Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడిగుడ్డులోని పచ్చసొన తినడమంటే చాలామంది ఇష్టపడరు. పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు ఎక్కువవుతుందని, గుండెజబ్బులు వస్తాయని, ఊబకాయం పాలవుతారని భయపడుతుంటారు. కానీ ఈ భయాలు అర్థం లేనివని ఒక అధ్యయనంలో వెల్లడైంది. పచ్చసొనలో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో శక్తినిస్తాయని, మేలు చేస్తాయని ఈ పరిశోధన నిర్వహించిన అధ్యయనకారులు అంటున్నారు. దీనివల్ల శరీరంలో పెరిగే కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువని వీరంటున్నారు. పచ్చసొనలో ఎక్కువ పోషకాలు ఉన్నాయని తెలిపారు. దీన్ని తినడం వల్ల గుండెజబ్బులేమీ రావని, పచ్చసొన తినకపోవడం వల్లే మన ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పచ్చసొన తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసిన అధ్యయనకారులు క్రానిక్ స్ట్రెస్ వల్ల , వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా వాడడం వల్ల, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ వల్ల గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, అంతేతప్ప పచ్చ సొన తినడం వల్ల కాదని అభిప్రాయపడ్డారు. పచ్చసొనలో విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అంతేకాదు ఇందులోని విటమిన్-బి శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. ఇది మెదడుని, కండరాలను ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుతుంది. అంతేకాదు గర్భిణులు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహకరిస్తుంది. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి పచ్చసొనలోని సాచ్యురేటెడ్ ఫ్యాట్ సహకరిస్తుంది. విటమిన్లను, ఖనిజాలను కూడా శరీరంలోకి గ్రహించగలుగుతుంది. శరీర కేలరీలను నియంత్రణలో ఉంచుకుంటే పచ్చసొన తినడం వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదని, పచ్చసొన వల్ల శరీరం లావు ఎక్కదని కూడా అధ్యయనకారులు చెబుతున్నారు.