Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యం కోసం ఆరాటపడే వారంతా ఎలాంటి ఖర్చులేకుండా రోజూ అరగంట పరుగుదీస్తే చాలంటున్నారు సాగరిక మెల్కోటే. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె భాగ్యనగరాన్ని మారథాన్ పరుగుల నగరంగా మార్చడానికి విశేషకృషి చేస్తున్నారు. ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే, హార్ట్ డే, ఫ్యామిలీ హెల్త్ డే, గర్ల చైల్ట్ సేఫ్టీ డే, హెల్త్ డే ఇలా డే ఏదైనా రన్ రన్ అంటూ ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు 'దక్కన్ బర్డ్' కమిటీ సభ్యురాలిగా ప్రకృతితో మమేకం చేసే కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రన్నింగ్ ఈజ్ మోస్ట్ ఫిట్నెస్ యాక్టివిటీ అంటున్న ఆమె పరిచయం..
నాన్న శంకర్ మెల్కోటే. బిజినెస్‌మాన్, సినీకళాకారుడు. అమ్మ ప్రొఫెసర్ రమామెల్కోటే. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్సు విభాగంలో ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యారు. చిన్నతనం నుంచి ఇంట్లో వాతావరణం కళలు, సాహిత్యంతో కలగలిసి ఉండేది. సెయింట్ జాన్స్ స్కూల్లో పదోతరగతి, స్టాన్లీ జూనియర్ కాలేజీలో ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటీ లో బిఇ కంప్యూటర్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత అనేక సంస్థల్లో స్టాఫ్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశాను. టెక్ మహేంద్రలో ఆపరేషన్స్ మేనేజర్‌గా చేసి ఆ తర్వాత ఉద్యోగం మానేశాను.
సరదాగా ప్రారంభమై..
మేం కెబిఆర్కు సమీపంలోకి మారాం. రోజూ పొద్దున్నే రన్నింగ్, వాకింగ్, జాగింగ్ కోసం వచ్చేవారిని గమనిస్తూ ఉండేదాన్ని. ఎక్కడి ఎక్కడి నుంచో వస్తారు. పక్కననే ఉన్నాం కదా.. సరదాగా వెళ్దాం అనిపించింది. అలా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత మనసుకు ఎంతో ఉత్సాహంగా అనిపించి వాకింగ్ నుంచి జాగింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని.
రన్నర్స్ గ్రూప్‌తో పరిచయం..
వాకింగ్, జాగింగ్‌తో పాటు రోజు కొంతమంది రన్నింగ్ చేసేవారు. వారితో పరిచయం ఏర్పడిన తర్వాత వాకింగ్, జాగింగ్ మానేసి రోజూ రన్నింగ్ ప్రారంభించాను. మా రన్నింగ్ గ్రూప్‌లోని మరోవ్యక్తి రాజేష్ గారికి రన్నర్స్ గ్రూప్ ఏర్పాటుచేయాలన్న ఆలోచన వచ్చింది. అలా పన్నెండేండ్ల కిందట కొంతమందితో 2007లో హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ ఏర్పడింది. ఐదుగురితో ప్రారంభమైన ఈ గ్రూప్‌లో ఇప్పుడు ఐదువేల మంది సభ్యులు ఉన్నారు.
విల్ పవర్ పెంచే..
ఆరోగ్యం కోసం నడక అన్నది చాలా ముఖ్యం. నేటి ఆధునిక యాంత్రిక యుగంలో అన్ని పనులు చకాచకా యంత్రాల సహాయంతో జరిగిపోతున్నాయి. శారీరకశ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిని నివారించడానికి రన్నింగ్ చాలా మంచిది. మనసు, శరీరం ఫిట్‌గా ఉంచడానికి రన్నింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రన్నింగ్ చేయడం వల్ల విల్ పవర్ పెరుగుతుంది.
బెట్ వేసుకుని..
నేను బాగా బుక్స్ చదువుతాను. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఇష్టం. మా ఫ్రెండ్స్ బుక్ మొత్తం చదివేలోగా నేను రన్నింగ్ పూర్తి చేయాలని చిన్నచిన్న బెట్ లు వేసుకునేవాళ్లం. వాళ్లు మొదలు పెట్టిన బుక్ రీడింగ్ పూర్తి కాకముందే నా రన్ పూర్తి అయ్యేది. అలా రన్నింగ్‌పై ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత 2కె, 5కె, 10కె రన్స్‌లో రన్నింగ్ చేశాను. హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించే ప్రతి రన్లో స్వచ్ఛందంగా పాల్గొనేదాన్ని.
