Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీణ ఇంటికి వచ్చేసరికి గుమ్మానికి రెండు తాళాలు వెక్కిరిస్తూ కనిపించాయి. ఇదేంటి? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లాడు? రెండు తాళాలు ఎందుకు వేశాడు? అనుకుంటూ ఇంటి ఓనరు తలుపు కొట్టింది. 'నాలుగు నెలల నుంచి అద్దె ఇవ్వడం లేదు. నువ్వు అనారోగ్యంతో పుట్టింటికి వెళ్లావు. రెండురోజుల నుంచి మీ ఆయన కనిపించలేదు. కిరాయి డబ్బులు ఎవరిని అడగాలో తెలియక మేమే తాళం మీద తాళం వేశాం' అన్నాడు ఇంటి యజమాని. ఏం చేయాలో తోచక తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది వీణ. ఇంటి కిరాయి కూడా కట్టకుండా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న భర్తను సరైన దారిలో పెట్టాలంటే ఐద్వా అదాలత్‌ను ఆశ్రయించాల్సిందే అని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో తల్లిదండ్రులను తీసుకుని ఐద్వాకు వచ్చిందామె.
వీణ తల్లిదండ్రులు పదేండ్ల కిందట హైదరాబాద్‌కు బీహార్ నుంచి వలస వచ్చారు. భవననిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లడంతో పిల్లలకు చదువులు చెప్పించలేకపోయారు. ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేశారు. మగపిల్లలను తమతో పాటు పనుల్లోకి తీసుకువెళ్లేవారు. వీణ చిన్నబిడ్డ. రెండేండ్ల కిందట ఆమెకు వరుణ్‌తో పెండ్లి చేశారు. వరుణ్‌కు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి, మేనమామలు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. పెండ్లి అయిన కొద్దిరోజులకు తండ్రి కూడా చనిపోయాడు. మేనమామలే ఆయనకు ఉన్న పెద్దదిక్కు. ఏడాది పాటు బాగానే ఉన్నాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఒకడి సంపాదన తో బతకడం కష్టమని వీణ కూడా చిన్న ఉద్యోగంలో చేరింది. ఇక అప్పటి నుంచి వరుణ్ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం మానేసాడు. ఇంటి కిరాయి కూడా కట్టడం లేదు. కొద్దినెలలు వీణ తన జీతమంతా ఇంటి కిరాయికి, ఇతర అవసరాలకు ఖర్చు చేసింది. అనారోగ్యం కారణంగా నాలుగునెలల కిందట ఆమె ఉద్యోగం మానేసింది. ఇక అప్పటి నుంచి ఇంటి కిరాయి అలాగే బకాయి ఉండిపోయింది.
'ఇద్దరం కష్టపడి కొద్ది డబ్బు జమ చేసుకోవచ్చు అని నేను ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి ఆయన తన జీతం ఇవ్వడం మానేశాడు. అడిగితే నీ జీతం ఎవ్వరికి ఇస్తున్నావు? మీ అమ్మవాళ్లకు పంపిస్తున్నావా? అంటూ గొడవ. నా జీతంతో ఇల్లు గడిస్తే మరి ఆయన జీతం ఏం చేస్తున్నాడో చెప్పడం లేదు. అడిగితే.. నీకెందుకు అంటూ కొడుతున్నాడు. నేను చేసేది బట్టల షాపులో.. ఎక్కువ సేపు నిలబడే ఉండాలి. దాంతో నీరసంగా ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి కూరగాయలు, సరుకులు ఏమీ తీసుకురావడం లేదు. అన్నీ నేనే చేసుకోవాలి. నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఉద్యోగం మానేసాను. దాదాపు నాలుగునెలల నుంచి ఇంటి కిరాయి కట్టడం లేదు. ఇంట్లోకి సరుకులు తేవడం లేదు. వారం రోజుల కిందట నేను మా పుట్టింటికి వెళ్లాను. తిరిగి వచ్చేసరికి ఇంట్లో లేడు. ఓనరువాళ్లు తాళం వేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి' అంది వీణ.
'మీ ఆయన మేనమామలకు ఫోన్ చేశావా? అక్కడ ఉన్నాడేమో తెలుసుకున్నావా' అడిగారు బాధ్యులు. 'లేదు మేడమ్! వాళ్లే ఆయనకు అన్ని నేర్పిస్తారు. వాళ్ల మాట బాగా వింటాడు' అంది వీణ. 'సరే వాళ్లకు ఫోన్ చేయి. మేం మాట్లాడుతాం' అనగానే వీణ వరణ్ మేనమామలకు ఫోన్ చేస్తే.. 'రెండురోజుల కిందట ఇక్కడికి వచ్చాడు. ఏం జరిగిందో చెప్పలేదు' అన్నారు. 'మీరు వరుణ్‌ను తీసుకుని మా ఆఫీస్‌కు రండి. అన్ని విషయాలు మాట్లాడుకుందాం' అన్నారు బాధ్యులు. వరుణ్‌ను తీసుకుని అతని మేనమామలు వచ్చారు. అమాయకంగా చూస్తూ.. మౌనంగా కూర్చున్నాడు వరుణ్. అతని పెద్దమేనమామ మాట్లాడుతూ 'తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి అనారోగ్యంతో ఏడాది కిందట చనిపోయాడు. చెప్పేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడప్పుడు మేమే వెళ్లి ఎలా ఉన్నారో చూసి వస్తుంటాం. వీణ ఉద్యోగం చేస్తుందని తెలిసి సంతోషించాం. ఇద్దరు కలిసి జీవితాన్ని ఆనందంగా గడుపుతారని అనుకున్నాం. కానీ, ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాడు' అన్నాడు.
'ఇంట్లో ఖాళీగా ఉండలేక వీణ ఉద్యోగానికి వెళ్లింది. కొద్ది డబ్బులైనా జమ చేయవచ్చు. పుట్టే పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆమె ఆలోచన. ఆమె జీతం అంతా ఇంట్లోకి వాడేసి.. తన జీతం జల్సాగా ఖర్చు చేశాడు వరుణ్. భార్య జీతంతో బతకాలని చూశాడు. ఆమె అనారోగ్యం గురించి పట్టించుకోలేదు. దాంతో వీణ ఉద్యోగం మానేసింది. అప్పులు మిగిలాయి. కిరాయి కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. ఇద్దరు కలిసి బాధ్యతలను పంచుకుంటేనే ఆ ఇంటిలో సంతోషం ఉంటుంది. మహిళలు ఈరోజు గురించే కాకుండా రేపటి గురించి కూడా ఆలోచిస్తారు. దాన్ని మగవారు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆమె జీతం మీద పెత్తనం చేయాలని చూస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇకనైనా బుద్ధిగా ఉద్యోగం చేయి. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి' అన్నారు బాధ్యులు. 'నేను చేసిన పొరపాటు ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. ఇంట్లో చెప్పేవారు లేని లోటు మీ ద్వారా తీరింది. ఇకమీద ఇంటిబాధ్యతలు తీసుకుంటాను' అన్నాడు వరుణ్. మేనమామలు ఇచ్చిన డబ్బుతో ఇంటి కిరాయి కట్టేసి ఆ తర్వాత కొద్దికొద్దిగా వారికి తిరిగి ఇచ్చేశాడు వరుణ్ . అతనిలో మార్పు రావడంతో వీణ కూడా మళ్లీ ఉద్యోగంలో చేరింది. ఇద్దరి జీతాల నుంచి ఇంటి ఖర్చులు పోనూ కొంత మొత్తం పొదుపు చేయడం ప్రారంభించారు. వారం రోజులకు ఒకసారి ఫోన్ చేసి వారి గురించి వాకబు చేసేవారు ఐద్వా బాధ్యులు. వారి జీవితాలు బాగు పడ్డాయన్న నమ్మకం వచ్చిన తర్వాత ఫోన్ చేయడం తగ్గించినా వీలైనప్పుడల్లా క్షేమసమాచారాలు తెలుసుకుంటూనే ఉన్నారు.
సంతోషం ఉంటుంది. మహిళలు ఈరోజు గురించే కాకుండా రేపటి గురించి కూడా ఆలోచిస్తారు. దాన్ని మగవారు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆమె జీతం మీద పెత్తనం చేయాలని చూస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇకనైనా బుద్ధిగా ఉద్యోగం చేయి. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి'