Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్ర లేచింది మొదలు పరుగులు పెడితేనే నేటి పోటీ ప్రపంచంలో రాణించగలం. రేపు ఏం చేయాలనేది ఎక్కడెక్కడికెళ్ళాలనేది ఈ రోజు ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే ఆచరణలో సాధ్యమవుతుంది. మహిళలైతే ఈ ప్రణాళిక మరీ ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉద్యోగం చేసే మహిళకైతే పని భారం మరింత ఎక్కువగా ఉంటుంది. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఇంట్లో అందరికీ వండిపెట్టడం, అవసరమైనవన్నీ అందించడం, ఆఫీసు పని ఇలా ఒకటేమిటీ పొద్దంతా ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఇలా యాంత్రిక జీవితంలో కొట్టుకుపోకుండా మనకుంటూ కొంత సమయం కేటాయించుకుందాం..
పెండ్లికి ముందు ఎన్ని అభిరుచులున్నా, పెండ్లైన తర్వాత వాటి కోసం సమయం కుదరడం లేదని పక్కకు పెట్టే వారు చాలా మంది మహిళలు ఉంటారు. ఆఖరికి ప్రాణ స్నేహితులు, ఇష్టమైన వస్తువులను, వంటలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. పిల్లలు పుట్టాక ఇంక చెప్పనవసరం లేదు. రోజంతా వారి అవసరాలు, ఆలనాపాలనా చూడడానికే సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలా యంత్రంలా ఇంకొకరి కోసం చేస్తూనే ఉంటే ఎప్పుడో ఒకసారి విసుగొస్తుంది. చిరాకు మొదలవుతుంది. కొన్నాళ్ళకే ఏదో కోల్పాయమన్న భావన ఏర్పడుతుంది. కానీ ప్రతి వ్యక్తికి తన అంటూ సొంత ఇష్టాలు, అలవాట్లు కొన్ని ఉంటాయి. నచ్చినది చేయాలని మనసుకు అనిపిస్తుంటుంది. అందుకే రోజులో కొంత సమయం, లేదంటే వారానికొకసారైనా ఎవరి కోసం వారు సమయం కేటాయించుకోవాలి. నచ్చిన పని చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
రోజులో 10 నిమిషాలు
పనుల ఒత్తిడిలో మనమెలా ఉన్నామో కూడా మన శ్వాస ఎలా ఉందో కూడా తెలుసుకోలేనంతగా ఉద్యోగం చేసే మహిళలు పరుగులు పెడుతుంటారు. కానీ ఒక్క సారి తను ఏంటి, తన కోసం ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నారా? ఆ పరుగులు ఆపి వేరే ఏ విషయం ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పది నిమిషాల పాటు ఉచ్వాస నిశ్వాసాలపై మనసు లగం చేసి గమనించండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి.
స్నేహితులు, బంధువులతో..
నిజమైన స్నేహితులని ఎప్పుడూ కోల్పోకూడదు. అప్పుడప్పుడైనా పలకరిస్తుండాలి. బంధువులలోనో, స్నేహితులలోనో మీ మంచి కోరుకునే వారంటూ ఎవరో ఉంటారు. మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మీ ఇష్టాలు, అభిరుచులను గౌరవించే వారు, మీ బాధలను పంచుకోగలమనుకునే వారితో కొంచెం సేపు మాట్లాడే ప్రయత్నం చేయాలి. బాధలో ఉన్నపుడు మాట్లాడితే మన బాధకు ఉపశమనం లభిస్తుందనుకునే వారితో కనీసం పది నుంచి పదిహేను నిమిషాలైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే మనసు కుదుటపడుతుంది.
బయటకు వెళ్ళడం : అప్పుడప్పుడూ సరదాగా కాసేపు నడుస్తూ బయటకు వెళ్ళడం, సమయానుకూలాన్ని బట్టి నచ్చిన ప్రదేశానికి వెళ్ళి రావడం వంటివి చేయాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. నడవడం వల్ల పట్టే చెమటకు శరీరంలోని విషపదార్ధాలు బయటకు వెళ్ళిపోతాయి. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే నడక మరీ మంచిది శరీరానికి కాస్త విటమిన్ డి కూడా అందుతుంది. బయట ఉండే పచ్చని మొక్కలు, చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి గందరగోళాలను పక్కకునెట్టి మెదడును చురుకుగా ఉంచుతాయి.
వంట చేయడం.. : నచ్చినవి వండుకోవడం లేదా ఏదైనా కొత్త వంటకం ప్రయోగం చేయడం వల్ల మనసుకు ఉత్సాహం ఏర్పడుతుంది. ఏదో నేర్చుకున్నామన్న తృప్తి ఉంటుంది. అలాగే మనకు ఇష్టమైన వారికి మన చేతితో వండి పెడితే ఆ ఆనందమే వేరు. అలాగే పిల్లల కోసం కూడా రోజులా కాక కొత్తగా ఏమైనా తయారు చేయవచ్చు. వంట చేయడాన్ని ఆస్వాదించాలి. అపుడే మనసు ఆహ్లాదంగా అనిపిస్తుంది.
