Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ్య మనసంతా దిగులుగా ఉంది. వారం రోజుల నుంచి ఆమె తన, పిల్లల భవిష్యత్ గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్తే వేధింపులకు గురి చేస్తే ఏంచేయాలి? అమ్మలా చూసుకోవల్సిన అత్త సూటిపోటి మాటలతో సాధిస్తే ఎలా సహించాలి? భర్తను మంచిమాటలతో బాధ్యతలు తెలుసుకునేలా చేయాలన్న తన ప్రయత్నాన్ని అడ్డుకోవడమే కాకుండా భర్త వైపు వాళ్లంతా కలిసి తనను రక్తం వచ్చేలా కొట్టారు. అయినా తాను స్పందించకపోతే ఇక భవిష్యత్ అంతా ఈ బాధలు భరించాల్సిందే..! నవ్య ముందుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్దామనుకుంది. కానీ, కొందరు ఆమెకు 'ఐద్వా అదాలత్'కు వెళ్లమని సలహా ఇవ్వడంతో పిల్లలను తీసుకుని వచ్చిన ఆమె సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికిందో చదవండి..
''నవ్య డిగ్రీ వరకు చదివింది. పెద్దలే సంబంధం కుదిర్చి నరేష్‌తో పెళ్లి చేశారు. ప్రైవేటు ఉద్యోగం చేసే నరేష్ తల్లిదండ్రులతోనే కలిసి ఉందామన్నాడు. పెద్దవాళ్లంటే చిన్నప్పటి నుంచి ఉన్న గౌరవంతో నవ్య కూడా సరే అంది. కొన్నాళ్లు ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. వాళ్లకి ఇద్దరు ఆడపిల్లలు. ఉమ్మడి కుటుంబం కావడంతో నరేష్ తమ జీతం తీసుకువచ్చి వాళ్లమ్మకు ఇచ్చేవాడు. ఆమె చెప్పిన మాటే వినేవాడు. మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత తల్లి మాట విని భార్యతో గొడవ పెట్టుకునేవాడు. తల్లి చెప్పిన విషయాలు విని నవ్య తిట్టడం, కొట్టడం చేస్తుంటాడు. చాలాసార్లు భరించిన నవ్య ఆ తర్వాత భర్త పెట్టే ఇబ్బందులను ఆమె తల్లిదండ్రులను చెప్పింది. వాళ్లు వచ్చి నరేష్‌తో మాట్లాడారు. రెండు సార్లు పెద్దలతో పంచాయితీ కూడా పెట్టించారు. ఆ తర్వాత నవ్య, నరేష్‌లు వేరు కాపురం పెట్టారు. వారింట్లోనే ఒక పోర్షన్లో నవ్య, ఆమె భర్త పిల్లలతో ఉంటున్నారు. కొన్నిరోజులు బాగానే ఉన్నారు. అయితే నరేష్ జీతంతోనే ఇల్లంతా గడిచేది. ఇప్పుడు వేరు కాపురం పెట్టడంతో ఇంట్లో ఆర్థికఇబ్బందులు వచ్చాయి. దీనికంతటికీ నవ్యనే కారణమంటూ నరేష్ తల్లి నవ్యతో గొడవ పెట్టుకునేది. నరేష్ ఇంట్లో లేని సమయంలో వచ్చి నవ్యను కొట్టేది. అయినా కొంతకాలం ఓర్చుకుని, పిల్లల కోసం మౌనంగానే ఉంది నవ్య. ఇరుగుపొరుగు వాళ్ల ద్వారా నరేష్ మరో అమ్మాయితో ఉంటున్నాడని తెలిసిన నవ్య పుట్టింటికి వెళ్లిపోయింది. వారం రోజులైనా నరేష్ రాకపోవడంతో ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది. చెప్పకుండా మీ అమ్మగారింటికి వెళ్తావా అంటూ నరేష్, వాళ్ల అమ్మ, అన్నలతో కలిసి నవ్యను పిల్లల ముందే బాగా కొట్టాడు. తలను గొడకేసి బాదాడు. తలపై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇంటి పక్కల వాళ్లు నవ్య వాళ్ల అమ్మనాన్నకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి రక్తం కారుతున్న దెబ్బలతో ఉన్న నవ్యను హస్పిటల్‌కు తీసుకునిపోయారు. గాయాలకు కట్టు కట్టించి ఇంటికి తీసుకువచ్చారు.
