Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుస్మిత ఉద్యోగిని. తన పాప మంజుకు రెండేళ్లు నిండాయి. చాలా చలాకీగా ఉంటుంది. కానీ మాటలు రావడం ఆలస్యమయింది. దీంతో సుస్మితలో కంగారు మొదలయింది. ఆస్పత్రుల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. వైద్యులు ఒక్కటే చెప్పారు... పాపతో ఎక్కువ సమయం గడుపుతూ.. ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలని... తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగ బాధ్యతల్లో ఉండటంతో మంజుకు మాటలు రావడం ఆలస్యమయిందని...
సహజంగా పిల్లలు ఒక సంవత్సరం కాగానే ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొంత మంది రెండేళ్లు నిండినా కానీ మాట్లాడలేరు. దీంతో మాటలు రావట్లేదని చాలా మంది కంగారు పడిపోతుంటారు . పిల్లలు నెలలు నిండే కొద్దీ అమ్మ, తాతా, అత్త అంటూ ఎప్పుడు పిలుస్తారో అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అయితే పిల్లలు పుట్టినప్పుటి నుండి పెరిగే క్రమంలో పాకడం, నడవడం లాంటివి వయస్సును బట్టి ఎలా నేర్చుకుంటారో మాట్లాడడం కూడా అలాగే వయస్సు బట్టి అలవడాలి. మొదటి రెండు సంవత్సరాల్లోనే పిల్లలకు మాటలొస్తాయి. కానీ కొందరు పిల్లల్లో ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులు గాబరా పడిపోకుండా వారిని నిత్యం మాట్లాడేందుకు ప్రోత్సహిస్తూ ఉండాలి.
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలి: పిల్లలు పుట్టినప్పటి నుంచి వారితో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలకు ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి, వారితో ఎక్కువగా మాట్లాడడం, ఏ విషయమైనా వారితో చెప్పడం..లాంటివి చేయాలి.ఇదంతా వారికి త్వరగా మాటలు రావడానికి చేసే ఓ ప్రయత్నమే...
ఆటవస్తువులతోనూ: పిల్లల్ని ఆడించడానికి తల్లులు ఎక్కువగా ఉపయోగించేవి ఆటవస్తువులు. ఈ క్రమంలో వివిధ ఆటవస్తువుల గురించి వివరిస్తూ పిల్లల్ని ఆడించడానికి ప్రయత్నించాలి. దీని వల్ల పిల్లలు ఆటవస్తువుల కంటే తల్లి చెప్పే దాని మీదే ఎక్కువ శ్రద్ద పెడతారు. కాబట్టి ఇలా ఆడుకునే ప్రతి వస్తువు పేరు, దాని గురించి చెప్పడంలాంటివి చేస్తే వాళ్ళలో వినికిడి శక్తి పెరుగడంతో పాటు గ్రహణ శక్తి పెరిగి మాటలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
కథలు చెప్పాలి: చాలా మంది పిల్లలు కథలు వింటూ నిద్రపోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. దీని వల్ల పిల్లల్లో గ్రాహ్యశక్తితో పాటు ఆలోచనాశక్తి కూడా పెరుగుతుంది. ఇలా ప్రతి రోజూ చాలా మాటలు వినడం వల్ల ఇందులో నుంచి కొన్ని మాటలైనా వాళ్ల మనస్సుల్లో నాటుకుపోతాయి. దీంతో నెమ్మదిగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
ఒక టీచర్‌గా: పిల్లలకు మాటలు రావాలంటే తల్లిదండ్రులే టీచర్లుగా మారాలి. ఉదాహరణకి మీరు పిల్లల్ని ఆడిస్తూ టీవీ చూస్తున్నారనుకోండి. అందులో ఏవైనా జంతువుల్లాంటివి కనిపిస్తే వాటి పేర్లు చెప్పడం లాంటివి చేయాలి. అలాగే ఏదైనా బొమ్మల పుస్తకం, ఇంగ్లీష్ లేదా తెలుగు అక్షరమాల పుస్తకం చూపిస్తూ వాటి పేర్లు చెప్ప డం.. కూడా చేయవచ్చు. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి 'ఈమె మీ అమ్మ, ఈయన మీ నాన్న, ఈమె మీ అత్త..' ఇలా బాంధవ్యాల గురించి చెప్పడంలాంటివి తరచూ చేస్తుంటే పిల్లలకు మీరు ఎదురు చూడకముందే మాటలొచ్చే అవకాశం ఉంటుంది.
తప్పులు సరిదిద్దాలి: సాధారణంగా చిన్నపిల్లలు మనం చెప్పిన పదాలను తప్పుల్లేకుండా పలకరు. వాళ్ళు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు కాబట్టి, స్పష్టంగా పలకలేరు. అందువల్ల వాళ్లు పదాల్ని స్పష్టంగా పలకాలంటే తల్లిదండ్రులే వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాలి. 'అలా కాదమ్మా...ఇలా పలకాలి' అని నెమ్మదిగా నేర్పించే ప్రయత్నం చేయాలి. దీంతో క్రమక్రమంగా వారిలో స్పష్టంగా మాట్లాడే ధోరణి అలవడుతుంది.
వారికిష్టమైనవి: పిల్లలకు ఇష్టమైన పదార్థాలు, వాళ్లకిష్టమైన ఆటవస్తువులు మొదలైన వాటిని వాళ్లకు అందకుండా ఉంచడంలాంటివి చేయడం వల్ల వాటిని తినాలనే, అందుకోవాలనే ఆశతో వారు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
బయట తిప్పుతుండాలి: ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే పిల్లలకు కూడా బోర్. కాబట్టి, వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా పిల్లలకు అలవాటు చేయాలి. దీనికోసం వాళ్లను అప్పుడప్పడూ అలా బయటికి తీసుకువెళ్తుండాలి. పార్కులకు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లాలి. దాంతో అక్కడి పిల్లలు మాట్లాడుతుంటే మీ పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు.