Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నళిని, కిషోర్ చిన్నప్పటి నుంచి ఒకే వీధిలో పెరిగారు. ఒకే బడిలో కలిసి చదువుకున్నారు. నళిని ఇంటర్లో చదువు ఆపేస్తే కిషోర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. 'నీకు ఇష్టమైతే పెండ్లి చేసుకుందాం' అంటూ ప్రపోజ్ చేశాడు. కిషోర్ స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు తాగుతాడని తెలుసు. అదే విషయం అడిగింది నళిని. పెండ్లయా ్యక తాగుడు జోలికి పోను అని మాటిచ్చాడు. అందరు ఆడపిల్లల మాదిరిగానే నళిని కూడా నమ్మింది. కానీ, పెండ్లి తర్వాత ఎలాంటి మార్పు లేదు. పిల్లలు పుట్టిన తర్వాత అయినా మారతాడని ఆశించింది. ఎక్కడ తాగి పడిపోయాడన్న వార్త వినాల్సి వస్తుందో అని ప్రతిరోజు భర్త కోసం ఎదురుచూస్తూ, భయంతో ఇద్దరు పిల్లలతో తల్లడిల్లిపోతోంది. ఇక భరించలేక 'ఐద్వా అదాలత్'కు వచ్చింది.
నళిని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. కిషోర్ ఇల్లు నళిని వాళ్లింటికి నాలుగిండ్ల అవతల ఉండేది. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఒకరంటే ఒకరికి అభిమానం. ఇంటర్ పూర్తి చేసిన నళినికి ఇంట్లో పెండ్లి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి కిషోర్ వచ్చాడు. ' చిన్నప్పటి నుంచి నీపై ప్రేమ పెంచుకున్నాను. నీకు ఇష్టమైతే పెండ్లి చేసుకుంటాను' అంటూ తన మనసులో మాట చెప్పాడు. తాగుడు అలవాటు గురించి నళిని ప్రశ్నించగా' నా ఫ్రెండ్స్ బలవంతంతోనే అలవాటైంది. మెల్లగా మానడానికి ప్రయత్నం చేస్తున్నాను. పెండ్లి తర్వాత అసలు తాగను' అన్నాడు కిషోర్. అప్పటికే తండ్రి తాగొచ్చి తల్లినీ, తమనీ ఎంతలా వేధించిందీ చిన్నప్పటి నుంచి చూసింది. అందుకే చాలా భయపడింది. 'నిజంగా మానేస్తావుగా?' అని అడిగింది. 'నీమీద ఒట్టు తప్పక మానేస్తా!' అన్నాడు.
ముందే తెలుసు..
చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కావడంతో పెండ్లికి ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నాను. ఇరువైపుల పెద్దలు కూడా కూడా సరే అన్నారు. పెండ్లికి ముందు అప్పుడప్పుడు తాగుతాడని తెలుసు. పెండ్లి తర్వాత నా కోసం మానేస్తానంటే గుడ్డిగా నమ్మాను. ఇప్పుడు అదే పెద్ద వ్యసనంగా మారి మా సంసారాన్ని నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది. రోజూ ఆయన ఇంటికి వచ్చే వరకూ టెన్షన్. ఫుల్‌గా తాగేసి ఎక్కడో పడిపోతాడు. నేనెలా తీసుకురాగలను? తాగుడు కోసం అప్పులు చేస్తున్నాడు. ఆయన స్నేహితులు ఫోన్ చేసి నన్ను డబ్బులు అడుగుతున్నారు. ఈ దురలవాటు వల్లే ఉద్యోగం పోయింది. అయినా మార్పు రాలేదు. అత్తమామకు చెప్పితే..'వాడిని మంచిమాటలతో మార్చుకో, మేమేం చేయలేం' అన్నారు. పుట్టింట్లో నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లి ఏమి చేయలేకపోయింది. తమ్ముడు పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక ఆశ మీరే. మా ఆయన తాగడం మానేసి, ఇంటి బాధ్యత పట్టించుకోవాలి. నన్నూ, పిల్లల్నీ చూసుకోవాలి. నేను ఉద్యోగం చేసి ఆయనకు సహాయంగా ఉంటాను. మీరే ఆయనకు నచ్చచెప్పాలి' అంది నళిని.
'సరే మీ ఆయన ఫొన్ నెంబర్ ఇవ్వు. రమ్మని చెబుతాం' అన్నారు బాధ్యులు. నళిని ఇచ్చిన నెంబర్‌కు ఫొన్ చేసి కిషోర్‌తో మాట్లాడారు. తర్వాత వారం వచ్చాడు. 'నీ భార్యబిడ్డలను పట్టించుకోవడం లేదని, రోజూ తాగి వస్తున్నావని నళిని మా దగ్గరకు వచ్చింది. నిజమేనా?' అడిగారు బాధ్యులు.
బాగా చూసుకుంటాను...
