Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. పని చేసే క్రమంలో అనేకరకాల ఆటుపోట్లు. ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇలాంటి కొన్ని సూచనలు పాటించాలి..
- మనిషి జీవితం అనేక సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరి ంచుకునే మార్గాలు కూడా పక్కనే ఉంటాయి. వాటిని కనిపెట్టగలిగినవారే జీవితంలో ముందుకు సాగుతారు. ప్రాధాన్యాన్ని బట్టి పనులను విభజించుకోవాలి. 'అన్నీ నేనే చేయాలి' అని కాకుండా ఇతరులకు కూడా అప్పగించండి. అంటే ఇంట్లో పనులు పిల్లలు, భాగస్వామికి కేటాయించండి. దానివల్ల వారికీ పని విలువ తెలుస్తుంది. మీకూ సమయం మిగులుతుంది.
-ఈ క్రమంలో సమయపాలన చాలా ప్రధానం. ముఖ్యమైన పనులకు ముందు సమయం కేటాయించాలి. కాస్త లేటయినా పరవా లేదనుకున్నవాటిని తరువాత చేయాలి. వ్యక్తిగా మీ బలం, బలహీనత మీకు తెలిసే ఉంటాయి. కాబట్టి... బలహీనతలను, ఆత్మన్యూనతా భావాన్ని విడిచిపెట్టి చేయగలననే ఆత్మ విశ్వాసంతో ఉండాలి.
- మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీరు చేసేపనిని ప్రేమించాలి. చేసే పనిని ఇష్టపడని వారు, గౌరవించలేనివారు జీవితంలో ఎప్పుడూ ఉన్నతస్థాయిని అందుకోలేరు. ఎప్పుడూ 'ఎందుకు చేస్తున్నామా? తప్పక చేస్తున్నాం' అన్నట్లుగా కాకుండా... ఇష్టంగా, గౌరవంతో చేయండి. చేస్తున్న పనిలోనే ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడు సక్సెస్ మీ సొంతమవుతుంది. ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. గౌరవిస్తారు.
-ఎవరమేన్న నెగెటివ్‌గా అన్నా పట్టించుకోవద్దు. ఎదుటివాళ్ల గురించి కాకుండా... మీకు మంచి అనిపించింది చేయండి. నేను చేయగలనో లేదోనన్న అనుమానంతో ఏ పని మొదలుపెట్టొద్దు. అలా అనుమానంతో మొదలుపెట్టినదానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. చేయగలను అన్న పాజిటివ్‌గా పనిచేయండి.
- సహనంతో ఉండటం, ఎదుటివారు చెప్పింది ఓపికగా విని... దానికి బదులు ఇవ్వడం మంచి లక్షణం. మీకు నచ్చని విషయం అయినంత మాత్రాన అసహనంతో ఊగిపోకూడదు. నచ్చలేదని కూడా ప్రశాంతంగా చెప్పొచ్చు. అయితే ఆత్మాభిమానం దెబ్బతింటున్నప్పుడూ కూడా సహనంతో ఉండటం సరికాదు. ఎప్పుడు సహనంతో ఉండాలి? ఎప్పుడు అసహనాన్ని వ్యక్తీకరించొచ్చు అనేది బేరీజు వేసుకోవాలి.
- జీవితంలో తప్పులు చేయడం అనేది మానవ సహజం. తప్పులు చేయకుండా ఒకేసారి సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలవదు. ఓటమి ఎదురైనప్పుడు, తప్పులు చేసినప్పుడు బాధపడిపోకుండా... దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గెలుపునకు సోపానంగా వాడుకోవాలి.
- చిన్నదైనా, పెద్దదైనా గెలుపు గెలుపే. కాబట్టి ఏదైనా సాధించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. అది మరింత ముందడుగు వేయడానికి ఉత్సాహా న్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అలాగని అహాన్ని మీ దరికి చేరనీయకండి. సాధించినదానితో సంతృప్తి పొందకుండా ఇంకా కొత్తగా చేయాలనే ఆకాంక్ష ఎప్పుడూ ఉండాలి.
- 'నవ్వు నాలుగు విధాల చేటు' అంటూ... ఆడవాళ్లను నవ్వుకు కూడా దూరం చేశారు. కానీ నవ్వు అందరికీ నాలుగువందల విధాల గ్రేట్. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముఖంలో చిరునవ్వును చెరగనీయకండి. ఏడుపు వస్తే ఏడ్చేయండి. బాధ అంతా కన్నీళ్ల రూపంలో పోయేంతగా ఏడ్చేయండి. మనసు తేలిక పడుతుంది.
-ఇల్లు, కుటుంబం, పిల్లలు... ఉద్యోగ బాధ్యతలు. వీటితోనే జీవితమంతా అయిపోతుంది. మరి మీకంటూ మిగిలిందేమిటి? వెనక్కి చూసుకుంటే శూన్యం. కాబట్టి కుటుంబం, ఉద్యోగంతోపాటు మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి. అది రోజుకు ఓ గంట.. వారానికి కొంత, నెలకు రెండు రోజులు.. ఎంతైనా కావచ్చు.. ఆ విలువైన సమయాన్ని మీకోసం మాత్రమే ఖర్చు చేయండి. మీకు ఇష్టమైన ఏదైనా వ్యాపకాన్ని ఎంచుకొని గడపండి. అది మీకు కొంత విశ్రాంతినిస్తుంది.