Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో సతమ తమవుతున్నారు. ఇదే దీర్ఘకాలం కొనసాగితే డిప్రెషన్ వంటి సమస్యలొస్తాయి. ఈ పరిస్థితిని నివారించి ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు..
- మానసిక ఒత్తిడికి ప్రాణాయామం మేలైన పరిష్కారం. అందుకే బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు 10 నిమిషాల పాటు గట్టిగా గాలి పీల్చి, వదులుతూ ఉండాలి. దీనివల్ల కొంత ఒత్తిడి భారం తగ్గుతుంది. ప్రశాంత వాతావరణంలో రోజూ సూర్యోదయ సమయాన ఇలా చేయగలిగితే ఒత్తిడి దాదాపుగా దరిజేరదు.
- రోజూ ఉదయం కనీసం 40 నిమిషాల పాటు నడక, జాగింగ్, సైక్లింగ్, జిమ్, పరుగు వంటి వ్యాయామాలు చేసేవారు ఎంతటి మానసిక ఒత్తిడినైనా అధిగమించగలుగుతారు. వీటివల్ల మంచి ఆరోగ్యం, చక్కని శరీరాకతి కూడా పొందొచ్చు.
- మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలన్నా, వదిలించుకోవాలన్నా వేపుళ్ళు , జంక్ ఫుడ్, స్వీట్ల వినియోగానికి దూరంగా ఉండాల్సిందే. వీరు వేళ పట్టున ఆహారంతో బాటు తాజా పండ్లు, పండ్ల రసాలు, తాజా సలాడ్లు తీసుకోవటం ద్వారా మానసిక ఒత్తిడిని వదిలించుకోవచ్చు.
- సంగీతం, డాన్స్, బొమ్మలు వేయటం, కొత్త ప్రదేశాలు తిరగటం, మొక్కలు, పెంపుడు జంతువుల పెంపకం, నచ్చిన పుస్తకాలు చదువుకోవటం వంటివి మానసిక ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. కనుక రోజులో కనీసం ఒక గంట కేటాయిస్తే ఒత్తిడి ముప్పే ఉండదు.
- ఒత్తిడి బాధితులకు కంటిమీద కునుకు ఉండదు. ఈ కలత నిద్ర సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంటుంది. అందుకే రోజుకు కనీసం 8 గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి. పగటిపూట నిద్ర అలవాటు ఉంటే మానుకొంటే రాత్రి నిద్రకు ఇబ్బంది ఉండదు.
- ఒత్తిడితో కూడిన బాధ్యతలు నిర్వహించేవారు వారానికోసారైనా మసాజ్ చేయించుకోవటం ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.
- అసూయ, కోపాలకు దూరంగా ఉండటంతో బాటు సమయపాలన నియమాన్ని పాటిస్తే మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచటం సాధ్యమే.