'తాగుడు మానేద్దామని రోజూ అనుకుంటాను. కానీ మానేయలేకపోతున్నాను. చాలాసార్లు తాగకుండా ఇంటికి వచ్చాను. నళిని ఇంట్లో సరుకులు లేవని, పిల్లల ఫీజులు కట్టాలని ఇలా ఏదో ఒకటి అంటూ గొడవ చేస్తోంది. దాంతో మళ్లీ తాగేస్తున్నా. నేను చేసేది తప్పే. తాగడం మానేస్తాను. తనని బాగా చూసుకో వాలను కుంటాను. సాయంత్రం కాగానే స్నేహితులు కలుస్తారు. బలవంతంగా బార్‌కు తీసుకుపోతారు. తాగుడు మానేయాలని చాలాసార్లు ప్రయత్నించాను. నానుంచి కాలేదు. ఈ వ్యసనం నుంచి బయటపడి నళినిని, పిల్లలను బాగా చూసుకుంటాను' అన్నాడు కిషోర్.
ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. ..
'కిషోర్! నువ్వు తప్పు చేస్తున్నావు అన్నది నీకు తెలుస్తుంది. అయితే తాగుడు నుంచి బయటపడేందుకు నీకు ఎన్నో మార్గాలున్నాయి. తాగడానికి ఎన్నో కారణాలు చెప్పినట్టే మానేయడానికి కూడా బోలెడన్నీ కారణాలు వెతకవచ్చు. నువ్వు తాగుతున్నావు కాబట్టే నళిని నిన్ను అంటోంది. పెండ్లికి ముందు ఏం చెప్పావు? నీ మాట నమ్మే కదా నళిని నీ జీవితంలోకి వచ్చింది. మీరిద్దరూ, మీకు ఇద్దరు పిల్లలు. ఆనందంగా జీవించడానికి మంచి ఉద్యోగం. ఇంతకన్నా ఇంకా ఏం కావాలి?నీ తాగుడు వ్యసనం వల్ల సంతోషంగా ఉండాల్సిన వయసులో సమస్యలు తెచ్చుకుంటున్నావు. తాగుడు కారణంగా ఉద్యోగం పోయింది. తాగుడు మానేస్తానని ఇప్పటికీ వందల సార్లు నళినికి మాటిచ్చినా.. ఎప్పటిలాగే తాగుతున్నావు. నువ్వు ప్రయత్నిస్త్తే తప్పక ఫలితం ఉంటుంది. తాగి రోడ్లపై పడిపోతే బంధువులు, స్నేహితులు ఏం అనుకుంటారు. అప్పులు చేసి తాగుతుంటే నీ కుటుంబాన్ని అందరూ చులకనగా చూస్తారు. తాగడం మానేయడం పెద్ద కష్టమేమీ కాదు. నీకు నిజంగా మానేయాలని మనసులో ఉండాలి. మేం నిన్ను డీ ఎడిక్షన్ సెంటర్‌కు పంపిస్తాం. మద్యం ఎలా మానేయాలో వాళ్లు కౌన్సెలింగ్ ఇస్తారు. కొద్దిరోజులు తాగుడుకి దూరంగా ఉంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి' అన్నారు బాధ్యులు.
సమస్యను అర్థం చేసుకుని.
మీరు చెప్పినట్టే వెళ్తాను మేడమ్! అన్నాడు కిషోర్. 'నళిని, కిషోర్ విషయం ముందే తెలిసినా అతని మాటలు నమ్మి పెండ్లి చేసుకున్నావు. ఇప్పుడు డీ ఎడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇస్తారు. నీవు కొద్ది రోజులు ఓపికగా ఉండు. అతన్ని మార్చుకునే ప్రయత్నం చేయి. శ్రద్ధ తీసుకుని, కౌన్సెలింగ్‌కు వెళ్లేలా చూడు, నీ భర్త తాగుడు మానేందుకు సహకరించు. 15 రోజులకు ఒకసారి ఇక్కడకు వచ్చి, కిషోర్‌లో వచ్చిన మార్పు చెప్పాలి. మళ్లీ మీ మధ్య ఏమైన గొడవలు వస్తే మా దగ్గరకు రండి' అన్నారు బాధ్యులు.
బాధ్యులు చెప్పినదానికి అంగీకరిస్తూ రిజిష్టర్‌లో సంతకాలు చేశారు కిషోర్, నళిని. డీ ఎడిక్షన్ సెంటర్లో క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌కు కిషోర్‌ను తీసుకువెళ్లింది నళిని. కోపంతో కాకుండా ప్రేమతో అతని దురలవాటును దూరం చేసే ప్రయత్నం చేసి విజయం సాధించింది. మూడునెలల తర్వాత కిషోర్ ఉద్యోగంలో చేరాడు. నళిని ఇంటి వద్దే టైలరింగ్ చేస్తూ కిషోర్‌కు సపోర్ట్‌గా ఉంది. పిల్లలను స్కూల్లో చేర్పించారు. సమస్య తెలుసుకుని, అర్థం చేసుకుని పట్టుదలతో పరిష్కారించుకున్న నళిని, కిషోర్ పిల్లలతో సంతోషంగా ఉన్నారు.
- వి. యశోద