Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుచ్చకాయ... ఈ వేసవిలో ఎంత తింటే అంత మంచిది! అలాగని కేవలం సలాడ్గానో, జ్యూస్‌గానో మాత్రమే తాగితే ఏం బాగుంటుంది. దానికి ఏదో ఒకటి చేర్చి మరింత రుచికరంగా తయారు చేస్తే ఎవ్వరైనా ... వాట్ ఏ మిలన్ అనక మానరు. అలాంటి వెరైటీస్‌ను మీరూ ట్రై చేయండి.
పుచ్చకాయ జెల్లీ
కావలసిన పదార్థాలు: పుచ్చకాయ- ఒకటి, పంచదార- తీపికి తగినంత, అగర్అగర్- అరచెంచా
తయారీ విధానం: ముందుగా పుచ్చకాయని రెండు ముక్కలుగా చేసుకుని లోపలి గుజ్జు అంతా తీసి పుచ్చకాయ డొప్పలని పక్కన పెట్టుకోవాలి. గుజ్జుని బ్లెండర్లో వేసి పుచ్చకాయ రసాన్ని వడకట్టుకోవాలి. కొంత రసంలో అగర్ని కానీ జెలాటిన్‌ని కానీ వేసి కరిగేంతవరకూ ఉంచాలి. తక్కిన రసాన్ని పొయ్యిమీద ఉంచి, పంచదార వేసి కరగనివ్వాలి. ఇందులో అగర్ కలిపిన రసాన్ని కూడా వేసి ఐదునిమిషాల పాటు ఉంచి మనం పక్కన పెట్టిన పుచ్చకాయ ఖాళీడొప్పల్లో ఈ రసాన్ని వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. తెల్లారాక పుచ్చకాయను ముక్కలుగా కోసుకోవడమే.
పుచ్చకాయ మిల్క్‌షేక్
కావలసిన పదార్థాలు : తాజా పుచ్చకాయ ముక్కలు - మూడు కప్పులు, పుదీనా ఆకులు - పావుకప్పు, తాగే సోడా - అరకప్పు, వెనిల్లా ఐస్‌క్రీం - నాలుగు పెద్ద చెంచాలు.
తయారీ విధానం : మొదట పుచ్చకాయ ముక్కలు, సన్నగా తరిగిన పుదీనా ఆకులు మిక్సీలోకి తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ రసంలా చేసుకోవాలి. ముందుగా గ్లాసుల్లోకి వెనిల్లా ఐస్‌క్రీం తీసుకుని తరవాత వడకట్టిన పుచ్చకాయ రసం వేయాలి. చివరగా కొద్దిగా తాగే సోడా వేసుకుని పైన రెండు పుదీనా ఆకులు అలంకరిస్తే చాలు.
వాటర్మెలన్-హనీ లస్సీ
కావలసిన పదార్థాలు : పుచ్చకాయ ముక్కలు-2 కప్పులు, స్వీట్ లస్సీ-1/2 కప్పు, హనీ-2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసన్స్- 1/2 టీ స్పూన్లు, జీడిపప్పు, ఫ్రూటీ, చెర్రీ-తగినంత , మిల్క్ మెయిడ్ క్రీమ్ -2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం : ముందుగా పుచ్చకాయ ముక్కలను విత్తనాలు లేకుండా మిక్సీలో వేసి జ్యూస్ చేసి ఉంచుకోవాలి. ఈ జ్యూస్‌లో స్వీట్ లస్సీ, వెనీలా ఎసన్స్ వేసి మిక్సీలో మళ్లీ తిప్పి ఒక గ్లాస్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసేముందు పైన మిల్క్‌మెయిడ్, హనీ, ఫ్రూటీ, చెర్రీ వేసి గ్లాస్ పైన ఒక పుచ్చకాయ ముక్క పెట్టి ఇవ్వాలి.
వాటర్మెలన్ సలాడ్
కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు -ఒక కప్పు, తర్బూజముక్కలు - అర కప్పు, పుదీన - రెండు రెమ్మలు, పెరుగు - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు - చిటికెడు
తయారు చేసే విధానం : ఇది చాలా సులభంగా చేసుకోగలిగే సలాడ్. ఒక బౌల్లో పుచ్చకాయ, తర్బూజ ముక్కలు వేసి అందులో పుదీన ఆకులు, పెరుగు, ఉప్పు కూడా కలపాలి. అంతే! వాటర్మెలన్ సలాడ్ రెడీ.
వాటర్మెలన్ ఐస్డ్ టీ
కావలసిన పదార్థాలు : బ్లాక్ టీ ఆకులు (నీలగిరి) - ఆరు టీస్పూన్లు, మరిగించిన నీళ్లు - మూడు కప్పులు, ఐస్- మూడు కప్పులు, వాటర్మెలన్ (పుచ్చకాయ) - పావు ముక్క, నిమ్మ రసం - రెండు టేబుల్ స్పూన్లు, పంచదార - ఒక టేబుల్ స్పూన్, పుదీనా - కొద్దిగా.
తయారీ విధానం : మరుగుతున్న నీళ్లలో తేయాకుల్ని వేయాలి. మూడు నుంచి ఐదు నిమిషాలయ్యాక వడకట్టాలి. అది గది ఉష్ణోగ్రతకు వచ్చాక ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత పుచ్చకాయ, పుదీనా, నిమ్మరసం, పంచదారలను బ్లెండర్లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. వాటర్మెలన్ ఐస్డ్ టీ తాగేందుకు, ఒక పెద్ద గ్లాసులో బ్లాక్ టీ, బ్లెండ్ చేసిన వాటర్ మెలన్ పోయాలి. ఇలా పోయగానే వేటికది విడిపోతుంటుంది. వెంటనే స్పూన్‌తో కలపేయండి. పైన పుదీనా ఆకుతో అలంకరించి తాగేస్తే బోల్డెంత తాజాదనంగా ఉంటుంది.ఒకవేళ వాటర్మెలన్ ఐస్డ్టీ మిగిలిపోతే మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచి, మరుసటిరోజు తాగొచ్చు.