Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్యాభర్తల కాపురం సంతోషంగా.. ఏ గొడవలు లేకుండా సాఫీగా సాగాలంటే ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. అయితే పెరుగుతున్న బాధ్యతల వల్లనో... మరేదైన కారణం చేతనో కొంతకాలానికి ఆ ప్రేమ ఇద్దరిమధ్యా తగ్గిపోతుంటుంది. ప్రేమ పెళ్లిళ్లలోనూ ఇది జరుగుతుంటుంది. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతప్తితో బాధపడిపోతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరి...
- భార్యాభర్తల మధ్య 'ప్రేమ' ఎప్పటికీ తాజాగా నిలవాలంటే ... మనసుకు కష్టం కలిగించిన వెంటనే ఆ విషయాన్ని భాగస్వామితో చర్చించాలి. నెమ్మదిగా చెప్పాలి. అలా కాకుండా ఆ బాధను దిగమింగితే అది మనసులోనే పెరిగి, పెద్దదై మరిన్ని బాధలకు కారణమవుతుంది. అలా అని ప్రతీ నిమిషం నాకిది నచ్చలేదు, నువ్వు ఇలా చేశావు అంటూ ఆరోపణలు గుప్పించటం కాదు. బాధ కలిగింది అన్న విషయాన్ని కమ్యునికేట్ చేయటమే లక్ష్యం తప్ప ఎదుటి వ్యక్తి పొరపాట్లని ఎంచటం ఉద్దేశం కాకూడదు.
- అలాగే... ఏం చెబితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనని ఊహించుకుని భయపడటం కూడా మంచిది కాదు.ఇతరుల మెదడు లోకి చూడటం మాని మనం ఏం అనుకుంటున్నామో అవి చెప్పాలి. ఎందుకంటే అపోహతో ఎదుటి వ్యక్తిని దూరం చేసుకునే బదులు బాధను పంచుకుని దగ్గర చేసుకోవటం వివేకమనిపించు కుంటుంది.
- నూరేళ్ళ జీవితంలో 'ప్రేమ' పచ్చగా కళకళలాడుతూ మనల్ని అంటిపెట్టుకుని వుండాలంటే ... తెలిసీ తెలియక ఏ చిన్న పొరపాటు చేసినా, మాట తూలినా, ఎదుటి వ్యక్తి మనసు కష్టపెట్టినా ఆ పొరపాట్లని అంగీకరించాలి. జరిగిన పొరపాటుని సరిదిద్దే బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని పొందగలం. అలాగే మన ఆత్మవిశ్వాసం నిలుపుకోగలం. పొరపాటు అంగీకరించినట్లు ఎదుటివారు గుర్తించినప్పుడు మాత్రమే వారూ ఓ అడుగు ముందుకు వేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు.
- ఒక్కోసారి చాలా సరదాగా మొదలైన చర్చ తీవ్రరూపం దాలుస్తుంది. అలాంట పుడు దానిని అక్కడితో ఆపేయడం మంచింది. ఎవరికి వారు వేరే పనిలో కాసేపు దష్టిపెట్టి, ఆవేశం చల్లారాక మాట్లాడటానికి ప్రయత్నించాలి. అందుకు కొంత సమయం పట్టినా పర్వాలేదు. తొందరపాటుతో బంధాన్ని బలహీనపర చుకోవటం కన్నా ఓపికపట్టడం తప్పుకాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకు తీరాలి. ఏ సమస్యకి అయినా సరైన వాతావరణంలో ప్రశాంతంగా చర్చించడం ద్వారానే పరిష్కారం దొరుకుతుంది.
- ఇక ఎదుటి వ్యక్తి చెప్పేది వినటం ముఖ్యం. వినటమంటే చెవులతో కాదు... మనసుతో వినటం. తను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే రెండో ఆలోచన లేకుండా ఒప్పుకోగలగాలి. అయితే... కానీ లాంటి కారణాలు వెతకద్దు. అలాగే తన ఆలోచన తప్పనిపిస్తే దానిని కూడా స్పష్టంగా, నెమ్మదిగా చెప్పాలి. అంతేకాని, అప్పటికి ఆ విషయాన్ని ముగించాలని ఒప్పుకున్నట్టు నటించటం వంటివి చేస్తే 'విశ్వాసం' కోల్పోతాం.
- ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏ విషయంలో అయినా మనసుకి పని చెప్పాలి కానీ, మెదడుకి కాదు. అన్నిటికంటే ముఖ్యం భార్యాభర్తల మధ్య నిశ్శబ్దానికి చోటుండకూడదు.