Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుణేలోని చాల్లో నివసిస్తున్న 35 ఏండ్ల మాధురి.. భర్త చనిపోయాడు. ఒంటరి మహిళగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఇబ్బందికరమైన చూపులు, అసహ్యకరమైన మాటలు. ఒకప్పుడు చాల్లో తిరగాలంటే.. భయపడేది. బౌన్సర్ ట్రైనింగ్ పొందిన తరువాత... ఈ మె వైపు చూడాలంటే మగాళ్లు భయపడుతున్నారు.
వైష్ణవి... తండ్రిని కోల్పోయింది. చిన్న తమ్ముడు, తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై పడింది. బౌన్సర్స్ గ్రూపులో చేరింది. ఆమె జీవితానికి కొత్త దారి దొరికింది. ఇప్పుడు ఆమెకు ఇది ఉపాధి మాత్రమే కాదు.. కాలేజీలో ఓ ఇమేజ్. ఆమెను టీజ్ చేయడానికే కాదు... ఆమె స్నేహితులను సైతం టీజ్ చేయడానికి భయపడుతున్నారు అబ్బాయిలు.
ఈ ఇద్దరి మహిళల బలం వెనుక మరో మహిళ కృషి ఉన్నది. ఆమె దీప. ఒక మార్గంలో నడవడం సులభం. కానీ ఆ బాటను వేయడమే కష్టం. అలా కష్టమైన మార్గాల్లో ముందుకు నడిచి... మరెందరో మహిళలకు మార్గదర్శకురాలిగా నిలిచిందామె.
దీపకు పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. కానీ కాలం కలిసి రాలేదు. నటి అయ్యింది. బాలీవుడ్ మూవీస్‌లో పోలీసు పాత్రలు పోషించింది. అలా ముంబైలో మహిళా బౌన్సర్లను చూసింది. ఉద్యోగంలో స్థిరపడడానికి బౌన్సర్లతో పని చేస్తే ఉపయోగపడుతుందని అనుకొన్నది. వెంటనే వాళ్లతో జాయిన్ అయి శిక్షణ తీసుకుంది. వాళ్లతో పాటు ఈవెంట్లకు వెళ్లి పని చేసేది. వెళ్లిన చోట మహిళా బౌన్సర్లను కలుసుకొనేది. కానీ పురుష బౌన్సర్ల పనికి, మహిళా బౌన్సర్ల పనికి చాలా తేడా ఉండేది. తాగి పడిపోయిన మహిళలను కార్ వద్దకు తీసుకెవళ్లడం, మహిళలను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లడంలో సాయం చేయడం వంటి చిన్న పనులు ఉండేవి. బౌన్సర్లుగా మహిళలు ఎక్కువగా పనిచేయలేరు అన్నది దీపను కలచివేసింది. ఆమెనే ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసింది. పురుషులతో సమానంగా పని చేసే బౌన్సర్లను తయారు చేస్తున్నది.
2017లో..
దీప... రంగ్రాగిణి బౌన్సర్స్ గ్రూపును పుణేలో ఏర్పాటు చేసింది. ఐదేండ్లకుముందు... పబ్బుల్లో మహిళా బౌన్సర్లను చూసింది దీప. కానీ వాళ్లు చాలా తక్కవ మంది. వాళ్ల పట్లఉన్న ఆసక్తి ఆమెను ఉచితంగా మహిళలకు బాడీ బిల్డింగ్, శక్తి కూడగట్టుకోవడం వంటి ట్రైనింగ్ ఇచ్చేందుకు దోహదపడింది. 12 మందితో మొదలైన ఈ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు... 550 మహిళా బౌన్సర్లు తయారయ్యారు. కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాదు. వాళ్లకు బాడీగార్డులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు కూడా కృషి చేస్తున్నది దీప. ఈ మధ్య కాలంలో కాలేజీల నుంచి కూడా బౌన్సర్స్ కావాలన్న డిమాండ్ పెరిగింది. ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా ఈ గ్రూపులోని 45 మంది బౌన్సర్లు వాఘోలీ గుడిలో పనిచేశారు. లక్ష మంది దైవ దర్శనం చేసుకునేలా మేనేజ్ చేశారు. వాళ్ల సేవలను చూసిన జనం మెచ్చుకున్నారు.
రకరకాల మహిళలు..
గ్రూప్‌లో చేరేనాటికి చాలా మంది మహిళల్లో ఆత్మవిశ్వాసం లేదు. శారీరక శక్తి పెంచుకునేలా చేయడమేకాదు... మానసికంగా దృఢంగా తయారయ్యేలా ట్రైనింగ్ ఇస్తుంది దీప. బొంబాయిలో మహిళా బౌన్సర్స్ కొత్తేం కాదు. కానీ... దీప ఏర్పాటు చేసింది పుణేలో. రెండేండ్ల కిందట వాళ్లు కేవలం పన్నెండు. మంది... ఇప్పుడు ఐదు వందలకు పైగా. కొందరు బాడీగార్డులుగా పనిచేస్తున్నారు. మరికొందరు ఈవెంట్లను మేనేజ్ చేస్తున్నారు. జాతరలు, వేడుకలు, రాజకీయ ర్యాలీల్లో సైతం విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా మధ్యతరగతి, దిగువమధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. వివాహితులు, ఒంటరి మహిళలు, వితంతువులు, గృహిణులు, విడాకులు తీసుకున్నవాళ్లు, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ సైతం బౌన్సర్స్‌గా పనిచేస్తున్నవాళ్లున్నారు.