Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాస్టిక్ మనం అవసరానికి మించి వాడటం వల్ల వాటిల్లోని రసాయనాలు మనల్ని ఆరోగ్య సమస్య లకు గురయ్యేట్టు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి లోను కాకూడదంటే ఎటువటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
- ప్లాస్టిక్ వస్తువులు కొనేటప్పుడు బీపీఏ ఫ్రీ అని వాటిపై రాసి ఉంటే మేలు. ఈ సూచన ప్లాస్టిక్ నాణ్యతను తెలియజేసే అంశం. పసిపిల్లలకు పాలబాటిళ్లను కొనేటప్పుడు ఈ నాణ్యతా ప్రమాణాన్ని కచ్చితంగా పాటించాలి. కొన్ని రకాల పదార్థాలని పోషకాలు కోల్పోకుండా గాలి చొరబడని ప్రత్యేక ప్లాస్టిక్ సీసాల్లో ప్యాకింగ్ చేస్తారు. పోషకాలు కోల్పోవు కాబట్టి అవి ఆరోగ్యకకరమైన పదార్థాలనుకుంటాం. కానీ ఇందుకోసం వాడే డబ్బాల్లో బీపీఏ అనే రసాయనం ఉంటుంది. ఇది హార్మోన్లలో మార్పులు చేసి బరువు పెరగడానికి కారణం అవుతుందని గుర్తుంచుకోవాలి.
- పది రూపాయలే కదాని చాలా మంది మంచినీటి సీసాలను ప్రయాణాల్లో ఎక్కువగా కొనేస్తుంటారు. దీనివల్ల డబ్బు వృథా అవడమే కాక, తిరిగి ఉపయోగించుకోవడానికి వీలుకాని ఆ సీసాలు పర్యావరణ కలుషితాలుగా మారిపోతాయి. అంతదాకా రానివ్వడం ఎందుకు? కాచి చల్లార్చిన నీళ్లను నాణ్యమైన సీసాల్లో నింపుకొని వెంట తీసుకెళితే మంచిది. వీలున్నంత వరకూ ప్లాస్టిక్ కప్పులకు బదులుగా గాజు, పింగాణీ కప్పుల్ని వాడితే మంచిది. ఇక మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని ప్లాస్టిక్ పాత్రల్లో కాకుండా పైరెక్స్తో చేసిన వాటిల్లో దాస్తే మంచిది. పైరెక్స్ తేలికగా ఉండే గాజు వస్తువు.
- ప్లాస్టిక్ కవర్లూ , బాక్సుల్లో నింపి బయట అమ్మే నిల్వ ఉంచి ఫాస్ట్ఫుడ్ల కన్నా ఇంట్లో తయారుచేసిన తాజాపదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. తరచూ చౌకబారు ప్లాస్టిక్ సీసాల్లో నీటిని తాగడం, మైక్రో ఓవెన్లో ప్లాస్టిక్ పాత్రల్ని ఉంచి పదార్థాల్ని వేడిచేయడం మంచది కాదు. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ మధ్యన స్నానాల గదుల్లో ప్లాస్టిక్‌తో చేసిన షవర్ కర్టెన్లని ఎక్కువగా వాడుతున్నారు. వాటి నుంచి ఘాటైన వాసనలు వస్తుంటే గమనించుకోవాలి. ఎక్కువ మోతాదులో రసాయనాలు వెలువడుతున్నట్టయితే వాటిని మార్చుకోవాలి.
- షాపింగ్కెళ్లినపుడు మనం కొన్న ఒకే ఒక వస్తువుకి కూడా చిన్నగా ముట్టుకుంటే చిరిగి పోయే ప్లాస్టిక్ బ్యాగ్ కావాలని పట్టుబడతాం. నిజానికి అది మరోసారి ఉపయోగపడదు సరికదా... పర్యావరణానికి చేటుచేస్తుంది. వస్త్రంతో కుట్టిన చేతి సంచులే ఇందుకు చక్కని పరిష్కారం.