ప్రమాదవశాత్తు తలకు తగిలిన గాయంతో తాను చనిపోతే తన బిడ్డల పరిస్థితి ఏంటీ అన్న ఆలోచన నవ్యకు నిద్రపట్టనివ్వ లేదు. తల్లి చెప్పే మాటలు వింటూ తనను బాధపెడుతున్న భర్తకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఐద్వాకు వచ్చానంది.
మంచోడే.. చెప్పుడు మాటలతో..
'నా భర్త మంచోడే. అయితే వాళ్ల అమ్మ మాట వింటాడు. అందులో నిజానిజాలు కూడా తెలుసుకోకుండా నన్ను వేధిస్తాడు. అమ్మలా చూసుకోవల్సిన అత్త మా కాపురంలో చిచ్చు పెడుతుంది'' అంటూ కన్నీరు పెట్టుకుంది నవ్య. వెంటనే ఆమె భర్త నరేష్‌కు బాధ్యులు ఫోన్ చేశారు. 'నాపై కేసు పెట్టడానికి ఆమె, ఆమె అమ్మనాన్న సిద్ధంగా ఉన్నారు. వాళ్లు పోలీస్‌స్టేషన్, కోర్టు అని తిరిగితే నేను అక్కడే తెల్చుకుంటాను. అలా కాకుండా కాపురం నిలబడాలని ఆమె అనుకుంటేనే మీ ఆఫీసుకు వస్తాను'' అన్నాడు నరేష్.
' కాపురం నిలబడాలనే కదా ఆమె మా దగ్గరకు వచ్చింది. ముందు మీరు ఇక్కడి వస్తే అన్నీ వివరంగా మాట్లాడుకుందాం' అని బాధ్యులు అనడంతో నరేష్ తన వాళ్లను తీసుకుని ఆఫీసుకు వచ్చాడు. 'వారం కిందట ఆమెకు నాకు గొడవ జరిగిన మాట వాస్తవమే. నాకు ఎవరితో సంబంధం లేదు. అనవసరంగా నన్ను అనుమానిస్తుంది. ఈ విషయమే అడగడానికి మా వాళ్లు వచ్చారు. నేను ఆమెను కొట్టలేదు. ఆమే నన్ను, మా అమ్మను ఇష్టం వచ్చినట్టు తిట్టింది' అని నరేష్ చెప్పాడు. 'మీరు కొడితేనే కదా తల పగిలి రక్తం వచ్చింది. ఆమె గాయాలు కూడా పూర్తిగా మానలేదు. ఇలా అబద్దాలు మాట్లాడుతున్నారు' అంటూ బాధ్యులు గట్టిగా నిలదీసే సరికి నరేష్' ఆమె మాట్లాడే మాటలకు కోపం వచ్చి పక్కకు తోసాను. అంతే గోడకు తగిలింది. అంతేకాని కావాలని కొట్టలేదు' అన్నాడు. ఏదీ ఏమైనా ప్రమాదవశాత్తు ఆమెకు ఏమైనా అయితే జైలుకు వెళ్లాల్సింది మీరే. అలా అడ్డంగా మాట్లాడేస్తే ఎలా?' అన్నారు.
'సమస్య ఉన్న మాట నిజం. ఎవరి వైపు ఎలాంటి సమస్యలున్నాయో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఇలా హింసిస్తే సమస్య పరిష్కారం కాదు సరికదా మరింత జటిలం అవుతుంది.' అని ఇరువైపుల వారికి బాధ్యులు సర్దిచెప్పారు.
