Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్వాదించే మనసుండాలే కానీ.. జీవితంలో ప్రతీ మూమెంట్ ఓ సెలబ్రేషన్. అందులోనూ పిల్లల గురించయితే వాళ్ల ప్రతి కదలికా అబ్బురం, ఆనందమయం. అలాంటి ప్రతిరూపాలను పదిలపరుచుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. అందుకే పిల్లలకు సంబంధించిన గుర్తులకోసం ఫొటోలు తీస్తుంటారు. కానీ ఆ గురుతులు చెరిగిపోకుండా ఉండాలని మరింత అద్భుతంగా చిత్రీకరిస్తున్నది అమృతా సామంత్. మన హైదరాబాదీ సెలబ్రిటీల రెగ్యులర్ ఫొటోగ్రాఫర్ అయిన అమృత... దానితోనే ఆగిపోలేదు. ఫొటోగ్రఫీ ద్వారానే తల్లిపాల గురించిన అవగాహన కల్పిస్తున్నది.
''మా పూర్వీకులు ఉత్తరాదికి చెందినవాళ్లు. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. తరువాత బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాను. దాంతో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రెండు వాతావరణాలు, సంస్కృతులు తెలుసు. నాకు సంగీతం, నృత్యం అంటే చిన్నప్పటినుంచి ఇష్టం. చదువుతో సంబంధం లేకుండా ఏదో ఒకటి నిత్యం నేర్చుకుంటూ ఉంటాను. అది ఫొటోగ్రఫీ కావచ్చు, డ్యాన్స్, నాటకం, రాయడం ఏదైనా. బాల్యంలో నేను చసిన ప్రతీ విషయాన్ని బొమ్మ గీసేదాన్ని. తరువాత చదువుమీదే శ్రద్ధ పెట్టాను. ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. ఏడేండ్లపాటు ఓ బహుళజాతి కంపెనీలో పనిచేశాను కూడా. ఆ ఉద్యోగం మీద విముఖత ఏం లేదు. కానీ వారాంతాలు, తీరిక దొరికనప్పుడల్లా... ఫొటోస్ తీసేదాన్ని. అట్లా ఫొటోగ్రఫీ డెవలప్ అయ్యింది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన నా ఫ్రెండ్ రాకేష్ ప్రకాష్ ద్వారా ఫొటోగ్రఫీపైన మరింత ఇష్టం పెరిగింది. ప్యాషన్‌తో ఫొటోగ్రఫీలోకి వచ్చాను.
అందరు మెచ్చుకోవడంతో...
ఒకప్పుడు ఫొటోస్ తీయించుకోవడం కోసం కుటుంబమంతా తయారయి.. స్టూడియోకు వెళ్లి స్టిల్స్ ఇచ్చి దిగేవారు. ఒకటే బ్యాక్‌గ్రౌండ్‌లో రకరకాల ఫోజులు. కానీ ఇప్పుడా రోజులు పోయాయి. సహజమైన భావాలు ఫొటోలో ప్రతిబింబించడానికి, అన్ని మూమెంట్స్‌ను క్యాప్చర్ చేసి పదిలపరుచుకోవాలని అనుకుంటున్నారు. డిజిటల్ కెమెరాస్ వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువయ్యింది. మంచి లెన్స్ ఉన్న కెమెరా ఫోన్లు వచ్చాక.. అసలు ఫొటోగ్రాఫర్లకు కాలం చెల్లిందనుకున్నారు చాలామంది. కానీ అలాంటి పరిస్థితేం లేదు. సృజనాత్మకత ఉండాలే గానీ దారులెన్నో ఉన్నాయి. ఫొటోగ్రఫీ మీద ఇష్టం చిన్నప్పటినుంచే పెరిగింది. అయితే... మొదట వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గానే కెరీర్ మొదలుపెట్టాను. క్యాండిడ్ ఫొటోగ్రఫీలో మంచి పేరు సంపాదించుకున్నా చెన్నైలో. అయితే మా ఫ్రెండ్స్ పెండ్లిళ్లయిపోయి... పిల్లలు పుట్టినప్పుడు వాళ్ల ఫొటోస్ తీశాను. మా స్నేహితులే కాదు... చూసినవాళ్లందరూ మెచ్చుకున్నారు.
ప్రతి మ్మెంట్ని క్యాప్చర్ చేస్తూ...