పుట్టగానే ఏ ఒక్కరూ రచయితలు, కవులు కారు. మనసుకు నచ్చిన భావాన్ని పేపర్ మీద పెడితే భావుకత బయటకు వస్తుంది. ఇలాంటి ఆలోచనలు మనసును సంతోషంగా ఉంచుతాయి. అందుకని మనసు బాగోలేనపుడు డైరీ రాయాలి.
నచ్చినట్టు : ఎవరిని వారు ప్రేమించుకోకపోతే మరెవరూ ప్రేమించలేరు. ఈ విషయంపై ఒకసారి ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రోజువారీ ఎంత వరకు ఆనందంగా ఉంటున్నామో ఆలోచించుకోవాలి. మన కోసం ఏం చేసుకుంటున్నామో చూసుకోవాలి. స్పా, మసాజ్, రిలాక్సేషన్ పెడిక్యూర్, నెయిల్ పెయింట్, మానిక్యుర్ వంటి ఇష్టమైనవి చేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. అపుడప్పుడు ఇలా చేస్తుంటే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
- ఆఫీసులో పనిచేసి అలిసిపోయి ఇంటికి రాగానే మళ్ళీ ఇంటి పనుల్లో మునిగిపోయి విసిగిపోయే కంటే వేడినీటితో, ఆయిల్ మర్దన చేసుకుని నిదానంగా స్నానం చేసి తర్వాత ఇంట్లో ఏవైనా పనులు ఉంటే ప్రారంభించుకుంటే మనసు శరీరం హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది.
- ఏదైనా పని మొదలు పెట్టే ముందు, ఒక ఐదు నిమిషాలు మనసును లగం చేసి ప్రశాంతంగా కూర్చుంటే కూడా మనసుకు హాయిగా అనిపిస్తుంది. తర్వాత పనిని చేయడానికి మనసు ఉత్తేజితమవుతుంది.
రోజుకో మంచి పని : సాయం అవసరం ఉన్న వారికి, పేదవారి పట్ల దయ చూపించి, మంచి చేస్తే మనసులో ఆనందం వెల్లివిరిస్తుంది.
అలవాట్లు పెంచుకోవాలి : మనసుకు నచ్చిన పాటలు ఏవైనా సరే ఎంచుకుని పెట్టుకోవాలి. పనులు చేసుకుంటున్న సమయంలో పాటలు వింటూ ఉంటే మనసుకు ఉత్సాహంగా ఉంటుంది. తీరిక వేళల్లో మొక్కలు పెంపకం కూడా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది. బొమ్మలు గీయడం, నాట్యం చేయడం, ఇలా ఎన్నో మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అలవాట్లు చాలా ఉంటాయి. అందులో నచ్చిన వాటిపై దృష్టి సారించొచ్చు.
షాపింగ్‌కు వెళ్ళడం : ఎప్పటికప్పుడు కొత్తగాఉండాలనుకుంటే షాపింగ్ చేస్తుండాలి. కొత్త కొత్తగా ఏమేమి వచ్చాయో తెలుస్తుంది. మీకు నప్పుతాయనుకున్నవి ఎంచుకోవచ్చు.
చదవడం : స్ఫూర్తిని నింపేవి, ఆసక్తిని కలిగించే కొత్త పుస్తకాలు చదవడం, కొన్ని స్ఫూర్తి నింపే బ్లాగులు చదవడం వల్ల కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది.
పక్షులు, జంతువులతో.. : జంతువులను పెంచే పెట్సెంటర్, పక్షులు ఉండే ప్రాంతానికి వెళ్ళి వాటిని గమనించడం, వాటితో ఆడుకోవడం లేదా ఫొటోగ్రఫ ీవంటివి చేస్తుండడం వల్ల మనసు హాయిగా ఉంటుంది.
యాంత్రీకరణ వస్తువులకు దూరంగా.. : అవసరానికి మించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు దూరంగా ఉండాలి. అవసరం తీరగానే సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టాలి. లేదంటే రోజులో కొంతసమయమైనా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాలి. ఇలా చేస్తే కొన్ని ప్రతికూలతలు మనకు దూరంగా ఉంటాయి. ఇలా చేసే అవకాశం లేకుంటే కనీసం కొంతసేపైనా ఫోన్ పక్కకు పెట్టి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి.
వ్యాయామం, యోగ : రోజులో ఒక అరగంట వ్యాయామం, యోగ వంటివి చేస్తుంటే, శరీరం దృఢంగా, మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యంగమూ సొంతమవుతుంది. రోజంతా ఎంత బిజీగా ఉన్నా, వీటిలో కొన్నింటినైనా ప్రయత్నిస్తుంటే మీకోసం మీరు సమయం కేటాయించుకున్నట్టే. ఒక వేళ ఇవన్నీ చేస్తుంటే మరీ మంచిది. మీ కోసం మీరు ఆలోచించుకుంటున్నట్టే. సూర్యుడు లేని సూర్యకాంతికి ఎలా అర్థం ఉండదో.. సంతోషంగా గడపలేని జీవితానికి అర్థం ఉండదు.