Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ ప్రవర్తన రోజురోజుకు మితిమీరిపోతోంది. మొన్నటివరకు చిన్న చెల్లెలు ఇంటికి వెళ్ళొద్దు అంటే సరేనంది. నిన్న కనిపెంచిన తల్లిదండ్రులను, పెద్ద చెల్లెలును అప్పుడప్పుడు కూడా చూడడానికి వీలు లేదు అంటే భరించింది. ఇప్పుడు పిల్లాడిని అమ్మమ్మతాతయ్య చూడాలంటే వాళ్ల ఆస్తిలో సగం రాసి ఇవ్వాలని పట్టుపడుతున్నాడు. సూటిగా చెప్పకుండా చిన్న చెల్లి పెండ్లిని సాకుగా చూపి వేధిస్తున్నాడు. భరించలేక రాగిణి పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులతో తన సమస్య నంతా చెప్పింది. బిడ్డను, మనుమడిని తీసుకుని వాళ్లు
'ఐద్వాఅదాలత్' కు వచ్చారు.
'మేడమ్ మా సమస్యకు మీరే పరిష్కారం చెప్పాలి. మా బిడ్డ కాపురం నిలబెట్టాలి' అంటూ బాధ్యులను కోరారు. ' చాలావరకు కుటుంబ సమస్యలు చర్చించుకోకపోవడం వల్ల పెద్దవైతవి. మీరు సమస్యను గుర్తించి మా వద్దకు పరిష్కారం కోసం వచ్చారు. ఇరువైపుల వారి నుంచి సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కారిస్తాం. ముందు మీ సమస్య చెప్పండి' అన్నారు బాధ్యులు
నాపేరు రంగారావు, ఈమె నా భార్య సుమిత్ర. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగస్తులమే. మాకు ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురినీ బాగా చదివించాం. పెద్దమ్మాయి రాగిణి పీజీ వరకు చదివింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్‌తో ఐదేండ్ల కిందట పెండ్లి చేశాం. వాళ్లకు ఒక బాబు. మూడేండ్లు. కారు, గచ్చిబౌలిలో ఇల్లు కొన్నాడు. రెండో అమ్మాయి ఎంబిఏ చదివింది. అల్లుడు అమెరికాలో డాక్టర్. వీరిద్దరి పెండ్లిండ్లు మేం కుదిర్చిన సంబంధాలే. మా ఆస్తి అంతా మా ముగ్గురు అమ్మాయిలకు సమానంగా మా తదనంతరం ఇస్తాం అన్నాం. మా చిన్నమ్మాయి స్వాతి ఇంజనీరింగ్ చదివి, మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆరునెలల కిందట తన ఆఫీస్‌లో పనిచేసే కొలీగ్ రవిని ప్రేమిస్తునని.. అతనినే పెండ్లి చేసుకుంటాను అని చెప్పింది. రవి వివరాలు తెలుసుకుంటే వాళ్లది మా కన్నా చాలా తక్కువ కులం. వద్దని నచ్చచెప్పాం. వినలేదు. మా ఇద్దరు అమ్మాయిలతో, అల్లుండ్లతో చర్చించాం. రెండో అల్లుడు 'ఈ రోజుల్లో కులం ఎవరు పట్టించుకుంటున్నారు? అబ్బాయి వ్యక్తిత్వం ముఖ్యం. స్వాతికి అన్నివిధాల తగినవాడే అనుకుంటే పెండ్లి చేయండి' అన్నాడు. పెద్దల్లుడు మాత్రం 'కులం తక్కువ వాడికి ఇచ్చి పెండ్లి చేస్తే బంధువుల్లో మా పరువు పోతుంది. ఈ పెండ్లి చేస్తే మీ ఇంటికే రాను' అన్నాడు. కిరణ్ అమ్మనాన్నతో చెప్పాం ' కులం కాదు ముఖ్యం మంచి గుణం కావాలి. రవి మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం కలిగితే పెండ్లి చేయండి. మాకు ఏమీ అభ్యంతరం లేదు' అన్నారు.