వెడ్డింగ్ ఫొటోగ్రఫీలో కూడా చాలా మంది మహిళలున్నారు. ఒకరు మొదలుపెడితే ఆ రంగంలోకి చాలా మంది వచ్చేస్తున్నారు. కానీ ఈ గర్భిణీలు, పిల్లల ఫొటోగ్రాఫర్స్ పెద్దగా లేరు. వాళ్లను మాత్రమే తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల పుట్టిందే 'మామీ షాట్స్'. ప్రపంచంలో అత్యంత అందమైన, ఉత్తమమైన మోడల్స్ ఎవరైనా ఉన్నారంటే... వారు కచ్చితంగా చిన్న పిల్లలే. ఎందుకంటే వాళ్ల ప్రతి మూవ్‌మెంట్‌ను క్యాప్చర్ చేయొచ్చు. అట్లా స్నేహితులతో మొదలుపెట్టి ఇప్పుడు మెటర్నిటీ, ఫ్యామిలీ పోట్రెయిట్స్ తీయడంలో స్పెషలిస్ట్నయ్యాను. మొదట స్నేహితులు, వాళ్ల స్నేహితులు, బంధువుల స్నేహితులు ఇలాగే వచ్చేవి ఆఫర్స్. సోషల్ మీడియా ఉపయోగం పెరిగిన తరువాత... ఇన్‌స్టా, ఫేస్బుక్ వంటి మాధ్యమాలతో అనేక అవకాశాలు వస్తున్నాయి.
ప్రతిసారీ కొత్తగా...
ఫొటోస్ తీసేటప్పుడు నేను ఎక్కువ లైటింగ్‌ను ఉపయోగించను. ఎక్కువ ప్రాపర్టీస్ కూడా ఉపయోగించను. షూట్‌కి ముందు కుటుంబంతో వివరంగా మాట్లాడతాను. మహిళను కాబట్టి... గర్భిణీలు అయినా, చిన్న పిల్లల తల్లిదండ్రులయినా ఇబ్బంది ఫీలవ్వరు. కానీ.. పిల్లల మూడ్స్ వెంట వెంటనే మారిపోతుంటాయి. వాళ్ల మూమెంట్స్‌ను పట్టుకోవడానికి ఒక్కోసారి రోజంతా కుటుంబంతోనే ఉండాల్సి వస్తుంది. అయితే పిల్లలు... నిద్రపోవడానికి, ఆడుకోవడానికీ ఓ టైమ్ ఉంటుంది. ఆయా క్షణాల కోసం ఎంతో ఓపికగా నిరీక్షిస్తాను. అవుట్డోర్, ఇండోర్... అన్ని రకాలుగా... చాలా సహజంగా పిల్లల ముసిముసి నవ్వులను, నిద్రపోతున్న అందాన్ని, ఆడుకుంటున్నప్పుడు అల్లరిని అందంగా క్యాప్చర్ చేస్తాను. బేబీ పుట్టిన దగ్గరనుంచి డెవలప్మెంట్ను బట్టి ప్రతి మూడు నెలలకోసారి షూట్ ఉంటుంది. బోర్లా పడుతున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, లేచి నిలబడి నప్పుడు, నడుస్తున్నప్పుడు ఇలా ప్రతీ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేస్తాను. నేను తీసిన ప్రతి ఫొటో ఓ కథను చెబుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు ప్రాపర్టీస్ ప్రతీసారీ కొత్తగా ఉండేలా చూసుకుంటాను. అప్పుడే పుట్టినవాళ్ల దగ్గరనుంచి 15 ఏళ్ల వారి వరకు ఫొటోస్ తీసేందుకు నాదైన ప్రత్యేక శైలి ఉంది.
తల్లిపాల మీద అవగాహన కల్పిస్తూ...
కేవలం ఫొటోగ్రఫీకే పరిమితమైపోలేదు. తల్లిపాల గురించి అవగాహన కలిగిస్తున్నాను. ఆ మధ్య కాలంలో ఓ మలయాళీ మ్యాగజైన్ కవర్‌గా... బిడ్డకు పాలిస్తున్న తల్లి ఫొటోను ప్రచురించారు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరైతే ఏకంగా దానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టారు. ఒక సహజమైన విషయాన్ని మాట్లాడకుండా ఎందుకంతా రాద్ధాంతం చేస్తున్నారోననిపించింది. చెన్నైలో స్నేహితులు తల్లిపాల బ్యాంకును కూడా నిర్వహిస్తున్నారు. ఒక బిడ్డకు సరిపోయిన తరువాత... మిగిలిపోయిన పాలను ఇతర పిల్లలకు ఇవ్వడం వల్ల ఎంతోమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. తల్లిపాల వితరణ మీద మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బ్రెస్ట్‌ఫీడింగ్ ఫొటోగ్రఫీ చేశాను. మిగిలిన ఫొటోగ్రఫీ అంతా ఒక ఎత్తు... సమాజానికి ఉపయోగపడే ఈ ఫొటోగ్రఫీ ఒక ఎత్తు. నాకు అత్యంత సంతృప్తి కలిగించిన విషయం''