రెండు మారథాన్లల్లో..
పరుగు మొదలు పెట్టిన తర్వాత ఇక ఆగలేదు. హైదారాబాద్‌లో జరిగే రన్స్‌తో పాటు వివిధ నగరాల్లో జరిగే రన్స్లోనూ పాల్గొనేదాన్ని. ఈ పరుగులో విజేతలు, పరాజితులు అంటూ ఉండదు. పరిగెత్తిన వారంతా ఆరోగ్యాన్ని గెలుచుకుంటారు. రన్నింగ్ వల్ల శరీరంలోని కండరాలే కాదు మనసు గట్టిపడుతుంది. నిరాశ, డిప్రెషన్ తగ్గుతాయి. మనలోని శక్తిని వెలికితీసి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అందుకే సరదాగా ప్రారంభించిన పరుగు మారథాన్ వరకు చేయగలిగాను. హైదరాబాద్ 10కె రన్లో పాల్గొన తర్వాత మారథాన్ చేయగలను అన్న నమ్మకం ఏర్పడింది. ఆఫ్ మారథాన్ చేసిన తర్వాత మరింత ధైర్యం వచ్చింది. న్యూయార్స్లోనూ, గ్రీస్‌లోనూ ఫుల్ మారథాన్ చేయగలిగాను.
ప్రపంచవ్యాప్తంగా..
మ్యూజిక్, నేచర్ లవర్స్ ఎలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో రన్నింగ్ కమ్యూనిటీ ప్రజలు కూడా ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు. ఎక్కడ మారథాన్లు నిర్వహించినా.. దేశాల సరిహద్దులు దాటి మరీ పరుగులు తీయడానికి ఉరకలు వేసే ఉత్సాహంతో వస్తారు. ఇలా వచ్చిన వారంతా రన్నింగ్‌ను హాబీగా చేసుకున్నవారే. పదిపదిహేను ఏండ్ల కిందట ఒలింపిక్స్‌లో పాల్గొనే రన్నర్స్ తప్ప మిగతావారు రన్నింగ్ వైపు ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పుడు ఇండియాలోనే బెస్ట్ మారథాన్ సిటీగా హైదరాబాద్ పేరు వినిపిస్తుంది. ఇందుకు హైదరాబాద్ రన్నర్ గ్రూప్ ఎంతో కృషి చేస్తుంది. ప్రతి ఏడాది ఆగస్టు ఆఖరి వారంలో హైదరాబాద్ మారథాన్ నిర్వహిస్తున్నాం. గత ఏడాది 22వేల మంది పాల్గొనారు. ఈ ఏడాది 25వేల మంది వస్తారని అనుకుంటున్నాం. 2014లో మొదటిసారి హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. ఇప్పుడు రెండోసారి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
పిల్లలకు ప్రత్యేకంగా..
నగరం జీవనంలో బిజీగా మారి ప్రకృతికి దూరమై పోతున్నారు. మళ్లీ వీరందరినీ ప్రకృతికి దగ్గరగా తీసుకుపోయేందుకు ప్రతినెలా దక్కన్ బర్డ్స్ కమిటీ నుంచి బర్డ్స్ వాచింగ్ కు తీసుకువెళ్తాం. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, వింత పరిమళాలు వెదజల్లే కుసుమాలు, రంగురంగుల సీతాకోకచిలుకలు ఇలా ప్రకృతి అందాలు చూస్తే నడవడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా ఫారెస్ట్ వాకింగ్, బర్డ్స్ వాచింగ్‌కు వెళ్తాం. అంతేకాదు ప్రకృతి సంబంధమైన సినిమాలను, డాక్యమెంటరీలను చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నాం.
ప్రకృతి నుంచి వచ్చిన మనిషి ప్రకృతిని మరిచిపోతే మనిషికి మనుగడ లేదన్న అన్న విషయం ప్రతి ఒకరూ గుర్తుంచుకోవాలి.