నవ్య, నరేష్‌లకు విడిగా కూర్చోబెట్టారు బాధ్యులు' ఆలుమగల మధ్య అనుబంధం బాగుండాలంటే ఒకరి వైపు నుంచి ఒకరు ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. అలా కాకుండా చెప్పుడు మాటలు విని మీరిద్దరూ ఇష్టానుసారం వ్యవహరిస్తే, అది మీకు, మీ పిల్లల భవిష్యత్‌కు మంచిది కాదు. మీ అమ్మనాన్నతో మాట్లాడండి. అదే సమయంలో వారు చెప్పే మాటల్లో నిజమేంటో గమనించండి. అలాగే పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. వారి మనసు గాయపరిచే మాటలు అనొద్దు. ఒకసారి మాట నోరు జారితే తిరిగి వెనక్కి తీసుకోలేం. అనుబంధాలను కాపాడుకోవాలంటే ఆచితూచి మాట్లాడాలి. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరో ముఖ్యవిషయం భార్యపై చేయి ఎత్తడం అనేది చాలా హీనమైన చర్య. హింసతో ఆమెను అణిచివేయాలన్న ఆలోచన రానీయకండి. చెప్పుడుమాటలు విని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవద్దు. ఇప్పటివరకూ జరిగిపోయినవన్నీ ఇద్దరూ మర్చిపోండి. ఇక నుంచి మీ గురించే కాదు పిల్లల గురించి ఆలోచించండి!'' అని బాధ్యులు నవ్య, నరేష్‌లను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు.
గొడవలను పెంచేవారే..
నవ్య, నరేష్‌లపై బాధ్యులు చెప్పిన విషయాలు బాగా ప్రభావం చూపించాయి. కాసేపయ్యాక ' మా ఇద్దరి మధ్యన గొడవలు వచ్చినప్పుడు వాటిని పెంచేలా మాటమాట చెప్పిన వారే తప్ప..మీలా చెప్పినవారు లేరు. మీరు చెప్పినట్లే ఇక నుంచి మా మధ్య గొడవలు రాకుండా చూసుకుంటాం. పిల్లల గురించి మంచిగా నడుచుకుంటాం!' అని ఒప్పందం రిజిష్టర్‌లో రాసి, సంతకాలు చేశారు.
ఇరువైపుల పెద్దలనూ కూడా పిలిచి భార్యభర్తల మధ్య మాటపట్టింపులు వచ్చినప్పుడు సమస్యను పెద్దది చేయకుండా వారికి నచ్చచెప్పాలంటూ వారితోనూ రిజిష్టర్‌లో సంతకాలు చేయించారు.
' మా ఇద్దరి మధ్యన గొడవలు వచ్చినప్పుడు వాటిని పెంచేలా మాటమాట చెప్పిన వారే తప్ప..మీలా చెప్పినవారు లేరు. మీరు చెప్పినట్లే ఇక నుంచి మా మధ్య గొడవలు రాకుండా చూసుకుంటాం. పిల్లల గురించి మంచిగా నడుచుకుంటాం!' అని ఒప్పందం రిజిష్టర్‌లో రాసి, సంతకాలు చేశారు.
పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. వారి మనసు గాయపరిచే మాటలు అనొద్దు. ఒకసారి మాట నోరు జారితే తిరిగి వెనక్కి తీసుకోలేం. అనుబంధాలను కాపాడుకోవాలంటే ఆచితూచి మాట్లాడాలి. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరో ముఖ్యవిషయం భార్యపై చేయి ఎత్తడం అనేది చాలా హీనమైన చర్య. హింసతో ఆమెను అణిచివేయాలన్న ఆలోచన రానియకండి. చెప్పుడుమాటలు విని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవద్దు.