Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ అనురాగానికి ప్రతిరూపం
అమ్మ ప్రకృతికి చిహ్నం
అమ్మ ప్రేమ స్ఫూర్తిదాయకం
బాధైనా, సంతోషమైన అమ్మ అంటూ హృదయాంతరాళాల నుంచి పలుకుతాం ఎవ్వరమైనా ..
అమ్మకు నిర్వచనం చెప్పగల భాష ఈ విశ్వంలోనే లేదు ఎందుకంటే అమ్మంటే అమ్మే.. ఆమె త్యాగాన్ని, ప్రేమను చెప్పడానికి మరే పదాలు లేవు. ఇక ముందు రావు. ప్రతి తల్లి పిల్లలను చేయి పట్టుకుని నడిపిస్తుంది. కానీ, ఆ దారి ఎటువైపు వెళ్తుంది అన్నది గమనించి సరైన దారిలో వెళ్లేలా వెన్నంటి ప్రోత్సహించే అమ్మ అందరికీ ఉండాలి. తాము జీవితంలో సాధించిన విజయాలకు అమ్మే స్ఫూర్తి అంటున్న కొందరు అమ్మ నుంచి నేర్చుకున్న అంశాలు 'అంతర్జాతీయ మాతృదినోత్సవం' సందర్భంగా..
త్యాగమూర్తి..
మా అమ్మ శారద. అమ్మల్లోకెల్లా అరుదైన అమ్మ. ఎందుకంటే ఆమె మా నాన్నకు కూడా ఆమె అమ్మే. నాన్న వెంకటరత్నం. పుట్టుకతోనే అంధుడు. తోటివారికి సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న అమ్మ ఆయనకు చూపులేదని తెలిసే పెండ్లి చేసుకున్నారు. నాన్నపనులు, అమ్మ పనులు అన్ని తానే చేసేది. మేం ముగ్గురం అమ్మాయిలం, ఒక అబ్బాయి. చిన్నప్పటి నుంచే మానవత్వ విలువలతో పెంచారు. ఈ రోజు వేలాది మంది ఆడపిల్లలకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పిస్తున్నాను అంటే అందుకు కారణం నాన్న ప్రోత్సాహం, అమ్మ సహకారం.
- లక్ష్మీ రవి, కరాటే ట్రైనర్
పాజిటివ్నెస్.. అమ్మ నుంచే నేర్చుకున్నా..
అమ్మ జోగా రమేష్. చిన్నప్పుడు నాతో షఉటింగ్లకు రావడానికి పొద్దున్న నాలుగుగంటలకే లేచి వేడినీళ్లు కాగపెట్టడం నుంచి అన్నీ పనులు చేసేవారు. పెద్దపెద్ద హీరోలతో సినిమాలు చేసే రోజుల్లో షఉటింగ్కు ఏ మాత్రం ఆలస్యం కాకుండా టైమ్‌కు షఉటింగ్లకు వెళ్లేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఇప్పటికీ ఏదైన షఉటింగ్ ఉంటే ముందుగానే నాకు గుర్తుచేస్తారు. ఇంటికి పెద్దదాన్ని కావడంతో అమ్మ ప్రేమను ఎక్కువ పొందగలిగాను. అమ్మ చిన్నప్పుడు బాలానందం సంఘంలో చురుగ్గా ఉండేవారట. చాలా బాగా పాటలు పాడుతారు. కళల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి కారణంగానే నేను సినిమారంగంలో రాణించగలుగుతున్నాను. నలుగురు పిల్లలను ఎంతో ప్రేమగా పెంచారు. క్రమశిక్షణ నేర్పించారు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంతో ఎదిరించవచ్చు అని పదేపదే చెప్తారు. ఏదైనా సినిమా ఫంక్షన్‌కు అమ్మను తీసుకుని వెళ్లితే.. నా గురించి చెప్పేమాటలను జాగ్రత్తగా వింటారు. ఇంటికి వచ్చాక ఫలానా వాళ్లు నీ గురించి ఎంత బాగా చెప్పారు అంటూ గుర్తు చేసుకుని ఆనందిస్తారు. 80ఏండ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఆమె నా బెస్ట్‌ఫ్రెండ్.
