవకాశం వచ్చింది. ఇది భిన్నమైన పాట. తరువాత 'లై' సినిమా కోసం మణిశర్మగారి దగ్గర ఒక పాట పాడాను.
ఇటీవలే వచ్చిన 'పడిపడి లేచే మనసు'లో టైటిల్ సాంగ్‌తో పాటు మరో పాట పాడాను. ఇప్పుడు రెండు పాటలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
తెలుగులో అవకాశాలు ఎట్లా వస్తున్నాయి? మణిశర్మగారితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
తమిళ్, తెలుగుతోపాటు కన్నడ కూడా పాడుతున్నాను. అయితే ఆ రెండు భాషల కంటే ఎక్కువగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ఇక 'లై' సినిమా కోసం ముందుగా మణిశర్మగారితో పాడటం అంటే భయపడ్డాను. ఎందుకంటే ఆయన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కదా! ఆ పాటకు నన్ను సినిమా దర్శకులు రెఫర్ చేశారు. దాంతో ఆయన ముందు కొద్దిగా అయిష్టంగానే ఉన్నారు. ఫస్ట్ ఒక బిట్ ఇచ్చి పాడమన్నారు. అది పాడిన తరువాత... సంతోషపడ్డారు. నెమ్మదిగా ఏదెలా పాడాలో చెబుతూ పోయారు. ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ పెరిగిన తరువాత.. పాటలో నా వేరియేషన్స్ కూడా ఇన్వాల్వ్ చేయమన్నారు. పాట పూర్తయ్యాక.. 'నీకు మంచి స్వరం ఉంది. నీకు గొప్ప భవిష్యత్ ఉంది' అని కితాబిచ్చారు. మరిచిపోలేని ప్రశంస.
తమిళియన్ కదా! తెలుగులో పాడేటప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఎట్లా అధిగమిస్తున్నారు?
ఏ పాటైనా రికార్డింగ్ సమయంలో కచ్చితంగా గేయ రచయిత, దర్శకులు ఉంటారు కాబట్టి... చాలా వరకు వాటి అర్థాలు, ఆ పదాల్లో ఉన్న తీవ్రత గురించి వివరిస్తున్నారు. వాటికితోడు... చాలావరకు కర్ణాటిక్ కంపోజిషన్స్ తెలుగులోనే ఉంటాయి. నేను 20 ఏండ్లుగా కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. అది చాలా ఉపయోగపడింది. భాషను ఉచ్ఛరించడం తెలిసొచ్చింది. పాడుతున్నప్పుడు.. చాలా మంది అంటున్నారు 'తెలుగు నేర్చుకోండి.. డబ్బింగ్ అవకాశాలు కూడా వస్తాయి' అని. నిజమే అనిపించింది. నేర్చుకుంటున్నా. 'పడిపడి లేచే మనసు'లో సాయిపల్లవి కోసం రఫ్ డబ్బింగ్ కూడా చెప్పాను. భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో చెప్పేందుకు ప్రయత్నిస్తా.
ఇప్పటికే విశాల్‌తో కంపోజింగ్‌కి పనిచేస్తున్నారు కదా! భవిష్యత్‌లో సంగీత దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?
ప్రస్తుతానికయితే లేదండి. ఇప్పుడు తన సినిమాలకు మ్యూజిక్ అరేంజర్, మ్యూజిక్ ప్రోగ్రామర్లాగా పనిచేయడం చాలా ఇష్టం. ఇప్పటికయితే కేవలం ప్లేబ్యాక్. హరిహరణ్ గారి పాటలంటే చాలా ఇష్టం. తన థాట్ ప్రాసెస్, గజల్స్ బ్రిలియింట్గా ఉంటాయి. ఇంకా చిత్ర అమ్మ నాకు ఆదర్శం. సినిమా పాటలు పాడటంలో చాలా టెక్నిక్స్ ఆమె పాటలు వింటూనే నేర్చుకున్నాను. సంగీత దర్శకులందరి దగ్గరా పాడాలని ఉంది. ప్రత్యేకించి.. గాయనీగాయకుల కలల సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్...తోపాటు దేవిగారు, థమన్‌గారు ఇలా అందరితో కలిసి పనిచేయాలనుంది.
మీ భర్త సంగీత దర్శకులు కావడం... కలిసొచ్చిందా?
కొద్దిగా మేలు చేస్తే.. ఎక్కువగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా సంగీతదర్శకులు నాకు కాల్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. నేను విశాల్ సినిమాలకే పాడతానేమోననే అపోహ. కానీ... ఎక్కువమంది కంపోజర్స్‌తో పనిచేస్తేనే చాలా ఎక్స్పోజర్ వస్తుంది. ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కుమాత్రమే పాడితే... ఓ పరిధిలో ఉండిపోతాం. నాకు ఇష్టమైన జానర్.. మెలడీ! అన్ని జానర్స్ పాడటానికి ఇష్టపడతాను.
తెలుగు, తమిళ పరిశ్రమలను చూశారు కదా! రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం?
రెండు ఇండిస్టీలకు దేని ప్రత్యేకత దానికే ఉంది. తెలుగులో గాయనీగాయకుల మీద ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఆరాధన ఉంటుంది. అది తెలుగువాళ్ల సంప్రదాయం, సంస్కృతిలాగా వస్తున్నది. చాలా గౌరవం ఉంటుంది కళాకారులకు. స్టూడియోకు వెళ్లిన ప్రతిసారీ ఇచ్చే గౌరవం చూస్తే గర్వంగా ఉంటుంది. ఇక తమిళంలో చాలా పోటీ ఉంటుంది. ఇక్కడా లెజెండరీ సంగీతదర్శకులు, గాయనీగాయకులున్నారు. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నాను.
ఇష్టమైన పాట?
మై ఆల్ టైమ్ ఫేవరెట్... దమాదమ్ మస్త్ కళందర్. హిందుస్తానీ నేర్చుకోవాలనుకున్నా కానీ కుదరలేదు. గురువు దొరకలేదు. కానీ నా టుడు లిస్టులో ఉంది. ఇష్టమైన పాటలు తెలుగులో అంటే.. ఆ మధ్య కాలంలో 'అడిగా అడిగా' నిన్నుకోరి సినిమాలోని పాట. ఓ వందసార్లు విని ఉంటా. ఇప్పుడైతే.. టాక్సీవాలాలోని 'మాటే వినదుగా...' మోగిపోతోంది ఫోన్లో!
మీ శ్రావ్యమైన గొంతుక రహస్యం?
ఒక్కొక్కరి గొంతులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. నా స్వర రహస్యమంటూ ఏం లేదు. ఎక్కువ నీళ్లు తాగుతాను. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటాను!