Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనాక్షి సిన్హా... శత్రఘ్న సిన్హా కూతురిగా కాక... తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకున్ననటి. 'దబంగ్'తో బాలీవుడ్లో గోల్డెన్గాళ్గా పేరు తెచ్చుకున్నది. ఆ తరువాత అనేక ఆటుపోట్లు. హిట్ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు పరిణితి చెందుతూ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వందశాతం శ్రద్ధతో పనిచేస్తే చాలు. ఫలితాలతో సంబంధం లేదు, పశ్చాత్తాపం ఉండకక్కర్లేదని నమ్మే వ్యక్తి. పెద్ద బడ్జెట్‌తో బాక్సాఫీస్ హిట్స్... చిన్న బడ్జెట్‌తో చిన్న సినిమాలు.. రెండు జానర్స్‌లోనూ తనదైన ముద్ర వేసింది. పేరుకు తగ్గట్టుగానే ఆ బంగారు కళ్లతో... ఎలాంటి భావాలనైనా పలికించగలిగే దిట్ట.
మొదటి సినిమా(2010)లో సల్మాన్‌ఖాన్ సరసన నటించి... బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా అవార్డు అందుకుంది. ఆ తరువాత 2012లో వచ్చిన నాలుగు సినిమాలు... ఆమెకు ఓ ప్రతికూల ముద్రను తెచ్చి పెట్టాయి. 2013లో విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వచ్చిన 'లూటెరా'తో మళ్లీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తరువాత జోకర్, యాక్షన్ జాక్సన్, బుల్లెట్ రాజా, హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ, వెల్‌కమ్‌టూ న్యూయార్క్, కళంక్... సినిమాలు ఆమెకు మిశ్రమ స్పందనను తెచ్చిపెట్టాయి. ఇటీవల వచ్చిన 'కళంక్' బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టకపోయినా.. ఆమె నటన మాత్రం విమర్శకులనుంచి ప్రశంసలు అందుకుంది.
గెలుపోటములతో సంబంధం లేకుండా...
సినిమాలోని అంశాలు, అది చెప్పిన విషయాలకంటే... బాక్సా ఫీస్ సక్సెస్‌ను మాత్రమే సక్సెస్‌గా చూడగలిగే ఇండిస్టీలో... గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేసుకుపోయే వ్యక్తిత్వం ఆమెది. అపజయాలు పాఠాలు నేర్పుతాయని నమ్ముతుంది. 'విజయం కంటే.. అపజయాలనుంచే చాలా నేర్చుకోవచ్చని నా తల్లిదండ్రులు నేర్పించారు. అది నిజం. రంగం ఏదైనా సరే.. అపజయాలు అవసరమే. వాటినుంచి నేర్చుకుంటూ ముందుకెళ్లడమే. కళంక్ సరిగ్గా ఆడలేదు. అది నా చేతుల్లో లేదు. నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న విషయాలు, నా అనుభవాలు వెలకట్టలేనివి' అంటున్నది. ఇప్పుడు మిషన్మంగల్, భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, దబాంగ్ 3 సినిమాల షూటింగ్‌తో ప్రస్తుతం బిజీగా ఉంది. దబంగ్‌లో మళ్లీ చేయడం అంటే సొంత ఇంట్లో ఉన్నట్టేనని చెబుతున్నది. మిషన్మంగళ్లో సోనాక్షితోపాటు విద్యాబాలన్, తాప్సీ, నిత్య మీనన్ కూడా నటిస్తున్నారు.
బాడీ షేమింగ్‌ను పట్టించుకోకుండా...
ఒక్క కెరీర్లో ఆటుపోట్లతో పాటు.. బాడీ షేమింగ్ ఆమె ఎదుర్కొన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా... ఆమె ఎప్పుడూ తనలోని విశ్వాసాన్ని కోల్పోలేదు. 'మనుషుల అందం, శరీరం, సైజులు, ఫిగర్ వాళ్లకు ఆత్మ విశ్వాసాన్ని తెచ్చిపెడతాయని నేను నమ్మను. నాకు విశ్వాసాన్ని కల్పించేది నా సామర్థ్యం, నేను పనిచేసే తీరు, మాట్లాడే పద్ధతి' అంటుంది సోనాక్షి. అంతేకాదు... ఆమె ధరించిన బట్టలమీదా వ్యాఖ్యలు చేశారు. అన్నింటినీ తిప్పికొడుతూ.. తాను నమ్మిన విధంగా జీవితాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తి. సోనాక్షి... ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ కూడా.
సమన్వయం ఉంటే...
అమ్మాయిలకు సహజంగానే చాలా అభద్రతలుంటాయి. తమను తాము ఎప్పుడూ విమర్శించుకుంటుంటారు. ఆమె కూడా అంతే. అయితే జనం ఏమనుకుంటున్నారనే దానికంటే... తన మీద తనకున్న అభిప్రాయం ప్రధానమం టుంది. ''ఎలా ఉన్నా.. నిన్ను నువ్వు అంగీకరించుకోవాలి. నువ్వు చేస్తున్న పనిపట్ల నీకు సంతోషం, సంతృప్తి ఉండాలి. నేను వర్క్ చేస్తున్నప్పుడు పనిలాగా అనిపించదు... అదో అభిరుచిలా ఉంటుంది. నటనను నేను ప్రేమిస్తున్నాను కాబట్టే.. నటిస్తున్నాను. జీవితంలో ఆ సమన్వయాన్ని నేర్చుకోగలిగినట్టయితే భవిష్యత్ అంతా సంతోషంగా ఉంటుంది'' అని ధీమాగా చెబుతుంది.
''ట్రావెలింగ్ ఇష్టం...
సంపన్న కుటుంబంలోనే పుట్టినా ఏం చేసినా చెల్లుతుంద న్నట్టుగా ఎప్పుడూ లేదు. అడిగిందల్లా వాళ్లు కొనివ్వలేదు. ఇతర సాధారణపిల్లల్లాగే పెరిగాం. ఇంట్లో చిన్నదాన్ని, ఒక్కతే అమ్మాయిని కావడంతో మా నాన్న గారాబం చేసేవారు. అమ్మ మాత్రం అన్నయ్యలను గారాబంచేసేది. సెలబ్రిటీల పిల్లలు విలాసవంతమైన జీవితాలను గడుపుతారని భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదు. నా స్నేహితులు ఇండిస్టీకి సంబంధించిన వారు కాదు. స్కూల్ నుంచి ఉన్న స్నేహితులే. మేం వాళ్ల లాగే పెరిగాం. అసలు శత్రఘ్న సిన్హా కూతురినని మాకాలేజీలో ఎవ్వరికీ తెలియదు. షూటింగ్స్ లేకపోతే... ఫ్రెండ్స్‌తో సినిమాలకో, రెస్టారెంట్స్కో వెళ్తాను. లేదంటే వాళ్లనే ఇంటికి పిలుస్తాను. అంతేకానీ... పార్టీలకు బయట తిరగడం ఇష్టం ఉండదు. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నీళ్లంటే ప్రాణం. సముద్రాల్లో ఈదడం చాలా ఇష్టం. నేను ఇంట్లో వండిన సాధారణ డైట్ తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్‌కి కోడిగుడ్లు ఓట్స్, పప్పు, ఆకుకూరలతోపాటు ఫిష్ లేదా చికెన్ లంచ్‌లో ఉంటుంది. రాత్రిపూట భోజనంలో మాత్రం కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకుంటాను. బయట తినడం చాలా తక్కువ. షూటింగ్లో కాస్త ఖాలీ సమయం దొరికిందంటే ఫోన్లో స్క్రాబ్ల్ లేదంటే వర్డ్ గేమ్ ఆడుతూ ఉంటాను. ఫోన్లు మాట్లాడటం కంటే మెసేజ్‌లు పంపడం నాకు ఇష్టం. కానీ తప్పనిసరి అయినప్పుడు తప్పదు కదా!''
''మా ఇంటిపేరు రామాయణ్..
మా బంగ్లాకు రామాయణ్ అనే పేరు పెట్టారు. మా నాన్న పేరు మీకందరికీ తెలిసిందే. వాళ్ల అన్నదమ్ముల పేర్లు... రామ్, లక్ష్మన్, భరత్. ఇక నా అన్నలు లవ్, కుశ. కాబట్టి రామాయణ్ అనే పేరు మా బంగ్లాకు సరిగ్గా సరిపోతుందని కుటుంబ సభ్యులు భావించారు. అందుకే ఆ పేరు పెట్టారు. మా ఇంట్లో నేను, మా అమ్మే(పూనం) బయటివాళ్లం అన్పిస్తోంది. 'రామాయణ్'లో మహాభారత యుద్ధం కూడా సృష్టిస్తుంటాం. మనకు సపోర్ట్ చేసే కుటుంబం, స్నేహితులూ మన చుట్టూ ఉన్నప్పుడు ఇచ్చే బలం అంతా ఇంతా కాదు.''
''నాదైతే నా దగ్గరికే వస్తుంది...
నాకంటే ఎవరైనా బాగా నటిస్తున్నారంటే నేనస్సలు ఈర్ష్యపడను. చుట్టూ అలాంటివాళ్లుంటేనే మనకు ప్రేరణ. పోటీ నన్ను ప్రోత్సహిస్తుంది. అలాగని నేనేదీ పీకల మీద పెట్టుకుని పనిచేయను. నా సామర్థ్యం, నేనేం కావాలనుకుంటున్నానో నాకు తెలుసు కాబట్టి నా పరిధుల్లో నేనుంటా. ఇతరులు ఏం చేస్తున్నారనేది పట్టించుకోను. నేనెప్పుడూ అవకాశాల కోసం ఫోన్లు చేసి అడగలేదు. నేను చేయదగ్గ పాత్రయితే కచ్చితంగా నా దగ్గరకే వస్తుందని నమ్ముత. అదే చాలాసార్లు జరిగింది కూడా. అందుకే దేనికోసమే పరుగెత్తాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడూ వార్తల్లో ఉండటం కంటే సినిమాల్లో ఉండాలని కోరుకుంటాను. తొమ్మిదేండ్లలో ఇరవై సినిమాలు... ఇప్పుడు మరో మూడు చేస్తున్నాను. ఏ హీరోయిన్‌కైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది? సినిమాల ఎంపికలో నేను చాలా సహజంగా ఉంటాను. నా దగ్గరకు స్క్రిప్ట్ వచ్చినప్పుడు దాన్ని సాధారణ ప్రేక్షకురాలిగా చూస్తాను. నాకు నచ్చితే చేస్తాను. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో.. కామెడీ, యాక్షన్, డ్రామా రోమాన్స్ అన్నీ ఉన్నాయి.''