Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంటగదిని ఎంత అందంగా సర్దుకున్నా.. కొన్ని మరకలు చికాకు పెడుతుంటాయి. వాటిని వదిలించడం పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఈ చిట్కాలు వాడితే.. మరకలు సులభంగా మాయం అవుతాయి.
కిచెన్ ప్లాట్‌ఫాం మీద కాని స్టవ్ మీద కాని జిడ్డు మరకలుంటే ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి సోడాబైకార్బనేట్ చల్లాలి. రెండు - మూడు నిమిషాల తర్వాత స్పాంజ్‌తో కాని క్లాత్‌తో కాని తుడవాలి.
పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు ఒక పట్టాన వదలవు. వీటిని తొలగించాలంటే.. సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి మరకలపై రుద్దాలి. కప్పులు, సాసర్లు కొత్త వాటిలా మెరుస్తాయి.
థర్మాస్ ఫ్లాస్కు లోపల వాసన వస్తుంటే ఒక టేబుల్ స్పూన్ సోడాబైకార్బనేట్ వేసి నిండా నీటిని పోయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగితే వాసనపోతుంది.
కిచెన్‌లో ఓవెన్, స్టవ్, ప్లాట్‌ఫాం తుడిచే స్పాంజ్లు, బ్రష్‌లు కొద్దిరోజులు వాడిన తరవాత వాసన పట్టేస్తుంటాయి. వాటిని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ కలిపి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి.
ఫ్రిజ్‌ను శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో కప్పు సోడా బైకార్బనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజ్‌ను ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తరవాత మంచినీటిలో ముంచి పిండేసిన స్పాంజ్‌తో మరొకసారి తుడిస్తే.. ఫ్రిజ్ శుభ్రంగా ఉంటుంది.
స్టెయిన్లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొద్దిగా నీటిని చేర్చి రుద్దాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగితే.. కొత్తదానిలా మెరుస్తుంది.
చిటికెడు వంటసోడాను టీ కప్పులలో వేసి నిమిషం తరవాత శుభ్రపరిస్తే లేయర్‌లా ఏర్పడిన టీ మరకలు మటుమాయం అవుతాయి.