Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలా చేరుతుందో తెలియకుండానే వంటగదిలో చెత్త పేరుకుపోతుంటుంది. ఓపిక లేకో, ఆసక్తి లేకో ఒక్క రోజు సర్దకుండా ఊరుకుంటే చాలు అస్తవ్యస్తంగా తయారైపోతుంది. అలాకాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే వంటింటిని అందంగా, శుభ్రంగా ఉంచొచ్చు. అవేంటంటే...
ఆహారం వండే టైముకే ఏం చెయ్యాలా అని ఆలోచించకుండా....మీరు ఓ సింపుల్ చిట్కా పాటిస్తే సరిపోతుంది. అదేంటంటే మీ ఇంట్లో ఫ్రిజ్ పక్కగా ఒక బోర్డును వేలాడదీసి, దాని మీద ఆ వారంలో మీరు వండే మెను రాసేయండి. ఆ తరువాత ఏరోజుకా రోజు వంట సులభంగా చేసేయొచ్చు. అలాగే ఫ్రిజ్కి మరో వైపు మిగిలిపోయిన పదార్థాల వివరాలు రాసేయండి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో ఏమి ఉన్నాయో కుటుంబంలో అందరికీ తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఆహార పదార్థాల వథా తగ్గిపోతుంది.
కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి అలానే ఉంచి పాడయ్యాక బయపడేస్తుంటారు. ఇలా పారేయకుండా ఉండాలంటే ఆ తెచ్చుకున్న పదార్థాల మీద వెంటనే మీరు తెచ్చిన తేదీని వేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్‌లో ఎంత కాలం నుంచి నిల్వ ఉంటుందో తెలుస్తుంది. పదార్థం పాడుకాక ముందే తినేస్తారు. నో వేస్టేజ్.
మైక్రోవేవ్ వాడే వాళ్లందరిని భయపెట్టే సమస్య మైక్రోవేవ్ గోడలకు, సీలింగ్‌కు అతుక్కుపోయి, ఎండిపోయిన ఆహారపదార్థాలు. వాటిని శుభ్రం చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ సమయంలో శుభ్రం చేయాలంటే తడిపిన స్పాంజ్‌ను మైక్రోవేవ్‌లో ఉంచి ఐదు నిమిషాలు వేడిచేయాలి. ఆ తరువాత కొన్ని నిమిషాలు అలానే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల దాన్నుంచి విడుదలయ్యే ఆవిరి మైక్రోవేవ్ గోడలకు అతుక్కుపోయిన పదార్థాలను వదులు చేస్తుంది. ఆ తరువాత ఆ స్పాంజ్తోనే వాటిని తుడిస్తే సులభంగా ఊడి వచ్చేస్తాయి. మరో టిప్ ఏమిటంటే ఒక గిన్నెలో నీళ్లు, వెనిగర్ కలిపి ఉంచాలి. వెనిగర్‌కి బదులుగా బేకింగ్ సోడా వేయొచ్చు. తరువాత వేడిచేయాలి.
వెనిగర్, బేకింగ్ సోడా, నీళ్లు, నిమ్మకాయలతో వంటింటిని మెరిసేలా చేయొచ్చు. ఇవి ఉంటే ప్రత్యేకంగా క్లీనర్లు కొనాల్సిన అవసరం లేదు. డబ్బు ఆదా అవుతుంది. హ్యాండిల్ ఉన్న స్టీమర్లో నీళ్లు పోసి దాన్నుంచి వచ్చే ఆవిరితో ఒవెన్, ఒవెన్- టాప్స్, మైక్రోవేవ్స్, స్టవ్ గట్టు శుభ్రం చేసేయొచ్చు.
స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెల మీద పడే చేతి వేళ్ల గుర్తులు, మరకలు క్షణాల్లో మాయం చేయొచ్చు తెలుసా. మీ వంటింట్లోని స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు, వస్తువులు కొత్తగా మెరిసిపోవాలంటే బేబీ లేదా ఆలివ్ నూనెల్ని వాడాలి. మెత్తటి బట్టను నూనెలో ముంచి వాటి మీద ఉన్న మరకల మీద రుద్దితే మరకలుపోయి గిన్నెలు కొత్తగా మెరిసిపోతాయి.