Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తినిచ్చే ఆహారం సగ్గుబియ్యం. ఇందులో కార్బొహైడ్రేట్లు అధికం. అందుకే శక్తినిచ్చే ఎనర్జీ డ్రింకుల్లోను, బ్రెడ్ ఐటమ్స్లోను వీటిని ఎక్కువగా వాడుతుంటారు. మీరెప్పుడైనా ఆఫీసు నుంచి ఇంటికొస్తూనే ఆకలి వేస్తున్నదనుకోండి. సమయం కాని సమయంలో అయితే భోంచేయడానికి వీలవ్వదు. అలాగని ఏవైనా స్నాక్స్ తీసుకుందామంటే మళ్లీ ఆకలేయదు. అవి జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి.. తిన్న వెంటనే సులువుగా జీర్ణమై, తక్షణమే శక్తినిచ్చేందుకు సగ్గుబియ్యం వంటలు బాగా పనికొస్తాయి. అటువంటి వాటిలో సబుదాన సలాడ్ ఒకటి. దీన్ని చేసుకోవడం చాలా సులభం. అరకప్పు సగ్గుబియ్యం, అరకప్పు పుదీనా, రెండు పచ్చిమిర్చి, ఒక కప్పు మజ్జిగ, అందుబాటులో ఉన్న పండ్లు.. పైనాపిల్, ఆరంజ్, దానిమ్మ ఏదైనా ఫర్వాలేదు. రెండు టేబుల్స్పూన్ల ఎండుద్రాక్ష, చిటికెడు బ్లాక్ సాల్ట్. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పుదీనాలను మజ్జిగలో కలపాలి. ఆ తర్వాత సగ్గుబియాన్ని అందులో కాసేపు నానబెట్టి.. వడబోయాలి. అందులో తేలిన సగ్గుబియ్యాన్ని సన్నని సెగమీద కాస్త ఉడికించి మళ్లీ మజ్జిగలో కలిపి.. ఎండుద్రాక్ష, పండ్లముక్కలను జతచేసి తింటే బావుంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఇన్స్టంట్ ఎనర్జీ లభిస్తుంది.