Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఎక్కువ సమయం. ఆ మధ్య సమయంలో కచ్చితంగా ఏదో ఒక స్నాక్ తీసుకోవాల్సిందే. చల్లని సాయంత్రాల్లో ఘాటైన స్నాక్స్ అయితే బాగుండు అనిపిస్తుంది. అందులోనూ నాన్‌వెజ్ అంటే వెంటనే రెస్టారెంట్స్‌కు వెళ్తారు చాలా మంది. అలా కాకుండా... ఇంట్లోనే నాన్‌వెజ్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అలాంటి మటన్ అండ్ చికెన్ స్నాక్స్ కొన్ని మీకోసం...
లివర్ కబాబ్
కావాల్సిన పదార్ధాలు :
మటన్ లివర్ - పావు కిలో, పెరుగు - ఒక కప్పు, లవంగాలు -ఐదు, దాల్చిన చెక్క - ఒక అంగుళం, అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్, ధనియాల పొడి - టేబుల్ స్పూన్, మిరియాల పొడి - టీ స్పూన్, నెయ్యి - టీ స్పూన్, తగినంత ఉప్పు
తయారు చేయు విధానం
ముందుగా లివర్‌ను బాగా కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతకు ముందు లవంగాలు, దాల్చిన చెక్కలను పొడి చేసుకుని పెట్టుకోవాలి. లివర్‌కు పెరుగు కలిపి, లవంగాలు దాల్చిని పొడిని, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, ఉప్పు కలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి. లివర్ ముక్కలకు మసాలా బాగా పట్టిన తరువాత... దీన్ని గ్రిల్ చేసుకోవాలి. అంతే లివర్ కబాబ్స్ రెడీ!
కావాల్సిన పదార్ధాలు : చికెన్- 250గ్రా, ఓట్స్- 2టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి- 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు- తగినంత, కారం- 2 టేబుల్ స్పూన్లు, పచ్చిబఠాణీలు- 2 టేబుల్ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్- స్పూను, పెరుగు- 3 టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు- టేబుల్ స్పూను
తయారు చేయు విధానం : చికెన్ ను గ్రైండ్ చేసి పేస్టులా చేయాలి. ఇందులో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠాణీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకుని అరచేతిలో వత్తి, బియ్యం పిండిలో అద్ది, నాన్‌స్టిక్ పాన్ మీద వేయించాలి. వీటి తయారీకి నూనె వాడాల్సిన అవసరం లేదు.
చికెన్ పోపెర్స్
కావాల్సిన పదార్ధాలు : చికెన్- పావుకిలో, ఉప్పు-తగినంత, మిరియాలపొడి- టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్, గుడ్లు- మూడు, గోధుమ పిండి-ఒక కప్పు, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా, వెన్న -5 టేబుల్ స్పూన్లు, సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు, టమాటా-1(మెత్తని గుజ్జు), నిమ్మరసం-3 టేబుల్ స్పూన్లు, తేనె -ముప్పావు కప్పు.
తయారు చేయు విధానం: ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, వేసి బాగా కలుపుకోవాలి. రెండు చిన్నచిన్న బౌల్స్ తీసుకుని ఒకదానిలో గుడ్డుసొన మరో దానిలో గోధుమ పిండి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఈ లోపు చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా గోధుమ పిండిలో అద్ది తర్వాత ఎగ్ బౌల్లో ముంచాలి. మళ్ళీ గోధుమ పిండిలో ముంచి ఫ్రైచేసుకోవాలి.అలా అన్ని చికెన్ ముక్కల్నీ డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని వెన్న, సోయా సాస్, నిమ్మరసం, తేనె ఒకదాని తర్వాత ఒకటి వేసి వేడి చేసుకోవాలి. అందులో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. కాస్త దగ్గర పడిన తరువాత దింపేసుకోవాలి. వీటిని చట్నీలో నంజుకుని తింటే టేస్టీగా వుంటాయి.