- జయసుధ, సినీనటి
కొండంత అండ
మా అమ్మ లూసీ లక్రా చిన్నప్పటి నుంచి నేను చేసే ప్రతి పనిని అమ్మ ప్రోత్సహించేది. సమాజానికి సేవ చేసే అవకాశం ఈ రోజు నాకు వచ్చిందంటే అందుకు కారణం నన్ను వెన్నంటి ఉన్న అమ్మదే. ఆమె మాటలే నాకు బలం. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఆడపిల్లలకు ఆంక్షలు పెట్టడం అమ్మకు నచ్చేది కాదు. ధైర్యంగా సమాజంలో తిరగాలని పదేపదే చెప్పేవారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల ధైర్యంగా తిరగాలన్న లక్ష్యంతో పనిచేయడం వెనుక ఆడపిల్ల భద్రత కోసం ఎందరో అమ్మలు పడే ఆరాటం ఉంది.
- స్వాతి లక్రా, ఐపిఎస్, ఐజీ,
ఉమెన్ సేఫ్టి వింగ్,
అమ్మే నా రోల్‌మోడల్..అమ్మ (పద్మశ్రీ శోభానాయుడు) చిన్నప్పటి నుంచి నా రోల్ మోడల్. కేవలం నాట్యంలోనే కాదు అన్నింటిలోనూ ఆమే నాకు స్ఫూర్తి. మేం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అన్ని విషయాలు అమ్మతో షేర్ చేసుకుంటాను. నేను నాట్యంతో పాటు కర్నాటక సంగీతం నేర్చుకుంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. అమ్మ తన వద్దకు వచ్చే ప్రతి విద్యార్థిని ఎంతో ప్రేమగా చూస్తారు. ఐదో ఏట నుంచి నాకు నాట్యం నేర్పిస్తున్నారు. దేశంలోని అనేక నగరాల్లో, విదేశాల్లోనూ అమ్మతో కలిసి వేదికను పంచుకునే అవకాశం కలిగింది. అమ్మ చేసే నృత్యరూపకాల్లో భామాకలాపం నాకు చాలా ఇష్టం. డాన్స్‌పై ఇష్టంతో అమ్మ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఏదైనా చేయాలను కుంటే ఎంత కష్టమైనా చేసి తీరుతుంది. ఆమెలోని పట్టుదల నాకు చాలా నచ్చుతుంది. ప్రతిరోజూ నాట్యసాధన తప్పక చేయాలంటారు. కాలేజీకి సెలవులు ఇచ్చినా నాట్యసాధనకు మాత్రం విరామం ఇవ్వవద్దు అంటారు. నిరంతర సాధన ద్వారానే నాట్యం నేర్చుకోవడం సాధ్యమవుతుందని, కళారంగంలో నిత్యవిద్యార్థిగా ఉన్నవారే తాము కోరుకున్న గమ్యాన్ని చేరుతారని పదేపదే చెబుతారు.
- సాయి శివరంజిని, నృత్యకళాకారిణి
ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడే..
అమ్మ (ఆలూరి లలితా పరమేశ్వరి) కేవలం చదువులకే కాకుండా మాలోని సృజనాత్మక కళలను గుర్తించి ప్రోత్సహించేవారు. ఆడపిల్లలను అపురూపంగా చూసే ఆమె మా స్నేహితులను, తెలిసినవారి ఆడపిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసేవారు. నాన్న ప్రముఖ రచయిత ఆలూరి భుజంగరావు. ఆయనకు చేదోడువాదోడుగా ఉంటూ ఆమె కూడా సాహిత్యంతో సహవాసం చేశారు. ఆమె రాసిన కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. కవితలు సాహిత్యసమావేశాల్లో చదివేవారు. మహిళా స్రవంతి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. నాన్నతో నాకు ఎక్కువగా చనువు ఉండేది. దాంతో ఆయన సాహిత్యాభిలాష కొంత అబ్బింది. అమ్మ ప్రోత్సహం నాలోని అభిలాష రచనా వ్యాసంగం వైపు పయనించేలా చేసింది.
ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడే ఆడపిల్లలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని అమ్మ పదేపదే చెప్పేవారు. మెట్టింటిలోనే కాదు ఆడపిల్లలు తమ హక్కులను పుట్టింటిలోనూ దక్కించుకోవాలని చెప్పేవారు. మహిళా సంఘంలో చురుకైన పాత్ర పోషిస్తూ.. సమస్యల్లో ఉన్న మహిళలకు ఆమె అండగా నిలిచేవారు. తన జీవితానుభవాల నుంచి గ్రహించి అనేక విషయాలను చెబుతూ వారి జీవితాలను తీర్చిదిద్దేవారు. ఆడ పిల్లలకు ఎదురయ్యే సమస్యలను లోతుగా ఆలోచించి వాటిని పరిష్కరించేవారు. జీవితంలో వచ్చే సమస్యలను చూసి భయపడితే చీకటి తర్వాత వచ్చే వెలుగు చూడలేం అని చెప్పేవారు. ఇప్పటికీ నాకేదైన సమస్యగా అనిపిస్తే అమ్మ సలహా తప్పక తీసుకుంటాను.
