Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇడ్లీ.. ఆరోగ్యకమైన ఆహారం. కానీ తినడానికే చాలామంది ఇష్టపడరు. రెగ్యులర్‌గా చేసినట్టు అయితే ఇష్టపడకపోవచ్చు... కానీ ఈ కాంబినేషన్స్ ప్రయత్నించండి. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం.
బార్లీ ఇడ్లీ
కావాల్సిన పదార్ధాలు: బార్లీ గింజలు - ఒక కప్పు, ఉప్పుడు బియ్యం - రెండు కప్పులు, మినుములు - ఒక కప్పు, మెంతులు- అర స్పూన్, ఉప్పు - తగినంత, తరిగి ఉడికించిన క్యారెట్, చిక్కుడు ముక్కలు - ఒక కప్పు
తయారు చేయు విధానం: ముందుగా మినపపప్పు, మెంతులు, ఉప్పుడు బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిలో బార్లీ గింజలు చేర్చి ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి. ఈ పిండికి తగినంత ఉప్పు కలుపుకుని ఐదు గంటల పాటు పక్కనబెట్టాలి. ఐదు గంటల తర్వాత పిండిని బాగా కలిపి.. ఇడ్లీ రేకుల్లో నెయ్యి రాసి పిండి ఇడ్లీల్లా వేసుకోవాలి. తరిగిన కూరగాయ ముక్కలను పైన వేసుకోవాలి. అరగంట 20 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే బార్లీ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని సాంబార్ లేదంటే మీకు నచ్చిన చట్నీతో వడ్డిస్తే టేస్ట్ అదిరిపోతుంది.
ఉప్మారవ్వ ఇడ్లీ
కావాల్సిన పదార్ధాలు: ఉప్మారవ్వ- పావుకేజి, పెరుగు-1 కప్పు, వంటసోడ- చిటికెడు, పచ్చిమిర్చి -4, కొత్తిమీర-1 కట్ట, నూనె-2 టేబుల్ స్పూన్, ఆవాలు-1 టీ స్పూన్, పసుపు- పావు టీ స్పూన్, టమాట గుజ్జు- అరకప్పు, 2 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం: పాన్ లో నెయ్యి వేసి అందలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కర్వేపాకు రవ్వా వేసి వేయించుకోవాలి. పోపు చల్లారిన తరువాత ఉప్పు, పెరుగు, సోడా, టమాట గుజ్జు వేసి బాగా కలిపి 1 గంట పక్కన పెట్టాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఇడ్లి పాత్రలో వేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి మూత పెట్టాలి. 10 నిమిషాల తరువాత ఇడ్లీలు రెడి అవుతాయి. ఈ ఇడ్లీని మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చు.
ఓట్స్ ఇడ్లీ
కావాల్సిన పదార్ధాలు : ఓట్స్- ముప్పావు కప్పు, రవ్వ- అరకప్పు, పెరుగు- ఒక కప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు, నూనె- రెండు స్పూన్లు, జీలకర్ర- ముప్పావు స్పూన్, ఇంగువ-కొద్దిగా, మిరియాల పొడి - పావు స్పూన్, చిన్న అల్లంముక్క సన్నగా తుముకోవాలి, ఒక క్యారెట్ తురుము, తాజా కొతిమీర -కొద్దిగా, కరివేపాకు -రెండు రెమ్మలు
తయారు చేయు విధానం: ఓట్స్ వేయించి పొడి చేసుకోవచ్చ లేదా అలాగే వాడవచ్చు. క్యారెట్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించి అన్నీ కలిపి నీరుపోసి ఇడ్లీ పిండిలాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్ల లో మామూలు ఇడ్లీ లాగా వండుకోవాలి. ఏదైనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
వెజ్‌టేబుల్ ఇడ్లీ
కావాల్సిన పదార్ధాలు : ఇడ్లీ పిండి - తగినంత, పచ్చిమిర్చి - పావు కప్పు, కరివేపాకు తరుగు - పావు తప్పు, ఉప్పు - తగినంత, కూరగాయల తరుగు - రెండు కప్పులు
తయారు చేయు విధానం : ఇడ్లీ పిండిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యం, మినపప్పు, శెనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. బియ్యంతో పాటు మినప, శెనగపప్పు, పచ్చిమిర్చిని చేర్చి మెత్తగా గాకుండా రవ్వలా రుబ్బుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండిని రెండు లేదా మూడు గంటలకు ముందే ఈ పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 20 నిమిషాల పాటు ఉడికిస్తే వెజ్ ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్.
జొన్న ఇడ్లీ
కావాల్సిన పదార్ధాలు: జొన్న రవ్వ - 100 గ్రా., మినపపప్పు - 50 గ్రా., ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం: మినపపప్పు, నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి నానబెట్టుకున్న జొన్న రవ్వ కలపాలి. మామూలు ఇడ్లి పిండి కన్న పలుచగా కలిపి ఇడ్లీ చేయాలి.
కొర్ర ఇడ్లీ
కావాల్సిన పదార్ధాలు: కొర్రలు - మూడు కప్పులు, మినప్పప్పు - కప్పు, మెంతులు - టేబుల్‌స్పూన్, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం: కొర్రలూ, మినప్పప్పూ, మెంతుల్ని విడివిడిగా ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి. మర్నాడు విడివిడిగా రుబ్బుకోవాలి. మినప్పప్పు రుబ్బేప్పుడు మెంతుల్నీ వేసేయాలి. మినప్పిండి మెత్తగా ఉండాలి.. కొర్రల మిశ్రమం కాస్త బరకగా ఉండాలి. ఈ రెండింటినీ, తగినంత ఉప్పునీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలిపి కనీసం ఎనిమిది గంటలు నానబెట్టాలి. తరవాత ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి ఈ పిండి అందులో వేసి ఆవిరిమీద పది నిమిషాలు ఉడికించాలి. అంతే కొర్రల ఇడ్లీలు సిద్ధం