Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు ఎంత మేలు చేస్తాయో సౌందర్య పోషణకు అంతకంటే ఎక్కువగా దోహదపడతాయి. చర్మ, కేశ సౌందర్య పరిరక్షణకు అవసరమైన ఎన్నో పోషకాలు కొబ్బరిపాలలో ఉంటాయి. కొబ్బరిపాలతో సౌందర్య పరిరక్షణ ఎలాగో తెలుసుకుందాం.
- గోరువెచ్చని బకెట్టు స్నానపు నీటిలో అరకప్పు కొబ్బరి పాలు, గుప్పెడు గులాబీ రేకులు, చెంచా తేనె వేసి కలిపి ఆ నీటితో స్నానం చేస్తే పొడిబారిన చర్మానికి తగినంత తేమ అంది చర్మం కాంతి వంతం అవుతుంది.
- ఎండ వల్ల కమిలి దెబ్బతిన్న చర్మంపై కొబ్బరిపాలలో ముంచిన దూదితో 5 నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయటం వల్ల కందిన, నల్లబడిన చర్మం సరికొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
- చెమట ఎక్కువగా పోసి, దానికి కాలుష్యం, ధూళి ప్రభావం తోడైతే పలు వ్యర్థాలు చర్మంపై పేరుకుపోయి మొటిమలు, కురుపులు ఏర్పడటం సహజమే. 10 చెంచాల కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పావుగంటపాటు అలాగే ఉంచి తర్వాత దూదితో ముఖమంతా అద్ది ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం పై పేరుకున్న వ్యర్థాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.
- అర కప్పు చిక్కని కొబ్బరి పాలలో చెంచా తేనె, 2 చెంచాల బియ్యపు రవ్వ, చెంచాబాదం నూనె కలిపి ఆ మిశ్ర మాన్ని పాదాలకు పట్టించాలి. 5 నిమిషాలపాటు మర్దనా చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తేపాదాలు మదువుగా మారతాయి.
- కప్పు కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి 2 గంటలు ఫ్రిజ్లో ఉంచి తీసి ఆమిశ్రమాన్ని మాడుకు పట్టించి వేడినీటిలో ముంచిన ఉన్ని టవల్ను తలకు చుట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూ వాడి తలస్నానం చేయాలి. కనీసం వారానికి 2 సార్లు ఇలా చేయటం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గడమే గాక జుట్టు మదువుగా తయారవుతుంది.
చిట్లిన, పొడిబారిన జుట్టుకు కొబ్బరి పాలను బాగా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు తగినంత తేమ అంది పూర్వశోభను సంతరించునుకొంటుంది. జుట్టు కుదుళ్లు కూడా బలపడి జుట్టు రాలటం ఆగిపోతుంది.