Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీలకు తరచూ వెళ్లేవారు అక్కడ అతిగా తినేస్తుంటారు. దీంతో అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అందుకే పార్టీల్లో పెట్టిన పదార్థాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఏది ఆరోగ్యకరమైన ఆహారం? ఏది కాదు? వేటివల్ల శరీరంలో కాలరీలు పెరగుతాయి వంటి విషయాలు చాలామందికి తెలియవు. చాలామంది పార్టీలకు వెళ్లినప్పుడు నచ్చిన డిషెస్నన్నింటినీ అతిగా తినేస్తుంటారు. దీంతో శరీరంలో కాలరీలు పెరుగుతాయి. అందుకే పార్టీలో కనిపించేవి ఎంత నోరూరించేవైనా నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఇందుకు ఏం చేయాలంటారా? అక్కడున్న మెనూను నిదానంగా గమనించాలి. పార్టీలో పెట్టిన వంటల్లో ఏవి తినాలి, ఎంత తినాలి, వేటి జోలికి వెళ్లొద్దు వంటి విషయాలను ముందరే నిర్ణయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపుకు కావాల్సినంత మాత్రమే తింటారు . స్టీమ్ చేసిన , గ్రిల్ చేసిన మాంసం, చేపలు తింటే మంచిది. వేపుళ్లను తినొద్దు. సలాడ్స్ తినొచ్చు. అయితే అవి ఎక్కువ సాస్‌తో ఉంటే మాత్రం వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. లైటర్ డ్రెస్సింగ్ ఉన్న సలాడ్స్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. డెజర్ట్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. పళ్లతో తయారుచేసిన ఫ్రూట్ యోగర్ట్లాంటి డెజర్టులు తింటే పొట్ట తేలికగా ఉంటుంది. పంచదార పాకంలో వేసిన రసగుల్లాలు, జిలేబీల జోలికి పోకుండా ఉంటేనే మంచిది. వీటివల్ల కాలరీలు బాగా పెరుగుతాయి. భోజనం చేయడం ముగించిన తర్వాత ఒక్క క్షణం కూడా డిన్నర్ ప్రదేశంలో ఉండొద్దు. అక్కడే ఉన్నారనుకోండి ఏదో ఒకటి తింటుంటారు. అందుకే పార్టీలకు వెళ్లేటప్పుడు ఏవి తినొచ్చో, ఏవి తినకూడదో తెలుసుకుంటే మంచిది.