Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్పడానికి కూడా తటపటాయిస్తుంటారు. టీనేజ్ వచ్చినా 'ఇంకా చిన్నపిల్లలే కదా... వారికేం చేయవస్తుందిలే' అని వారికి వారే సర్దిచెప్పుకుంటుంటారు. ఇది సరికాదని అంటున్నారు నిపుణులు. వారికి రెండేళ్ల వయసునుంచే వారు చేయదగిన పనులు చెప్పడం ద్వారా వారికీ ఇంటిపనుల్లో ఉండే శ్రమ, బాధ్యత తెలుస్తాయని చెబుతున్నారు.
- ఇంటిపనులు చేస్తే పిల్లలు ఎక్కడ కందిపోతా రోనన్న వల్లమాలిన ప్రేమ కావచ్చు, లేదా మునుముందు ఎంతో గొప్పవాళ్లు కావలసిన మా పిల్లలు ఈ చిన్నచిన్న పనులు చేయడ మేమిటన్న భావన కావచ్చు, చాలామంది తలిదండ్రులు చదువు, ఆటపాటలు కాకుండా పిల్లలకు మరే చిన్నపనీ చెప్పడానికి ఇష్టపడరు. కానీ, పిల్లలు ఇంటి పనుల్లోనూ ఎంతో కొంత పాలుపంచుకోవడం చాలా అవసరం. అదేదో తల్లిదండ్రుల భారాన్ని తగ్గిస్తుందని కాదు గానీ, ఆయా విషయాల ప్రాధాన్యత కూడా వారికి తెలుస్తుంది. చిన్న చిన్న ఇంటిపనులు కూడా మనిషి మౌలిక వసతుల ఆవశ్యకత గురించిన , జీవిత నైపుణ్యాల గురించిన ఎన్నో పాఠాలు చెబుతాయి.
- ప్రతిదానికీ ఒకరి మీద ఆధారపడే స్వభావం పోయి, ఒక స్వతంత్ర భావన వారిలో అంకురిస్తుంది. నిజానికి చిన్న చిన్న ఇంటిపనులు కూడా మనిషి మౌలిక వసతుల అవశ్యకత గురించిన , జీవిత నైపుణ్యాల గురించిన ఎన్నో పాఠాలు చెబుతాయి. చిన్నవో పెద్దవో కొన్ని పనులు పూర్తి చేయడం అనేది వారు ఉత్తమ పౌరులుగా రూపొందడానికి కావలసిన ఒక ప్రాథమిక స్ఫూర్తినీ ఆయా విషయాల్లో కొంత సామర్థ్యాన్నీ వారికి అందిస్తాయి. ఇవి పెద్ద వారయ్యాక వారు సహజీవనంలోనూ పరస్పరంగా సహకరించుకునే తత్వాన్ని పెంచుతాయి.
చేస్తున్న పని ఎంత చిన్నదైనా కావచ్చు కానీ, ఒక పనిని పూర్తిచేయగలగడం అనేది తమలో ఒక బాధ్యతాయుత గుణాన్ని పెంపొందించుకునేలా చేస్తుంది. ఎప్పుడో వీలును బట్టే ఆ పనులు చే సినా అంతటి శ్రమతో కూడిన పనుల్ని రోజూ చేస్తున్న తల్లిదండ్రుల పట్ల వారికి గౌరవభావం కలుగుతుంది.
నిజానికి పిల్లలకు పనులు పురమాయించడం అనేది రెండేళ్ల వయసునుంచే మెల్లమెల్లగా మొదలు పెట్టాలి. ఆ వయసులో ఇంటిపనులు ఏంచేస్తారులే అనుకోకుండా, కనీసం ఆడుకోవడం అయి పోయాక ఆ ఆట బొమ్మల్ని ఒక చోట భద్రంగా దాచేసే అలవాటైనా చెయ్యాలి.
- అయితే వారికి చెప్పిన పని అడ్డదిడ్డంగా చేసినా వారిని విమర్శించడంగానీ, అడ్డుకోవడం గానీ చేయకూడదు. పైగా ఆ పనుల్ని ఎలా చేయాలో విసుక్కోకుండా వాళ్లకి చెప్పాలి.
- కొన్ని పనుల్ని రోజూ విధిగా వారే చేసేలా కూడా చూడాలి. చిన్న చిన్న సీసాల్లో నీళ్లు పట్టడం వంటివాటిని రోజూ వారికి అప్పచెప్పాలి. అయితే తల్లిదండ్రులు వారు మోయాల్సిన భారాన్నంతా తమ మీద మోపుతున్నారనే భావన పిల్లల్లో ఏకోశానా కలగకుండా జాగ్రత్తపడాలి.