Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నది నా ఆశయం. నా కల సాకారమయ్యేంత వరకు నేను విశ్రమించను. ఇతరులపై ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు. ముఖ్యంగా భర్త మీద. అమ్మాయిలు ఒంటరిగా, స్వతహాగా తాము అనుకున్నవి సాధించగలరని నిరూపిస్తాను.'' అంటూ 15ఏళ్ళ అమ్మాయి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఎంతో మందిని ఆకర్షించింది. అసలు, తన కథను ఎందుకు పోస్ట్ చేయాలనుకుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి.
ముంబైకి చెందిన ఈ అమ్మాయికి ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంత చిన్న వయసులో తాను పెళ్లి చేసుకోనంటూ నిరాకరించి ఫేస్బుక్ ద్వారా తనకు అండగా నిలవాలని కోరుతుంది.
''నేను ఆ అబ్బాయిని కూడా చూశా. పెళ్లి చేసుకోనని ఇంట్లో వాళ్లకు స్పష్టంగా చెప్పాను. నన్ను నేను రక్షించుకోవడం కోసం... పోలీసులకు ఈ విషయం చెబుతానని నా తల్లిదండ్రులను బెదిరించాను. ఇద్దరు పిల్లలుండి విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు చెప్పారు. 15ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు నేనెలా తల్లినికాగలను. ఇంట్లో వాళ్ళు నా గురించి, నా భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించరు. నేనింకా చదువుకోవాలి. స్వతహాగా సంపాదించాలి. నేను ఒకరిపై ఆధారపడి బతకాలనుకోవడం లేదు. నా కలను సాకారం చేసుకొని ఒంటరిగానే మహిళలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించలగలరని నిరూపించాలను కుంటున్నాను.'' అంటూ పోస్ట్ చేసింది.
ఈ అమ్మాయి కథ ఎంతోమందిని ఆకర్షించింది. ఈ అమ్మాయిని అభినందిస్తూ ఆశయ సాధనకు అండగా ఉంటామంటూ వందలాదిమంది కామెంట్లను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు 49 వేల లైక్‌లు, 3,200 షేర్లు వచ్చాయి. ఇలా తనకు చేస్తున్న బాల్య వివాహాన్ని వ్యతిరేకించి ఫేస్బుక్లో తన కథను పోస్ట్ చేసి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది.