Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇందుకు కారణం ఎవరూ అని ప్రశ్నించుకుంటే మనలో ప్రతిఒక్కరం బాధ్యులమే' అంటారు శానిటేషన్‌పై రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న పర్యావరణ, సామాజిక కార్యకర్త అనిత చావలి. 'విదేశాలకు వెళ్లివచ్చిన ప్రతిఒక్కరూ అక్కడి వాతావరణాన్ని, రోడ్లను, క్రమశిక్షణను మెచ్చుకుంటూ పుట్టిపెరిగిన ప్రాంతాలను మాత్రం చెత్తాచెదారంతో నింపేస్తున్నారు. మన దేశం కూడా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండాలంటే ప్రతిమహిళ మార్పు ఇంటి నుంచే ప్రారంభించాలి' అన్న లక్ష్యంతో వేలాది మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు. పట్టణాలే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.
జాతీయస్థాయిలో అనేక అవార్డులు అందుకున్న ఆమె పరిచయం...
ఆధునికత తెచ్చిన హంగులు, చిన్నకుటుంబాల కారణంగా పెరిగిన వస్తువాడకం పర్యావరణంపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. దీనితో గ్లోబల్‌వార్మింగ్ పెరిగి భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది. ఇదే విషయంపై ప్రతి మహిళలో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
నేను పుట్టిపెరిగింది ప్రకాశం జిల్లా చీరాలలో. అక్కడే డిగ్రీవరకు చదివాను. కాలేజీ రోజుల్లో బ్యాట్మెంటన్ క్రీడాకారిణిగా జిల్లాస్థాయి పోటీల్లో బహుమతులు అందుకున్నాను. ఆరోగ్య సంరక్షణ, ఎయిడ్స్ అవగాహన వంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాను. తిరుపతిలో పద్మావతి మహిళా యునివర్సిటీలో లింగ్విస్టిక్స్‌లో పిజీ పూర్తి చేశాను. ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులోకి అనువదించాలని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారు ఉత్తర్వులు జారీ చేశారు. మాతృభాషలోనే పరిపాలన ఉండాలన్న ఆయన స్ఫూర్తితో నేను పిజీలో ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదంలో పిజీ పూర్తి చేశాను. కోర్సులో భాగంగా కొన్ని జీవోలను కూడా తెలుగులోకి అనువదించాం. పిజీ పూర్తి కాగానే పెండ్లి, మా వారు ఎల్.వి.చావలి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు కావడంతో డిపెండెంట్ వీసాపై అమెరికా వెళ్లిపోయాను.
వాలంటరీగా..
కుటుంబబాధ్యతలు, పిల్లల పెంపకంతో కొన్నిరోజులు ఇంట్లోనే కాలం తెలియకుండా గడిచిపోయింది. అక్కడి వాతావరణం, ప్రతిఒక్కరూ రూల్స్ పాటించడం, శుభ్రత నన్ను ఆకట్టుకున్నాయి. మన దేశం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించేది. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన తెలుగువారు అప్పుడప్పుడు కలిసేవారు. వారందరితో కలిసి పండగలు చేసుకోవడం, వీకెండ్స్‌లో కలవడంతో వారితో పరిచయాలు పెరిగి మహిళలంతా ఒక గ్రూప్‌గా మారి కొన్ని యాక్టివిటీస్ చేసేవాళ్లం. వాలంటరీగా చాలా సర్వీస్ చేశాను. దాదాపు 14ఏండ్లు అక్కడ ఉన్న తర్వాత తిరిగి ఇండియా వచ్చాం.
అనుబంధాల విలువలు..
మన దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుంటుంది. పిల్లలు ఇక్కడ పెరిగితే సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అనుబంధాల విలువలు తెలియజేయాలన్న ఆలోచనతో మా ఇద్దరు పిల్లలను తీసుకుని మేమిద్దరం హైదరాబాద్ వచ్చేశాం. వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయి. మన ఇల్లు బాగుండాలంటే ఇంట్లోని చెత్తనంతా పక్కింట్లోకి నెట్టేసే మనస్తత్వం ఉన్న మనుషులే ఎక్కువగా కనిపించారు. వారిందరినీ మార్చాలంటే సాధ్యం కాదు. మూడు దశాబ్దాల కిందట ఏర్పడిన 'గౌతమీ నగర్ శానిటేషన్ కమిటీలో సభ్యురాలి'గా చేరాను. కాలనీలో చెత్త సేకరించడంపైనే మొదట దృష్టిసారించాం. కాలనీలోని ఆరువేల ఇండ్ల నుంచి చెత్తసేకరించడానికి తొమ్మిదిమందిని నియమించాం. కమిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాం. చెత్తసేకరించేవారికి నెలవారీగా జీతాలు ఇవ్వడంతో పాటు ఆరోగ్యబీమా కల్పించాం. వారికి అవసరమైన రుణాలు కూడా మంజురు చేయించాం.
క్లిన్ అండ్ నీట్..
ఇంటినే కాదు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మనసు ఆహ్లదంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మా కాలనీవాసులంతా ఎంతో సహకరించి గౌతమీనగర్ను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారు. జిహెచ్ఎంసీ పరిశుభ్రత పై ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా మా కాలనీనే ఆదర్శంగా తీసుకోవడంతో పాటు అనేక పథకాలు ఇక్కడి నుంచే ప్రారంభించారు. త్వరలో చెత్తసేకరించే బ్యాటరీ వెహికిల్‌ను కూడా ప్రయోగాత్మకంగా ఇక్కడే మొదలుపెడుతున్నాం.
తడిపోడి వేరు చేస్తూ..
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే చెత్తను తగ్గించాలి. ప్రతిఇంటినుంచి సేకరించే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసే ప్రక్రియను మేం నాలుగేండ్ల కిందటే ప్రారంభించాం. కిచన్ వెస్ట్ నుంచి కంపోస్ట్ తయారుచేసేలా శిక్షణ ఇచ్చాం. మా కాలనీ పరిశుభ్రతకు మా టీమ్ చేసిన కృషికిగాను జాతీయ స్థాయిలో 'బెస్ట్ రెసిడెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ అవార్డు' అందుకున్నాం. జీఎచ్ఎంసీ డ్రైవెస్ట్ను వేసేందుకు నాలుగు డంపింగ్ యార్డులను మల్లాపూర్, శేర్లింగంపల్లి, నల్లగండ్ల, హెచ్ఎంటి హిల్స్‌లో ఏర్పాటుచేసింది. ట్రాలీల ద్వారా సేకరించిన డ్రై వెన్ట్ను ఇక్కడకు చేరుస్తారు. దీన్ని రీసైకిల్ చేయడానికి వీలుగా ప్లాస్టిక్, పేపర్, మెటల్‌గా వేరుచేసి అమ్మడంతో కొన్ని కుటుంబాలకు ఆర్థికవనరుగా మారుతుంది. ప్రస్తుతం మల్లాపూర్ డంపింగ్ యార్ట్ వినియోగంలోకి వచ్చింది. మిగతా మూడు త్వరలోనే ప్రారంభమవుతాయి.
పెనుభూతం..
ప్రస్తుతం పొద్దున తొమ్మిది గంటలకు బయటకు వెళ్లాలన్నా తీవ్రమైన ఎండ. ఇందుకు కారణం ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయి నాలాల్లోనూ పెరుకుపోవడం, భూగర్భజలాలు అంతరించి పోవడం, పట్టణీకరణలో పచ్చదనం మాయం కావడం. వీటన్నిం టిపై మేం అవగాహన కల్పిస్తూ.. గత కొన్నేండ్లుగా ప్లాస్టిక్ బ్యాగ్‌లను నివారిస్తూ.. జ్యూట్ బ్యాగ్‌లను ఉచితంగా పంపిణీ చేశాం. ప్రగతినగర్‌లో ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తూ దాదాపు రెండువేల మందిలో చైతన్యం తీసుకువచ్చాం. త్వరలోనే ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్స్ ఏర్పాటుచేస్తున్నాం.
ప్లాస్టిక్ రహిత సిటీగా..
హైదరాబాద్‌లోనే కాకుండా మన రాష్ట్రంలోని పట్టణాల్లోనూ అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భద్రాచలాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణానికి మోడల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. జేడిఫౌండేషన్ తరపున మరికొందరి సహకారంతో మహిళల్లో, పిల్లల్లో అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నాం.
మహిళలు తలుచుకుంటే..
ఏ దేశ చరిత్ర మారాలన్న ఆ దేశ మహిళ చైతన్యవంతంగా పనిచేయాలి. దేశగతిని మార్చే శక్తి, ప్రగతి పథాన నడిపే యుక్తి మహిళలకు ఉందని నేను నమ్ముతాను. అందుకే ప్రతి మహిళ పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకోవాలి. అప్పుడే మండే ఎండల నుంచి మనకు రక్షణ.. ఎండల్లో వెళ్లేటప్పుడు బిడ్డను తన కొంగుచాటున జాగ్రత్తగా తీసుకువెళ్లే మహిళలు మండుతున్న భూగోళాన్ని తమ చైతన్యంతో కాపాడుకోవాలి.
చిన్నచిన్న లక్ష్యాలతో..
ప్లాస్టిక్ వాడవద్దు, చెట్లు పెంచాలి ఇలాంటి విషయాలు అందరికీ తెలిసినా.. వాటిని పట్టించుకోరు. మార్పు మహిళ నుంచి ప్రారంభమైతే అది సత్ఫలితాలను ఇస్తుంది. అందుకే మేం మహిళలను, పిల్లలను ఎంచుకున్నాం. వారిలో అవగాహన కల్పించడానికి వినూత్నవిధానాల్లో ప్రయత్నిస్తున్నాం. సంక్రాంతి ముగ్గుల పోటీలకు, పిల్లల పెయింటింగ్ పోటీలకు 'పర్యావరణం', 'ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలు'ను సబ్జెక్ట్‌గా ఇచ్చాం. అనూన్యమైన స్పందనతో పాటు ఎన్నో అంశాలను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇలా ప్రతి సందర్భాన్ని పర్యావరణ పరిరక్షణకు వేదికగా చేసుకుంటూ అవగాహన పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతి మహిళ ప్రస్తుత పరిస్థితులను, వాతావరణంలోని మార్పులను దృష్టిలో ఉంచుకుని 'ప్లాస్టిక్ రహిత కిచెన్', 'తడి, పొడి చెత్తలను వేరు చేయడం', 'ఇంట్లో నాలుగు మొక్కలు పెంచడం', వంటి చిన్నచిన్న లక్ష్యాలతో పనిచేసినా పర్యావరణాన్ని ఎంతో కాపాడినవారవుతారు.