Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడంతా క్రికెట్ ఫీవర్. ఐపీఎల్ అయిపోయింది. వరల్డ్ కప్ రాబోతున్నది. టీవీ పెట్టి చూస్తే... మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తరువాత విశ్లేషణలు చేస్తూ తన తెలివి, గ్రేస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది ఓ యాంకర్. ఆమె పేరు మయంతి లాంగర్ బిన్నీ. క్రికెట్... మైదానం లోపలా వెలుపలా పురుషాధిపత్యంతో నిండి ఉన్నది. అలాంటి ఫీల్డ్‌లో విజయవంతంగా రాణిస్తున్న ఫీమేల్ వ్యాఖ్యాత మయంతి.
స్కూల్ కాలేజ్ డేస్‌లో మయంతి ఫుట్‌బాల్ బాగా ఆడేది. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ చదవడానికి ముందే.. ఢిల్లీలోని సూపర్ సాకర్ అకాడమీలో ఫుట్‌బాల్‌లో శిక్షణ పొందింది. తరువాత... ఢిల్లీలో ఇండియన్ యూత్ సాకర్అసోసియేషన్ లీగ్ కూడా నడిపింది. గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టాలనుకుంది. 2010 ఫిఫా బీచ్ ఫుట్‌బాల్‌కి గెస్ట్ యాంకర్‌గా అవకాశం వచ్చింది. దాన్ని ఒక ప్రయోగంగానే భావించింది. కానీ అదే సక్సెస్ అయ్యింది. తరువాత వెనుదిరిగి చూడాల్సిన అసవరం రాలేదు. స్పోర్ట్స్ ఛానల్స్ తమ షోస్‌ను నడిపించమంటూ ఆమెను అప్రోచ్ అయ్యాయి.
సాధారణంగా ఫీమేల్ యాంకర్స్‌కి స్పోర్ట్స్‌లో జ్ఞానం తక్కువ అనే భావన ఉంటుంది. కానీ... మయంతి అలా కాదు. ఆమెకు ఎంతో ఆసక్తి ఉన్న క్రీడలు కావడంతో ఫుట్‌బాల్, క్రికెట్స్‌లో అపారమైన జ్ఞానం సంపాదించుకుంది. దాంతో పెద్ద పెద్ద టోర్నమెంట్స్‌కు వ్యాఖ్యాత వ్యవహరించే అవకాశం వచ్చింది. ప్రారంభంలో ఫుట్‌బాల్ టోర్నమెంట్స్కే పనిచేసినా.. తరువాత క్రికెట్‌కు మారింది. ఏడాది తిరిగిందో లేదో... 2011 వరల్డ్‌కప్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్లో సైతం అడుగుపెట్టింది. తరువాత కామన్వెల్త్, ఫిఫా వరల్డ్‌కప్, ఒలింపిక్స్, ఐపీఎల్.. ఒకటేమిటి వరుసగా అవకాశాలు వచ్చాయి.
రాముడు మంచి బాలుడులాంటి టైపు బిన్నీతో వసపిట్ట మయంతికి ఎలా జత కుదిరిందోగానీ, వీరిది ప్రేమ వివాహమండోరు! అలా అని కోహ్లీ మాదిరి ఫీల్డ్ సాక్షిగా ఫ్లెయింగ్ కిస్‌లు విసరడం.. వెంటబెట్టుకొని తిరగడాలు గట్రా ఏమీ చేయలేదు బిన్నీ. మయంతిపై మనసుపడ్డాడు...ఆ వెంటనే ప్రపోజ్ చేశాడు.. కూల్‌గా పెళ్లి చేసుకున్నాడు. అంతే.. 2012 సెప్టెంబర్‌లో వీరి పెండ్లయింది.
మయంతితో పెళ్లవ్వగానే బిన్నీకి సుడి తిరిగింది. ఐపీఎల్లో రాణించడం, తర్వాత ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బిన్నీ కొన్ని అవకాశాల్నే రెండు చేతులా అందుకున్నాడు. ఎవరికి వారు విడివిడిగా ఉన్నప్పుడు ఇద్దరికి పెద్ద గుర్తింపు లభించలేదు. పెళ్లితో ఒక్కటవ్వగానే ఇద్దరికీ దశ తిరిగింది. ఇప్పుడిద్దరూ తమ తమ ఫీల్డ్‌లో స్టార్లైపోయారు.
మయంతి ఆన్లైన్లో చాలాసార్లు ట్రోల్స్ ఎదుర్కొన్నది. బిన్నీ ఎప్పుడు సరిగ్గా ఆడకపోయినా... ట్విట్టర్లో ఆమెను ట్రోల్ చేసేవారు. అంతేకాదు ఆమె ధరించే దుస్తులపైనా కామెంట్స్ వచ్చాయి. అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నది. క్రీడాభిమానులందరూ ఆమె యాంకరింగ్‌ను ఆస్వాదిస్తారు. ఇప్పుడు స్టార్‌స్పోర్ట్స్‌లో స్టార్ యాంకర్. క్రికెట్ క్రీడాభిమానులకైతే ఆరాధ్య దేవత కూడా. ఎందరో ప్రముఖ క్రీడాకారులను ఇంటర్వ్యూ చేసింది. యాంకరింగ్ ప్రపంచంలో ఆమె ప్రయాణం కూడా అంత సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో ఆటుపోట్లు. మహిళా యాంకర్లను కేవలం గ్లామర్కోసమే టీవీల ముందు నిలబెట్టే పరిస్థితి ఉండేది. ఆ భావజాలాన్ని, ఇమేజ్ను మార్చేసింది మయంతి.