Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు. పిల్లలకెప్పుడూ మార్గదర్శకులు తల్లిదండ్రులే. పెద్దయ్యాక వాల్ల జీవితాల్లో ఏవైన సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఉపయోగపడేవి బాల్యంలోని అలవాట్లే. పెద్దయ్యేకొద్దీ పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. అందుకే తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శం. తల్లిదండ్రుల అలవాట్లు, తెలివితేటలే పిల్లలకూ వస్తాయి. అందుకే మంచి, చెడులను చెప్పాలి. మంచిని ఎంచుకునేలా ప్రోత్సహించాలి.
- పిల్లలు ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు. చిప్స్, స్వీట్స్, బిస్కట్స్, చాక్లెట్స్. నూడిల్స్, పాస్తా, కేక్స్, కుకీస్, పిజ్జా వంటివి. ఇవి కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే... వాళ్ల కంటికింపుగా ఉండాలి. రంగురంగుల టిఫిన్స్‌తో వారానికి ఓ హరివిల్లును ఏర్పాటు చేయండి. రోజుకో కలర్‌ను తినేలా ప్రోత్సహించండి. దీంతో పిల్లలు ఆనందంగా తింటారు. మీరు వారికి ఆరోగ్యాన్నిచ్చినవాళ్లవుతారు.
- సోఫాలో కూర్చుని టీవీ చూడటానికే తల్లిదండ్రులు మొగ్గుచూపుతారు. పిల్లలూ దాన్నే ఫాలో అవుతారు. అది చాలా తప్పు. వాళ్లను బయటికి తీసుకెళ్లండి. వ్యాయామం నేర్పించండి. బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. మీరూ వాళ్లతో కలిసి ఆడండి, పాడండి. జీవనశైలితో వచ్చే అనారోగ్య సమస్యలు వాళ్ల దరి చేరకుండా ఉంటాయి.
- ఒకానొక వయసులో పిల్లలు తమ బట్టల మీద ఉన్న లేబుల్స్ చూడటానికి ఇష్టపడతారు. అలాంటి వాటికంటే ఫుడ్ ప్యాకెట్స్ మీద ఉన్న లేబుల్స్ చదివించే ప్రయత్నం చేయండి. అవి జీవితానికి అత్యంత అవసరమని చెప్పండి. ఆహార పదార్థాల్లో ఉన్న పోషకాల గురించి తెలుసుకునేలా చేయండి. అదో అలవాటుగా మార్చండి. అది జీవితకాలం మనసులో ఉండిపోతుంది. పెద్దయ్యాక కూడా దాన్నే ఫాలో అవుతారు.
- బిజీ జీవితాలతో కుటుంబంతో, పెద్దవాళ్లతో కలిసే సమయం ఉండటం లేదు. కుటుంబాన్ని పట్టించుకోకుండా, మీ పిల్లలు చెప్పేది వినకుండా, వాళ్ల వ్యక్తిగత జీవితాలను పట్టించుకోకుండా ఎంత బిజీగా ఉన్న ప్రయోజనం ఉండదు. అందుకే కనీసం రాత్రిపూట డిన్నర్ అయినా వాళ్లతో కలిసి చేసే ఏర్పాటు చేసుకోండి. అది మీ జిల్లల దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది. అలా కలిసి కూర్చుని తినడం వల్ల పిల్లలు అందరికీ మానసికంగా దగ్గరవుతారు. అనుబంధం పెరుగుతుంది. బయట జంక్‌ఫుడ్ అలవాట్లు తగ్గుతాయి.
- పరిశుభ్రత చాలా కీలకమైన అంశం. పిల్లలుగా నేర్చుకున్నదే పెద్దయ్యాక అలవడుతుంది. కాబట్టి వాళ్ల వాళ్ల వస్తువులను, గదిని చక్కగా, శుభ్రంగా పెట్టుకోవడం నేర్పించండి. మరీ చిన్నపిల్లలయితే సర్దుకోవడంలో మీరు సహాయం చేయండి.
- పిల్లలకు వస్తువుల విలువ తెలియజెప్పండి. లేనివాళ్లతో వాటిని పంచుకోవడమెలాగో చెప్పండి. కేవలం వస్తువులనే కాదు భావోద్వేగాలను, కథలను పంచుకోవడం నేర్పించండి. మొదట ఇంట్లో తల్లిదండ్రులు, గ్రాండ్‌పేరెంట్స్, తోబుట్టువులు, కజిన్స్, ఇతర కుటుంబ సభ్యులు, బయటివాళ్లతో... వివిధ విషయాలను ఎలా షేర్ చేసుకోవాలో చెప్పండి.
- బయట ఏదైనా తిన్నతరువాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు చాలా మంది. మీరు చేసిందే భవిష్యత్‌లో మీ పిల్లలు చేస్తారు. అందుకే చెత్తనంతా ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసుకుని ఇంటికొచ్చాక చెత్తబుట్టలో వేయండి. మీ పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేయండి.
- మనం ఇతరులను గౌరవిస్తే... ఇతరులు మనను గౌరవిస్తారు. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పండి. జీవితంలో వాళ్లు ఆచరించేలా చూడండి. మీరూ ఆచరించి చూపండి.
- పిల్లలు అమాయకులు. మనం ఏం నేర్పిస్తే.. వాళ్ల మెదళ్లలో అదే నిక్షిప్తమవుతుంది. కాబట్టి అందరినీ సమానంగా చూడటం నేర్పించండి. నిష్పక్షపాతంగా మీరూ ఉండండి. కుల మతాలకు అతీతంగా వాళ్లూ ఉండేలా ప్రోత్సహించండి.