కనీస మర్యాద లేకుండా..
స్వాతి, రవిల పెండ్లి రిజిష్టర్ ఆఫీస్‌లో చేశాం. పెండ్లికి పిలిచినా పెద్దల్లుడు, బిడ్డ రాలేదు. అమెరికా నుంచి రెండోఅల్లుడు, బిడ్డ వచ్చి వెళ్లారు. స్వాతి, రవి వాళ్ల ఆఫీస్‌కు దగ్గర ఉండేలా ఇల్లు కొన్నారు. గృహప్రవేశానికి రమ్మని పిలవడానికి రాగిణి ఇంటికి వెళ్లితే కనీసం ఇంట్లోకి కూడా రమ్మనకుండానే వెనక్కి పంపించాడు కిరణ్. 'నీకు ఎంత ధైర్యం ఉంటే కులం తక్కువ వాడిని ఇంటికి రమ్మంటావు' అంటూ రాగిణితో గొడవ పెట్టుకున్నాడు. స్వాతి వాళ్లింటికి వెళ్లవద్దని, మాట్లాడవద్దని బాబుపై ఒట్టు వేయించాడు. అప్పటి నుంచి చీటికిమాటికి గొడవ చేస్తూ.. రాగిణిని కొట్టేవరకు వచ్చాడు. పండుగలకు రమ్మని పిలిచినా.. 'కులం తక్కువ వాడితో నన్ను సమానంతో నన్ను చూస్తారా' అంటూ రాద్దాంతం చేసి రాగిణిని, పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయేవాడు. ఇప్పుడు మా ఇంటికి అసలే పంపించనని, తనకు రావల్సిన వాటా ఆస్తి ఇవ్వమని రోజు గొడవ చేస్తున్నాడు' అంటూ విషయం చెప్పాడు రంగారావు.
ఆస్తిలో ఎక్కువ వాటా..
'మేడమ్ నాకు రోజు ఇంట్లో నరకమే. స్వాతిపెండ్లి కన్న ముందు బాగానే ఉండేవాడు. ఆ తర్వాత మీ చెల్లి కులం తక్కువ వాడిని చేసుకుంది. మీ అమ్మనాన్న వాడికి సమానంగా ఆస్తి ఎలా ఇస్తారు? వాళ్లు చస్తే తలకొరివి పెట్టాలంటే నా కొడుకే దిక్కు. వాళ్ల ఆస్తిలో నాకే ఎక్కువ వాటా ఇవ్వాలి' అంటూ రోజూ గొడవే. స్వాతి ఇంటికి వెళ్ళొద్దు, ఫోన్లో కూడా మాట్లాడవద్దని ఆంక్షలు. ఇప్పుడు పెద్దచెల్లిని, అమ్మనాన్నను కూడా చూడవద్దు, వాళ్లతో మాట్లాడవద్దు అంటూ సతాయిస్తున్నాడు. కన్నవాళ్లతో, తోడబుట్టిన వాళ్లతో మాట్లాడకుండా ఎలా ఉండాలి? నేను ఆయన ఇంట్లో బందీనా? అమ్మనాన్నకు బాబు అంటే ప్రాణం. వాడిని చూడడానికి వస్తేకూడా నానామాటలు అంటున్నాడు. నా కాపురం నిలబడాలంటే నేను ఏం చేయాలి? ' అంది రాగిణి.
చదువుకున్న మూర్ఖులు ..