నిరంతరస్ఫూర్తి..
అమ్మ శారదాఅశోకవర్ధన్, సమాచారశాఖలో పనిచేసేవారు. మంచి రచయిత. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉన్నప్పుడల్లా ఆలస్యం అవుతుందని నన్ను తనతో పాటు తీసుకుపోయేవారు. అలా సాహిత్యాన్ని పరిచయం చేశారు. ప్రముఖ కవుల, రచయితల ప్రసంగాలు వినే అవకాశం ఆమె ద్వారా లభించింది. చదివిందంతా కాన్వెంట్లో అయినా తెలుగులో వ్యాసరచన, డ్రామాలు వేసి బహుమతులు తెచ్చుకునేదాన్ని. అమ్మతో సభలకు, సమావేశాలకు వెళ్లడంతో అక్కడి వారి మాటలు వింటూ.. కథలపై ఆసక్తి కలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మను అడిగి చాలా విషయాలు తెలుసుకునేదాన్ని. ఉదయం నుంచి ఇంటిపని, ఆఫీస్ పనితో అలసిపోయినా ఏ మాత్రం విసుగులేకుండా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేది. స్ఫూర్తి దాయకమైన వాతావరణం ఉండేది. మంచిమంచి పుస్తకాలు చదవమని ఇచ్చేది. జర్నలిజం వైపు రావడానికి కూడా పరోక్షంగా అమ్మే కారణం. భాష మీద అభిమానం కలం పట్టేలా చేసింది. నేను చిన్నప్పుడు చూసిన అనేక మంది రచయితలను మీడియా పరంగా ఇంటర్వ్యూలు చేయడం ఆనందానిచ్చేంది. 80ఏండ్ల వయసులో కూడా అమ్మ ఇంకా రచనావ్యాసంగాన్ని కొనసాగి స్తున్నారు. ఎవరిపై ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా ఉంటూ తన చిన్ననాటి స్నేహితులతో, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్‌లో వీలైనప్పుడల్లా సమావేశాలు ఏర్పాటుచేసుకుంటూ నిరంతరం బిజీగా ఉంటారు. విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక పని చేస్తుండాలి అన్నది ఆమె నుంచి నేను నేర్చుకున్నాను.
- అరుణ రవి కుమార్, సీనియర్ జర్నలిస్టు
అమ్మను చూసే..
వరంగల్‌లో అష్టపది ప్రదర్శన ఇస్తున్న అమ్మ (ప్రముఖ నాట్యగురువు, నృత్యకళాకారిణి సువర్చల)ను చూసినప్పుడు 'ఇలా నేను ఏ రోజైనా చేయగలనా అనిపించింది' ఆ రోజే నిశ్చయించుకున్నాను డాన్స్‌నే ప్రొఫెషన్‌గా తీసుకోవాలని. చిన్నప్పుడు సంగీతం అంటే ఇష్టం. దాంతో కర్ణాటక సంగీతం ఓకల్ నేర్చుకున్నాను. అమ్మ నాట్యసాధన చేస్తున్నా.. విద్యార్థులకు నేర్పిస్తున్నా.. నేను అలాగే చూస్తూ ఉండేదాన్ని. అలా చూసిందే గుర్తుపెట్టుకుని స్కూల్ ప్రోగ్రామ్స్‌లో ప్రదర్శన ఇచ్చేదాన్ని. దాంతో మా టీచర్ అమ్మను పిలిచి 'చాలా బాగా చేస్తుంది. డాన్స్ నేర్పించండి' అన్నారు. అప్పుడు నేను ఆరోతరగతిలో ఉన్నాను. ప్రముఖ గురువు కళాకృష్ణగారి వద్ద చేరాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సోలో ప్రదర్శన ఇచ్చాను. ఆ తర్వాత అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చినా.. ఇస్తున్నా అమ్మనే ఆదర్శంగా తీసుకుంటాను. ఒకవైపు నాట్యం నేర్చుకుంటూనే మరోవైపు బిటెక్(ఏరోనాటికల్ ఇంజనీరింగ్) పూర్తి చేశాను. ఆంధ్రనాట్యంలో డిప్లొమా, పిజీ పూర్తి చేశాను. ఇప్పుడు గురువు కళాకృష్ణ గారి పేరిణి నృత్యాంశాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషిస్తున్నాను. దీనితో అనేక ప్రయోగాత్మక నృత్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తోంది.
- పెన్నా సాత్విక, నృత్యకళాకారిణి