Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు చౌకగా లభించే ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మనం సాధారణంగా వాడే ఆకుకూరల్లో తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, పాలకూర, పుదీనా ప్రధానమైనవి. ప్రతిరోజు ఆహారంలో దాదాపు 20 శాతం వరకు ఆకుకూరలు తీసుకోవడం మంచిది. వీటి వలన అనేక లాభాలున్నాయి.
పాలకూర : విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగ నిరోధకశక్తికి, ఎముకల సాంద్రతకు తోడ్పడతాయి.
గోంగూర: విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కావున కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాక విటమిన్ సి కూడా తగు మోతాదులో లభిస్తుంది.
బచ్చలి కూర: విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. అందువలన రక్తకణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పొన్నగంటి: విటమిన్ ఎ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
తోటకూర: యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగాపడతాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తాయి. ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి.
చుక్కకూర: విటమిన్ ఎ, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి, అందువల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.
మునగాకు: అన్ని ఆకుకూరలలో కన్నా దీనిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, కాపర్ కూడా ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
మెంతికూర: పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధికబరువు కలవారికి, గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
కొత్తిమీర: యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. వద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
పుదీన: యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చలువ కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
కరివేపాకు: బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు సంరక్షణకు మంచిది. అరుగుదల శక్తిని పెంచుతుంది.
క్యాబేజి: గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన మధుమేహులకు మంచిది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కొలైన్ ఎక్కువగా ఉండటం వలన నరాల బలహీనతను తగ్గిస్తుంది.
గంగవల్లి: ఒమేగ-3 ఫాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండె జబ్బులను దరికి రానివ్వదు. మాంసాహారం తీసుకొనని వారు దీన్ని తినడం వలన గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.
కాలీ ఫ్లవర్: కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎముకలకు, పంటి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.