Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టవ్ మీద ఏమైనా పెట్టి కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నామంటే చాలు అవి పొంగిపోయి మొండి మరకలు పడుతుంటాయి. తరువాత వాటిని శుభ్రం చేయడానికి ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. కానీ కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా స్టవ్‌పై మరకలన్ని సులభంగా పోగొట్టవచ్చు.
- మొండి మరకలన్ని వేడి నీటితో తడిచేసి తరువాత బేకింగ్ సోడాని చల్లాలి. నైలాన్ వస్త్రం లేదా ఒక స్క్రబ్బింగ్ స్పాంజీతో దాన్ని గట్టిగా రుద్దాలి. కొద్ది సేపటి తరువాత వేడినీటితో కడగాలి.
- బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్ల తొక్కలను ఒక గాజు సీసాలోకి తీసుకొని దానిలో కొన్ని చుక్కలు వెనిగర్ వేసి గాలి పోకుండా మూత పెట్టాలి. రెండు వారాల తరువాత మూత తీసి ఆ ద్రావణాన్ని వడకట్టాలి. ఈ ద్రావణంతో వంట గదిలోని ఎటువంటి మరకలనైనా పోగొట్టవచ్చు
- జిడ్డు మరకలున్న చోట కొన్ని చుక్కల వెనిగర్ వేయాలి. రెండు నిమిషాల తరువాత దాన్ని ఒక స్పాంజీతో తుడిస్తే మరకలు పోతాయి. కానీ మార్బుల్‌తో చేసిన వాటిపై వెనిగర్ వేయకూడదు.
- గిన్నెలు కడగడానికి ఉపయోగించే లిక్విడ్ కొన్ని రకాల మరకలను పోగొట్టడానికి సహాయ పడుతుంది. దీనిలో బ్లీచ్ ఉంటుంది. ఈ ద్రావణాన్ని మరకలపై చల్లి స్పాంజీతో రుద్ది కడిగేస్తే మరకలు వదులుతాయి.
- ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని మరకలపై రాసి బాగా రుద్ది కొద్దిసేపటి తరువాత వేడినీటితో కడిగేయాలి.