Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి రిఫ్రిజిరేటర్లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. స్టవ్ మీద నుంచి ఏ వంటకం దించినా.. ఫైనల్ టచ్ దీంతో ఇవ్వాల్సిందే. చక్కని సువాసనతో పాటు వంటకాలకు అదనపు రుచినిచ్చే శక్తి కొత్తిమీరకు ఉంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ... కానీ ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనది.. అత్యధిక వంటకాల్లో ఉపయోగించే కొత్తిమీర అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
- కొత్తిమీరలో థియామైన్తో సహా అనేక ఖనిజాలు, విటమిన్లు సమద్దిగా ఉంటాయి. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్‌లు దీనిలో ఉంటాయి. ప్రొటీన్లు కూడా ఎక్కువే.
- దీన్ని తరచూ ఆహారంలో వాడటం వల్ల కొలెస్ట్రా ల్ సమస్య కొంత వరకు తీరుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయులను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయులను పెంచుతుంది.
- కొత్తిమీర చర్మాన్ని కాపాడుతుంది. చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనిక మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖంపైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన రసాన్ని కలపడం వలన, మిశ్రమం ప్రభావం రెట్టింపు అవుతుంది.
- మధుమేహంతో బాధపడేవారికి కొత్తిమీర చక్కని ఔషధంగా పని చేస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్‌ను ఇది సమన్వయం చేయగలదు.
- కొత్తిమీరలో అధికంగా లభించే విటమిన్ 'కె' వయసు మళ్లిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పని చేస్తుంది. కొవ్వుని కరిగించే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా లభిస్తాయి.
- ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్ లక్షణాలు నోటిపూతను అదుపులో ఉంచుతాయి.
- కొత్తిమీరను మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది.
- కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.
- దీనిలో 'ఎసెన్షియాల్ ఆయిల్స్' ఉండటం వలన తలనొప్పి, మానసిక అలసట, టెన్షన్స్ను తగ్గిం చుటలో ఉపయోగపడుతుంది. జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్‌ని మెండుగా కలిగి ఉండి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.