Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమ్య పరిస్థితి చూస్తుంటే రమణి మనస్సంతా దిగులుగా మారిపోయింది. అల్లారు ముద్దుగా పెంచిన పిల్ల ఇలా అచేతనంగా ఉండిపోవడం, కన్నబిడ్డ ఆకలిని కూడా పట్టించుకోకుండా శ్యూనంలోకి చూస్తూ పరిసరాలను మరిచిపోవడం కన్నపేగును కలవరపెట్టింది. ఇక లాభం లేదు తన స్నేహితురాలు చెప్పిన విధంగా ఐద్వా అదాలత్‌కు వెళ్లితేనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంది రమణి. రమ్యను, చంటిపాపాయిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. చంకలో చంటిపాపాయి, బక్కచిక్కిన రూపంలో రమ్య. వారిద్దరికి తోడుగా మధ్యవయస్కురాలు. వారిని చూడగానే ప్రేమవ్యవహారమని బాధ్యులకు అర్థమైంది. సమస్య ఏంటో పూర్తిగా చెప్పమన్నారు. దాంతో రమ్య వెక్కివెక్కి ఏడుస్తూ పిల్లను తీసుకుని బయటకు వెళ్లింది.
'మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. కూలీపని చేస్తూ కూడా నలుగురు పిల్లలను చదివించాం. రమ్య అందరికన్నా చిన్నది కావడంతో కాస్త గారాబం ఎక్కువే. మిగతా ముగ్గురు డిగ్రీలు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకు పెండ్లిళ్లు చేశాం. రమ్య ఇంటర్ చదువుతున్నప్పుడే ఒక అబ్బాయిని ప్రేమించింది. మేం వద్దని ఎంత వారించినా వినలేదు. ఒకరోజు ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్లిపోయింది. గుడిలో పెండ్లి చేసుకున్నారని తెలిసింది. మా బంధువుల్లో, ఇరుగుపొరుగు వాళ్ల ముందు పరువు తీసింది. అయినా కన్న మమకారంతో ఇద్దరు బాగుంటే చాలు అనుకున్నాం. పాప పట్టిందని తెలిసి వెళ్లి చూసి వచ్చాం.
ఇంట్లో నుంచి..
వారం రోజుల కిందట బిడ్డను తీసుకుని రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వచ్చింది రమ్య. ఏమైందని అడిగితే సమాధానం చెప్పడం లేదు. వారం రోజులైనా ఆమె భర్త నుంచి ఒక ఫోన్ లేదు. ఇప్పటి వరకు అతను రాలేదు. వచ్చినప్పటి నుంచి తిండి తినదు, నిద్రపోదు. ఏం జరిగిందో చెప్పదు. చదువు వదిలేసి తన ఇష్టానికి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పితేనే కదా మాకు తెలిసేది. మా ఆయన, పిల్లలు బాధపడుతున్నారు. మీరే మా సమస్యకు పరిష్కారం చెప్పాలి' అంది రమణి. 'సరే ఏం జరిగిందో తెలుసుకుంటాం. మీరు పాపను తీసుకుని బయట కూర్చోండి. రమ్యతో మాట్లాడుతాం' అన్నారు బాధ్యులు.
మోసపోయాను..
'రమ్య ఏం జరిగిందో చెప్పు. నువ్వు చెప్పకపోతే నీ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ముందుగా సమస్య ఏంటో తెలుసుకోవాలి. నీవు వివరంగా అన్ని విషయాలు చెప్పితేనే సహాయం చేయగలం. మీ అమ్మనాన్న బాధ చూస్తున్నావు కదా! అల్లారు ముద్దుగా పెంచుకున్ననువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే వాళ్లు తట్టుకోలేరు. చంటి పాప గురించి కూడా పట్టించుకోవడం లేదట. అసలు విషయం ఏంటో చెప్పు' అన్నారు బాధ్యులు.
'అమ్మనాన్నను, అన్నయ్యలను, అక్కను మోసం చేశాను. వాళ్ల మాట వినకుండా సురేష్ ప్రేమను నమ్మి మోసపోయాను. పెండ్లికి ముందే తప్పు చేశాను. అమ్మనాన్నల పరువు పోతుందని భయపడి అతని వెంట వెళ్లిపోయి గుడిలో పెండ్లి చేసుకున్నాం. వాళ్ల ఇంట్లోనూ ఒప్పుకోలేదు. విడిగా రూం తీసుకుని కొన్ని నెలలు ఉన్నాం. పాపాయి పుట్టినప్పుడు ఇరుగుపొరుగు వాళ్లే సహాయంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి సురేష్ ఇంటికి రావడం మానేశాడు. ఇంట్లో సరుకులు లేవు. పాప పాలకు కూడా డబ్బులు లేవు. ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. పదిరోజుల కిందట వాళ్ల ఇంటికి వెళ్లాను. సురేష్ అమ్మనాన్న, అన్నలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చచ్చిపోవాలనుకున్నాను. పాప కోసం ఆలోచించాను. రెండురోజుల తర్వాత సురేష్ తాగి వచ్చి బాగా కొట్టాడు. 'మా ఇంటికి ఎందుకు వెళ్లావు? నీకు ఏం హక్కు ఉంది? అంటూ జుట్టు పట్టి లాగాడు. 'పాప కోసం వచ్చాను' అనగానే ఈ పిల్ల నా బిడ్డే అని ఏంటీ గ్యారెంటీ? మీ అమ్మనాన్నకు తెలియకుండా నాతో వచ్చినట్టే నాకు తెలియకుండా ఎవరితో వెళ్లావో' అంటూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. 'ఇద్దరినీ చంపేస్తా ఎవరు వస్తారో చూస్తా' అంటూ వెళ్లిపోయాడు. భయపడి పాపను తీసుకుని అమ్మవాళ్లింటికి వచ్చాను. ఎంతో ప్రేమగా పెంచిన అందరినీ మోసం చేశాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. కానీ, అభంశుభం తెలియని పాపను అనాథగా వదిలేయాలంటే బాధగా ఉంది' అంటూ రెండుచేతుల్లో ముఖం పెట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తోన్న రమ్యను అలాగే కాసేపు వదిలేశారు.
