Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చల్లని వాతావరణంలో ఉదయం అయినా, సాయంత్రమైనా వెచ్చగా గుర్తొచ్చేది టీ. ఉదయం లేవగానే ఓ కప్పు టీ పడితేనే మంచం మించి కిందకు దిగని వాళ్ళు ఎంతోమంది. భోజనం లేకపోయినా ఫర్వాలేదు చిన్న కప్పు టీ ఉంటె చాలానే వాళ్లూ అనేకం. టీ తాగకపోతే తలనొప్పి అనేవాళ్లూ ఉన్నారు. కానీ ఆరోగ్యానికి ఈ టీ ఒక్కటే సరిపోదు. సర్దితో ఉన్నప్పుడు... మిరియాలు కలిపి దెబ్బకు వదులుద్ది. ఇక మసాలా టీ ఇచ్చే మజాయే వేరు. అలాంటి రకరకాల టీలను మీరు ప్రయత్నించండి!
మందార పువ్వు టీ
కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన మందార పువ్వులు- ఒక కప్పు (రసాయనాలు, పురుగుమందులు వాడకుండా పెంచిన, తినదగిన పువ్వులు), దాల్చిన చెక్క ముక్క-ఒక అంగుళం, అల్లంముక్క - సగం (బాగా కడిగిన, తాజాముక్క, పొట్టు తీయకుండా గుండ్రని బిళ్లలుగా కోయాలి, తేనె/ తాటి బెల్లం- రుచికి తగినంత
తయారీవిధానం: 4 కప్పుల నీటిని మరిగించండి. మందారపూలు, దాల్చిన చెక్క, అల్లంముక్కలు వేయండి. 5 నిమిషాలు మరిగించండి. పాత్రను దించి మూతపెట్టండి. 15-20 నిమిషాలు అలా ఉంచండి. (పూలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచితే చేదురావచ్చు. మరింత పరిమళం, రుచికోసం మరికొన్ని ఎండు పూలు వేయవచ్చు) దాల్చిన చెక్క, అల్లం ముక్కలను గట్టిగా ఒత్తి పానీయాన్ని వడకట్టండి. వాటి పరిమళం చక్కగా దిగుతుంది. రుచికి తగ్గట్టు తేనె లేదా తాటిబెల్లం చేర్చండి. చల్లగాగాని, వేడిగా గాని తాగండి. దాన్ని రిఫ్రిజరేటర్లో పెట్టే ముందు పూర్తిగా చల్లబడనివ్వండి.
తులసి టీ
కావాల్సిన పదార్థాలు:
తులసి ఆకులు-గుప్పెడు, తాటి బెల్లము-కొద్దిగా, నీళ్లు- 2 కప్పులు
తయారీవిధానం : తులసి ఆకులను కడిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె లో 2 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. అందులో తాటి బెల్లము, తులసి ఆకులు వేసి 2నిమిషాలు మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తరువాత రెండు కప్పుల లోకి వడ పోసుకోవాలి. వేడి వేడిగా అయినా తాగొచ్చు.చల్లారాక అయినా తాగొచ్చు.
మింట్ గ్రీన్ టీ
కావాల్సిన పదార్థాలు :
గ్రే టీ ఆకులు -1 స్పూన్, మింట్ ఆకులు- 4 ఆకులు, తేనె 1 స్పూన్, నీళ్లు - ఒక కప్
తయారీవిధానం :
గిన్నెలో నీళ్లుమరిగించు కోవాలి. మరిగిన నీళ్ళల్లో గ్రీన్ టీ ఆకులు వెయ్యాలి. మింట్ ఆకులు కూడా వెయ్యాలి. కప్లో తేనె వేసి నీళ్లను వడగట్టి స్పూన్ తో కలిపి తీసుకోవాలి.
మిరియాల టీ
కావాల్సిన పదార్ధాలు :
మిరియాల పొడి- 1 టీ స్పూన్, నీళ్లు -1 కప్పు, పాలు -1 కప్పు, పంచదార -4 టీ స్పూన్లు, టీ పొడి -2 టీ స్పూన్లు
తయారీవిధానం
గిన్నెలో పాలు, నీరు, పంచదార మరిగించి, మిరియాల పొడి వేసి, టీ పొడి వేసి మరిగించి, మూత పెట్టి, ఫిల్టర్ చేసి కప్పులలో పోసి సర్వ్ చేస్తే, జలుబు, కొంచెం జ్వరం, దగ్గు ఉన్నవారికి చాలా రిలీఫ్ నిస్తుంది. చాలా బాగుంటుంది. చలికూడ తగ్గుతుంది. శరీరానికి వేడిని కలిగిస్తుంది.
మసాలా టీ
కావాల్సిన పదార్ధాలు: పాలు - ఒక కప్పు, టీ పొడి - ఒక టీ స్పూను, అల్లం - అర అంగుళం, యాలకులు - ఒకటి,దాల్చిన చెక్క - అర అంగుళం, శొంఠి - చిన్న ముక్క, లవంగం - ఒకటి, పంచదార - రుచికి తగినంత
తయారీ విధానం: లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, శొంఠి కొద్ది కొద్దిగా తీసుకుని పొడి చేసి డబ్బాలోవేసి పెట్టుకోండి. టీ చేసేటప్పుడు టీ పొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తరవాత పాలు , చక్కెర కలిపి బాగా మరిగించాలి. తరువాత వడపోసుకుంటే... గరం గరం మసాలా టీ రెడీ.