Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాబ్ సెర్చ్‌లో పలు ప్రాథమిక అంశాలను అభ్యర్థులు విస్మరిస్తూ ఉంటారు. గూగిలింగ్ అంటే ఇప్పటి అర్థంలో సంబంధిత ఉద్యోగాన్వేషణ. అందుకోసం కనీసం నాలుగు సెకండ్ల సమయాన్ని కూడా వెచ్చించకుండానే ఒక నిర్ణయానికి చాలా మంది వచ్చేస్తారు. సమాచార సేకరణ, భిన్నాభిప్రాయాల స్వీకరణ, సంబంధిత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో సంప్రదింపులు వంటి ప్రక్రియ ఉద్యోగాన్వేషణలో ఉంటుంది. అదేదీ లేకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
లైన్‌గా రాసుకోండి :ఉద్యోగం ఏదైనప్పటికీ దరఖాస్తును ఆన్లైన్లో పంపినప్పుడు మొదట దాన్ని పరిశీలించేది హెచ్ఆర్ (హ్యూమన్ రిసోర్స్) విభాగానికి చెందిన కింది ఉద్యోగి. తను మొదట దరఖాస్తును సమీక్షిస్తాడు. జాబ్‌కు సంబంధించిన సూక్ష్మస్థాయి తేడాలు ఏమీ ఆ వ్యక్తికి తెలియవు. ఫలానా ఉద్యోగానికి మనం వెతుకుతున్న వ్యక్తి ఈమే అనే ఇంప్రెషన్ అలాంటి వ్యక్తికి కలిగించాలి. ఇక్కడే ఒక సూచన పాటించాలి. దరఖాస్తు చేస్తున్న జాబ్, అది దక్కితే చేయాల్సిన విధులకు సంబంధించి సాధ్యమైనంత సమాచారం సేకరించండి. మంచి పదాలు, పదబంధాలు లేదంటే బలాలు, బలహీనతలు... ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు లైన్‌గా రాసుకోండి. అందులో నుంచి ఎంపిక చేసుకుని రెజ్యూమ్ రూపొందించుకోండి.
పరిమితం కావద్దు: ఆన్లైన్లో దరఖాస్తు పెట్టడంతోనే పని అయిపోదు. ఆ దరఖాస్తును ముందుకు కదిలించాలి. ఏ మాత్రం వీలున్నా అక్కడి సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ రిఫరల్ ద్వారా వెళితే కనక సదరు వ్యక్తుల ద్వారా హెచ్ఆర్ని సంప్రదించే ప్రయత్నం చేయొచ్చు. ఇంకొద్దిగా బుర్రకు పదునుపెట్టి మీ దరఖాస్తును ప్రాసెస్ చేయగల నేర్పరితనం ఉన్న వ్యక్తులను కలుసుకోగలిగితే ఇంకా మంచిది. అయితే ఇవన్నీ ఇంటర్వ్యూకు వచ్చేలా చూసుకునే వరకు మాత్రమే ఉండాలి. లేకుంటే అసలుకే మోసం వస్తుంది. రిఫరల్ వ్యక్తుల ద్వారా ఇంటర్వ్యూ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవచ్చు. అలాగే అక్కడి వాళ్ళతో మాట్లాడే సందర్భంలో ఇంటర్వ్యూ లేదంటే ఎంపిక చేసుకునే క్రమానికి సంబంధించిన విషయాలనూ తెలుసుకోవచ్చు.
ఇలా ఉంటే చాలు : రెజ్యూమ్ ముచ్చటగా ఉండాలే తప్ప అతి ఫాన్సీగా ఉండొద్దు. లింక్డిన్ ప్రొఫైల్ ఊపిరిపీల్చుకునేందుకు అవకాశం కలిగించేదిగా ఉండాలి. చేయబోయే ఉద్యోగానికి తగినవిధంగా ఉండాలి. ఒక వేళ అలా లేకుంటే అందుకు అనుగుణంగా పదాలు, అవసరమైతే వాక్యాలను తిరగరాయండి. బుల్లెట్ పాయింట్స్‌గా అమర్చుకోండి. రెజ్యూమ్‌లో ఎప్పుడైనా జీవం ఉట్టిపడాలి. సెర్చ్ చేస్తున్న జాబ్‌కు అనుగుణంగా ఉండాలి. చూడగానే ఫ్రెష్ ఫీలింగ్ కలిగించాలి.
బోర్ కొట్టించవద్దు: ఒకే పదాలను మళ్లీ మళ్లీ రాస్తే చూసేవ్యక్తికి బోర్‌గా ఫీలవుతాడు. పాలిష్డ్, ఆర్టిక్యులేట్, మచ్ ప్రొఫెషనల్ వంటి పదాలను అదే పనిగా రాయవద్దు. ఈ పదాలు దొర్లకపోతే అది రెజ్యూమ్ కాదన్న పద్ధతిలో కొందరు వాదిస్తుంటారు. ఆ వాదన తప్పు. అన్నింటికీ మించి ఆకట్టుకునే ప్రాథమిక లక్షణాన్ని దరఖాస్తు కోల్పోతుంది. ఉద్యోగానికి తగ్గట్టు ఆయా పదాలను జోడించి ఒకింత కొత్తదనం కలుగజేస్తే చూడగానే రిక్రూటర్ ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది.