Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదేళ్ల లోపు పిల్లలకు చెప్పే మాటలు విత్తనాళ్లా నాటుకు పోతాయి. అందుకే ఈ వయసులోనే వాళ్లకు సంస్కారం తోపాటు కొన్నిరకాల విలువల్ని కూడా నేర్పాలి.
తల్లిదండ్రులు సాధారణంగా పిల్లలను అతిగారాబంగా పెంచుతారు. ఇది వారి భవిష్యత్తును పాడుచేసి వారు మరింత మొండిగా, మాట వినకుండా తయారు చేస్తుంది. వారికి ఏదో ఒకటి తినిపించడానికో లేక వారితో పని చేయించటానికో అనవసరమైన ప్రేమను ప్రదర్శిస్తారు. దానితో వారు తమ తల్లితండ్రుల ప్రేమ తమకు అన్నిటా వుంటుందనే భావనకు వచ్చేసి మరింత మొండితనం ప్రదర్శించే అవకాశం వుంది.
అవసరం లేదని భావిస్తే మీరు బిడ్డకు ఏ వస్తువూ కొనటం లేదా బహుమతిగా ఇవ్వటం వంటివి చేయకండి. పిల్లలు కోరిన దానికి మీరు వెంటనే అంగీకరించకండి. పిల్లలు అన్నీ వారికి ఎంతో తేలికగా ఏర్పడుతున్నాయని భావిస్తే....వారికి వాటి వెనుకగల కష్టం తెలియదు.
కొంతమంది తల్లితండ్రులు పిల్లలను అతి జాగ్రత్తతో పెంచుతారు. ఈ కారణంగా పిల్లలు వారి బాగోగులు తెలుసుకోలేరు. అతిగా గారాబం చేయబడిన పిల్లల ప్రవర్తన వేరుగా వుంటుంది. వారు ఇతరులను అవమానపరచే స్థాయికి కూడా ఎదుగుతారు. చివరకు తల్లితండ్రులకే సమస్య అయ్యే ప్రమాదం వుంది. కనుక వారికి ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రేమను లేదా వస్తువులను అందించండి.
ఇంట్లో ఎక్కువ గారాబంగా పెరిగిన పిల్లలు, ఎంతసేపూ తమ ఆధిక్యత నిరూపణకై పోరాడతారు. కోపం తెచ్చుకుని ప్రవర్తన చెడగొట్టుకుంటారు. చెప్పిన మాటలు వినరు. కనుక తల్లితండ్రులు పిల్లలతో చక్కని సమయం గడుపుతూ వారికి అన్నీ వివరించాలి కాని, వారు కోరినదల్లా ఇచ్చి గారాబం చేయరాదు.
ఉద్యోగస్తులైన మహిళలు తగిన సమయాన్ని పిల్లలకు అందించలేక, వారికి బహుమతులిస్తారు. అలాచేయ కుండా వారితో కలసి షికారుకి వెళ్ళడం, వారి అవ సరాలు, కష్టాలు తెలుసుకోవడం, తగిన పరిష్కారాన్ని సూచించడం వంటివి చేయాలి. అపుడే వారు ప్రపం చాన్ని అర్థం చేసుకోగల అవకాశం కలిగి వుంటారు.
అన్నింటికన్నా ముందు పిల్లలకు నిజాయితీని నేర్పించాలి. ఎప్పుడూ నిజం చెప్పే గుణాన్ని అలవాటు చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా వాళ్లు అబద్ధం చెబితే చిన్నపిల్లలే కదా అని వదిలేయకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో వాళ్లకు అబద్ధాలాడడం అలవాటుగా మారే అవకాశం ఉంది. అందుకే వెంటనే పిల్లలకు వాళ్లు చేసిన తప్పు గురించి అర్థమయ్యేలా చెప్పాలి.
ఇతర పిల్లలతో ఎలా మెలగాలో కూడా చెప్పాలి. ఎటువంటి పనులు చేయకూడదో వివరించాలి. అలా చేయడం వల్ల పిల్లలకి మంచి ప్రవర్తన అలవడడంతో పాటు ఏది తప్పు, ఏది ఒప్పో తెలుసుకునే విచక్షణా జ్ఞానం పెరుగుతుంది. అలాగే తోటిపిల్లలు కిందపడినా, జారిపడిపోయినా నవ్వకూడదని చెప్పాలి. అవసరమైతే ఆ సమయంలో వాళ్లకు సహాయం చేయమని ప్రోత్సహించాలి.
అదేవిధంగా ఏదైనా పనిని నిర్ణీత సమయంలో పూర్తిచేసేట్టుగా పిల్లల్ని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల కలిగే లాభం గురించి వివరిస్తే వాళ్ళే తరువాత నుంచి సమయానికి పనులు చేయడం అలవాటు చేసుకుంటారు.