చికెన్ కట్లెట్
కావాల్సిన పదార్ధాలు : చికెన్ ( బోన్ లెస్ )- అరకేజీ, ఉడికించిన ఆలు- రెండు, ఉల్లిపాయముక్కలు - పావుకప్పు, పచ్చిమిర్చి ముక్కలు- రెండు స్పూన్లు, కరివేపాకు - రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్- ఒక స్పూన్, ధనియా పొడి - ఒక స్పూన్, జీలకర్ర పొడి - ఒక స్పూన్, కారం- ఒక స్పూన్, పసుపు- అరస్పూన్, ఉప్పు - తగినంత, గరం మసాలా - ఒక స్పూన్, మైదా - అరకప్పు, బ్రెడ్ క్రంప్స్ పొడి- అరకప్పు, నిమ్మ రసం - ఒక స్పూన్, కొత్తిమీర - కొద్దిగా, ఆయిల్ - డీప్ ఫ్రై కి సరిపడా
తయారు చేయు విధానం : ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కీమాలాగా కట్ చేసుకుని శుభ్రం గా కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయముక్కలు , కరివేపాకు , పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ కీమా వేసుకుని కలిపి మగ్గాక అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరం మసాలా అన్ని వేసి బాగా వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసి ఒక సారి కలిపి దించుకోవాలి . ఒక గిన్నె తీసుకుని అందులో ఉడకపెట్టుకున్న ఆలు గడ్డను వేసి బాగా మెదుపుకోవాలి. అందులో చికెన్ మిశ్రమం వేసి బాగా కలిపి చిన్న చిన్న బాల్ లాగా చేత్తో వత్తుకుని ఆలా అన్ని చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి . వేరే గిన్నె తీసుకుని అందులో మైదా, కొంచెం వాటర్ వేసి కలిపి బజ్జిపిండి లాగ కలిపి పెట్టుకోవాలి, వేరే ప్లేట్లో బ్రెడ్ క్రంప్స్ వేసి పెట్టుకోవాలి , ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ టిక్కా లను ముందుగా మైదా పిండిలో ముంచి తర్వాత బ్రేడ్ క్రంప్స్లో దొర్లించుకోవాలి. ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి . స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి కాగాక అందులో ఈ చికెన్ టిక్కా లను ఒక్కొకటిగా వేసుకుని రెండు వైపులా దోరగా వేయించుకుని పేపర్ పరిచిన ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.
ఖీమా పకోడి
కావాల్సిన పదార్ధాలు : ఖీమా (మటన్ )- 500 గ్రాములు, ఉల్లిపాయలు-ఒకటి, పచ్చిమిర్చి-4, శనగపిండి- ఒక కప్పు, టమాట-ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్, కబాబ్ మసాల- టీ స్పూన్, ఉప్పు- తగినంత, నూనె-2 కప్పులు
తయారు చేయు విధానం : ముందుగా ఖీమా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట ముక్కలను ఒక బౌల్ లో వేయాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు, ఖీమా మసాల, గరం మసాలా కలిపి ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఖీమా మిశ్రమంలో శనగపిండి జతచేసి, నీళ్ళుపోసి చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఖీమా మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని పకోడిలాగా చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడిచేయాలి నూనె బాగా వేడి అయిన తరువాత సిద్దం చేసుకున్న ఖీమా పకోడి మిశ్రమాన్ని వేసి దోరగా వేయంచుకోవాలి.
స్పైసీ చికెన్ బైట్స్
కావాల్సిన పదార్ధాలు : బోన్‌లెస్ చికెన్ (ముక్కలుగా చేసుకోవాలి) -350 గ్రాములు, మైదా- టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి- టేబుల్ స్పూన్, మిరియాలపొడి-1/2 టేబుల్ స్పూన్, ధనియా పొడి-1/2 టేబుల్ స్పూన్, జీలకర్రపొడి-1/2 టేబుల్ స్పూన్, కారం-1/2 టేబుల్ స్పూన్, గరంమసాలా-1/2 టేబుల్ స్పూన్, అల్లం, వెల్లుల్లి ముక్కలు-టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు- టేబుల్ స్పూన్, ఉల్లికాడల తరుగు- ఒకకప్పు, గుడ్లు-2, సరిపడేంత నూనె, టమాటా కెచప్-1/2 కప్, నీళ్లు-ఒకకప్పు, రుచికి తగినంత ఉప్పు
తయారు చేయు విధానం : చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి వాటిని ఒక పాత్రలో వేసుకోవాలి. అలాగే అందులోనే గుడ్డుసొన, ధనియాపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు తదితర పదార్థాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. పది నిముషాలపాటు అలాగే మొత్తం మిశ్రమాన్ని వదిలేయాలి. ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అనంతరం మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. రెండు నిముషాల తర్వాత అందులో ఇదివరకు వేయించిన చికెన్ ముక్కలతోబాటు టమోటా కెచప్ వేసి మళ్లీ వేయించాలి. బాగా వేయించిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు చల్లి వేయించి... 2,3 నిముషాల తర్వాత దించేయాలి.