'నువ్వు బాధపడకు. కులరహిత సమాజం కోసం ఎన్నో పోరాటాలు జరుగుతు న్నాయి. ఇంకా మీ ఆయన లాంటి చదువు కున్న మూర్ఖులు ఈ సమాజంలో ఉన్నారు కాబట్టే కులపిచ్చి తగ్గడం లేదు. ఫోన్ చేసి మీ ఆయనను పిలిపించి మాట్లాడుతాం' అంటూ కిరణ్ నెంబర్‌కు ఫోన్ చేశారు. 'నేనేందుకు రావాలి? కులం తక్కువ వాడిని అల్లుడిగా చేసుకున్నవాళ్లతో నేను మాట్లాడను' అన్నాడు.' సరే రాగిణి కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుంటాను అంటుంది. మీరు వస్తే సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నాం. రాన్నంటున్నారు కదా కోర్టులోనే తెల్చుకోండి' అన్నారు బాధ్యులు.' లేదు మేడమ్ నేను వస్తాను. విడాకులు వద్దు' అన్నాడు.
ఎలాంటి రాకపోకలు ఉండవని
'ఎందుకు రాగిణిని వాళ్ల అమ్మవాళ్లింటికి వెళ్ళొద్దు.. వాళ్లతో మాట్లాడవద్దు అంటూ ఆంక్షలు పెడుతున్నారు. మీ సమస్య ఎంటో చెప్పండి?' అన్నారు బాధ్యులు.
'రాగిణి, బాబు అంటే నాకు ఇష్టం. నేను వాళ్లను వదిలి ఉండలేను. అయితే తక్కువ కులం వాడిని అల్లుడిగా చేసుకుని నా పరువు తీసారు. కులం తక్కువ వాడితో నన్ను సమానంగా చూస్తారా? వాడికి సమానంగా ఆస్తి ఇస్తారా? అందుకే వాళ్లింటికి నాభార్యకొడుకును పంపను. మాకు రావల్సిన వాటా మాకు ఇచ్చి, ఇకపై ఎలాంటి రాకపోకలు ఉండవని బాబుపై ప్రమాణం చేయించండి. నేను ఇకపై రాగిణిని ఒక మాట కూడా అనను' అన్నాడు కిరణ్.
ఇకమీద కలిసే ఉంటాం..
'మీ అత్తమామ వాళ్ల తదనంతరమే ఆస్తి ఇస్తామని ముందుగానే చెప్పారు కదా! కులం కులం అంటున్నారు. మీకు చదువుచెప్పిన టీచర్లది, మీకు జీతమిచ్చే బాస్‌ది ఏ కులమో తెలుసా? రేపు మీ అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెండ్లి చేసుకుంటే ఇంట్లోకి రానివ్వరా? మీ కుల ఆచారం ప్రకారం మీ వృత్తి నే ఎంచుకోవాలి కదా? అలా కాదని సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? మీ లాగే రవి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. భార్యను ప్రేమగా, ఆమె తల్లిదండ్రులను గౌరవంగా చూస్తున్నాడు. పెద్ద కులం అంటూ చిల్లర బుద్ధితో మీరు ప్రవర్తిస్తున్నారు. మీకు కులపిచ్చితో పాటు ఈగో.. మీ కన్న రవి సంస్కారవంతుడు అన్నది భరించలేక అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అర్థంలేని వాదనతో భార్యబిడ్డలను దూరం చేసుకుంటారో.. మనుషులంతా సమానమే అన్న విషయం తెలుసుకుని మంచిమనిషిగా మారుతారో మీ ఇష్టం. ఆలోచించుకోని వచ్చేవారం రండి ' అన్నారు బాధ్యులు.
మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిరణ్. ఆ తర్వాత వారం 'నాది తప్పే. కులం కన్నా గుణం మిన్న అన్నది ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇకమీద నా భార్యకొడుకును బాగా చూసుకుంటాను. అత్తమామను గౌరవిస్తారు. ఈ ఆదివారం స్వాతిరవి వాళ్లింటికి వెళ్తాం' అన్నాడు కిరణ్. అతనిలో వచ్చిన మార్పు చూసి రాగిణి, ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. 'ఇకమీద కలిసే ఉంటాం. వారానికి ఓ సారి వచ్చి కలుస్తాం' అంటూ రిజిస్టర్లో రాసి సంతకాలు చేశారు కిరణ్, రాగిణి.