Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండ, వేడిమి కారణంగా ఈ కాలంలో వెంట్రుకలకు సంబంధించిన రకరకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. అందుకే ఎండాకాలంలో శిరోజాల పరిరక్షణ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. బిరుసెక్కిన వెంట్రుకలకు కొబ్బరిపాలు రాయడం, పలుచని జుట్టున్న వారు నిత్యం ట్రిమ్ చేయించుకోవడంలాంటి చిట్కాలు వేసవిలో జుట్టును సంరక్షిస్తాయి.
- సూర్యరశ్మి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే తలపై పెద్ద హ్యాట్ పెట్టుకోవాలి. లేదా వెంట్రుకలకు ఎండ తగలకుండా స్కార్ఫ్‌ను తలకు చుట్టుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఎండలో ఎక్కువసేపు తిరగాల్సి వస్తుంది. అలాంటప్పుడు చల్లటి నీళ్లతో స్నానం చేస్తే వెంట్రుకలకు వేసుకున్న రంగు పోదు. కాస్మటిక్ వైద్యులను సంప్రదించి హెయిర్ సన్‌స్క్రీన్స్‌ను వాడితే వెంట్రుకలు సురక్షితంగా ఉంటాయి.
- వేసవిలో ఎండవేడి బారిన పడకుండా ఉండాలంటే స్విమ్మింగ్ చేస్తే చాలా మంచిది. కానీ ఈత కొట్టేటప్పుడు జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మరవొద్దు. ఎందుకంటే నీటిలో క్లోరిన్ ఉంటుంది. ఇది శిరోజాలకు హాని చేస్తుంది. అందుకే ఈత కొలనులోకి దిగే ముందు నూనె లేదా కండిషనర్ను వెంట్రుకలకు రాసుకుని, బిగుతుగా ఉండే స్విమ్మింగ్ క్యాప్‌ని తలకు పెట్టు కోవాలి. ఈత కొట్టిన వెంటనే సాధారణ స్నానం చేయాలే తప్ప షాంపుతో తల స్నానం చేయకూడదు. నిత్యం ఈత కొట్టే వాళ్లు హెయిర్ స్పాకి వెడితే మంచిది.
- తల జిడ్డుగా ఉండేవాళ్లు కండిషనర్‌ని వాడడం వల్ల వెంట్రుకలు మరింత ఆయిలీగా కనిపిస్తాయి. అందుకే ఇలాంటివాళ్లు కండిషనర్కు దూరంగా ఉండాలి. కండిషనర్లు వాడాలనుకుంటే వాటర్బేస్డ్ కండిషనర్లు ఉంటాయి. వాటిని వాడొచ్చు. ఇవి సూర్యరశ్మి నుంచి వెంట్రుకలను రక్షిస్తాయి. వెంట్రుకలు జిడ్డుగా ఉండవు కూడా. జుట్టులో దాగున్న నూనె పోగొట్టడానికి నిమ్మకాయ రసంతో తలను రుద్దుకోవాలి. ఈ సమస్య వెంటనే పరిష్కారం అవాలనుకుంటే మాత్రం కొద్దిగా అస్ట్రిన్జంట్ని జుట్టుపై స్ప్రే చేసి బ్రష్‌తో దువ్వితే శిరోజాలకు మంచి మెరుపు వస్తుంది.
- చలికాలంలో జుట్టు బాగా పొడిబారినట్టు అవుతుంది. వేసవి కాలంలోనూ ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి కారణం ఎయిర్‌కండిషనర్స్ గదుల్లో ఎక్కువసేపు గడపడమే. దాంతో వెంట్రుకలు తేమదనాన్ని కోల్పోయి గిడసబారినట్టు అవుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే లీవ్-ఇన్ సెరమ్‌ను వెంట్రుకలపై స్ప్రే చేసి జుట్టును బాగా దువ్వుకోవాలి. రోజూ తలకు నూనె పెట్టి కొద్దిసేపు ఆవిరి పడితే వెంట్రుకలు పొడిబారవు.
- జుట్టు పలచబడ్డం కూడా శిరోజాలకు సంబంధించిన ఒక సమస్యే. జుట్టు పలచబడకుండా ఉండాలంటే 30 నుండి 40 రోజులు క్రమంతప్పకుండా ట్రిమ్మింగ్ చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా అవడమే కాదు వెంట్రుకలు చిట్లిపోవు.
- అంతేకాదు జుట్టును ఎలా దువ్వుకుంటున్నారన్నది కూడా శిరోజాల సంరక్షణలో మరో ప్రధానమైన అంశం. సాఫ్ట్ బ్రష్‌తో జుట్టును జాగ్రత్తగా దువ్వుకుంటే వెంట్రుకలు ఊడిపోవు. తలస్నానం చేసిన తర్వాత జుట్టు చిక్కుపడితే దాన్ని సున్నితంగా తీయాలే తప్పించి గట్టిగా లాగకూడదు. మొరటుగా వ్యవహరిస్తే ఒత్తయిన జుట్టు కూడా పలచబడే ప్రమాదం ఉంది.