Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోషం అంటే ఏమిటి? దానికి కొలమానాలేమిటి? అసలు సంతోషంగా ఉండటం ఎట్లా? ఎన్నో ప్రశ్నలు. సంతోషం ఎక్కడో ఉండది. మనలోనే ఉంటుంది. మనతోనే ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. దాన్నే తెలియజెప్పి... పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. నిత్యం సంతోషంగా ఉండటం చాలా సులభం అంటున్నది... హ్యాపీనెస్ కోచ్ జానకి రవని. హౌజ్ ఆఫ్ హ్యాపీనెస్ పేరుతో ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి తాను సంతోషంగా ఉండటమే కాదు.. నలుగురికీ సంతోషాన్ని పంచుతున్నారు.
సంతోషం అనేది ఓ మానసిక స్థితి. నువ్వు ఏమవ్వాలనుకుంటావో అదే చేస్తావు. అలాగే సంతోషంగా ఉండాలనుకోవడం అనేది చాయిస్. ఏది జరిగినా సంతోషంగా ఉండా లనుకోవడంలోనే అసలైన సంతోషం ఉంది. హెచ్ఆర్లో ఎంబీఏ చదివిన జానకి... కొన్నేండ్లపాటు కార్పొరెట్ సంస్థలతో పనిచేసింది. హెచ్ఆర్ అంటేనే.. చాలా కఠినంగా ఉంటారనే ఫీలింగ్. కానీ.. జానకి అలా కాదు. ఉద్యోగులతో చాలా బాగా ఉండేది. రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఎక్కువ రోజులు సెలవులో ఉండాల్సి వచ్చింది. అప్పుడనిపించింది... నలుగురిని సంతోషంగా ఉంచడం, ప్రత్యేకించి ఉద్యోగులు... ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఉంటారు. అలాంటివాళ్లను సంతోషంగా ఉంచడం, వాళ్లు మరింత ప్రొడక్టివ్‌గా పనిచేయగలరని ఆలోచించింది. అయితే.. అనుకోగానే హ్యాపీనెస్ హౌజ్‌ను ప్రారంభించలేదు. ఏడాదిపాటు అధ్యయనం చేసింది. గత జీవితపు పశ్చాత్తాపం, హీలింగ్తోపాటు బర్కిలీ యూనివర్సిటీనుంచి సైన్స్ఆఫ్ హ్యాపీనెస్ చదివింది. తరువాత సొంతంగా హ్యాపీనెస్కోచ్గా కెరీర్ ప్రారంభించింది. అయితే వ్యక్తులుగానూ కోచింగ్ ఇస్తుంది. కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు హ్యాపీనెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నది. నలుగురి జీవితాల్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలిగాన్న ఊహే ఆనందాన్నిస్తుందని చెబుతున్నది జానకి.
''చాలా మంది సక్సెస్‌తో సంతోషం వస్తుందనుకుంటారు. కొన్నిసార్లు అలాగే వస్తుంది కూడా. కానీ... లాంగ్‌రన్‌లో అలా కుదరదు. సంతోషాన్ని మనం ఎంచుకోవాలి. దాంతోపాటు మన ఆసక్తిని బట్టి నడుచుకోవాలి. చాలా మందికి మనసొకటి చెబుతుంది. చేసేది మరొకటి. ఈ రెంటికీ పొంతన కుదరకపోవడం వల్ల... మానసిక చింత. అంటే.. ఎవరికి వారు అన్యాయం చేసుకోవడం. కాబట్టి... ఎవ్వరైనా తమకేం కావాలో తెలుసుకుని.. దాన్ని బట్టి నడుచుకుంటే ఇబ్బందే ఉండదు'' అంటుంది జానకి.