ఆకర్షణతోనే ఆవేదన..
'రమ్య టీనేజ్‌లో ఉండే ఆకర్షణనే ప్రేమ అనుకున్నావు. జీవితంలో స్థిరపడిన తర్వాత ఏర్పడే ప్రేమ, అప్పుడు చేసుకునే ప్రేమ పెండ్లి జీవితాంతం కలిసి ఉంచుతాయి. నీలా చాలామంది అమ్మాయిలు ఆకర్షణలో పడి అమ్మనాన్నలను కాదని నచ్చినవాడితో వెళ్లిపోయి జీవితాలను కన్నీటి మయం చేసుకుంటున్నారు. నీ అన్నలు, అక్క జీవితాలు చూడు.. నీ జీవితం చూడు. నువ్వు సరే అంటే సురేష్‌ను, అతని అమ్మనాన్నను పిలిపిస్తాం' అన్నారు బాధ్యులు.
'సరే మేడమ్' అంటూ అతని అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చింది రమ్య. ఫోన్ చేసి రమ్య విషయం చెప్పగానే కంగారు పడ్డాడు సురేష్. ఆ మరుసటివారం తల్లిదండ్రులను తీసుకుని వచ్చాడు.
ప్రేమ నమ్మకాన్ని కలిగించాలి..
'సురేష్ రమ్యను పెండ్లి చేసుకున్నావా? లేదా?మీ ఇంట్లో వాళ్లకు మీ పెండ్లి గురించి చెప్పావా? పాప పుట్టిన సంగతి వాళ్లకు తెలుసా?' అడిగారు బాధ్యులు. 'గుడిలో పెండ్లి చేసుకున్నాం మేడమ్. ఇంట్లో చెప్పిన తర్వాత చేసుకుందాం అంటే రమ్య వినలేదు. పాప పుట్టిన తర్వాత ఇంట్లో చెప్పాలను కున్నాను. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. అందుకే చెప్పలేదు' అన్నాడు సురేష్. 'మరి పెండ్లి చేసుకున్నప్పుడు ఆమె బాధ్యత, పాప బాధ్యత నీదే కదా. వారిద్దరినీ వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే ఎలా? మీ అమ్మనాన్నలకు చెప్పి రమ్యను, పాపను ఇంటికి తీసుకువెళ్తావా? లేక పోలీస్ కంప్లాయింట్ ఇవ్వమంటావా? చెప్పు అన్నారు బాధ్యులు. వెంటనే వాళ్ల అమ్మనాన్న' వద్దు మేడమ్! వాడు తెలిసో తెలియకో తప్పు చేశాడు. పెండ్లికి ముందే తొందర పడటంతో మాకు ఎలా చెప్పాలో వాడికి అర్థం కాలేదు. కోడలు, పాప బాధ్యత ఇక నుంచి మేం తీసుకుంటాం. మా ఇంట్లోనే ఒక పోర్షన్ ఇస్తాం. వారి మధ్య సమస్యలు రాకుండా చూస్తాం' అన్నారు.
ఆడపిల్లలను గౌరవించడం..
'మగపిల్లలను బలాదూర్‌గా బయటకు పంపడం కాదు. వారు ఏం చేస్తున్నారో గమనించండి. ఇప్పుడు రమ్య మా వద్దకు వచ్చింది కాబట్టి మీకు విషయం తెలిసింది. ప్రేమలో మోసపోయిన ఎంతో మంది అమ్మాయిలు అటు పుట్టింటికి వెళ్లలేక, ధైర్యంగా బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలకు జాగ్రత్తగా పెంచడంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో అంతకన్న ఎక్కువ బాధ్యత మగపిల్లల తల్లిదండ్రులకు ఉంది. నైతిక విలువలు నేర్పించండి. ఆడపిల్లలను గౌరవించడం నేర్పించండి. ఇక మీదట రమ్యకు, పాపకు ఏం జరిగినా మీదే బాధ్యత ' అన్నారు బాధ్యులు. సరే అంటూ రిజిష్టర్‌లో సంతకాలు చేశారు సురేష్ తల్లిదండ్రులు. 'మీ వద్దకు రాకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు. రెండు నిండు ప్రాణాలను కాపాడారు. ఏ ఆడపిల్లకు సమస్య వచ్చినా మీ వద్దకే తీసుకువస్తాం' అంది రమణి. ఏదైనా సమస్య ఉంటే చెబుతామని, వారం రోజులకు ఒకసారి వచ్చి కలుస్తామని రిజిష్టర్‌లో రాసి సురేష్, రమ్య సంతకాలు చేశారు. పాపను ఎత్తుకుని కొడుకు కోడలితో కలిసి ఇంటికి బయలు దేరారు సురేష్ తల్లిదండ్రులు.
- వి. యశోద