Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్ట్రెస్... అనే మాటను ఈరోజుల్లో తరచుగా వింటు న్నాం... స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగస్తుల వరకూ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఒత్తిడి. మారుతున్న జీవనశైలి, జీవితంలో తొందరగా స్థిరపడాలని ఎక్కువ సమయం పనిచేయడం, తిండి-నిద్ర లేమి వంటి వాటితో ప్రతిఒక్కరూ తమకు తెలియకుండానే ఒత్తిడిలోకి జారుకుంటున్నారు. అయితే దీన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యమవుతోంది. అంతలోనే దాని ప్రభావం మన శరీరంపై చాలా ఉంటుంది. అందుకే కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే గురించి జాగ్రత్తపడటం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
- కళ్ళు అదరటం, మంటగా అనిపించటం వంటివి కళ్ళు ఒత్తిడికి గురయ్యాయని సూచిస్తాయి. ఆ సమయంలో కళ్ళు మూసుకొని ఓ పది నిమిషాలు రిలాక్స్ అవ్వటం మంచిది. కాదని మొండిగా పనిచేస్తే ఆ ఒత్తిడి మనసుని చేరుతుంది.
- గోళ్ళు కోరుకుతున్నారా? అయితే ఏదో విషయంలో మీరు ఒత్తిడికి గురయ్యారని అర్థం. ఈ విషయం అని ఆలోచనలో పడకండి.. తెలీకుండా గోళ్ళు కొరుకుతుంటే... చక్కగా ఓ మంచి పాట వినండి, వేడి వేడి, టీ తాగండి... మనసు తేలిక పడుతుంది.
- ఎప్పుడయినా మెడ దగ్గర విపరీతమైన నొప్పిగా అనిపించిందా? అలా అయితే మీ కంటే ముందే మీ కండరాలు మీలోని ఒత్తిడిని గుర్తించాయి అని తెలుసుకుని రిలాక్స్ అవ్వండి వెంటనే. ఒత్తిడి మనసు మీదే కాదు కండరాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది, దాంతో అవి పట్టేసినట్టు అవుతాయి.. బ్రీతింగ్ కు సంబంధించిన వ్యాయామాలు ఆ సమయంలో ఒత్తిడిని, కండరాల ఇబ్బందిని తగ్గిస్తాయి.
- అన్నీ మరచిపోతున్నా ఈ మధ్య.... అనిపిస్తే... కచ్చితంగా ఒత్తిడిలో ఉన్నట్టే. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా వుంటే ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. దాంతో చాలా విషయాలు మర్చి పోతుంటాం. ఆ మార్చి పోవటం మళ్ళీ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సర్కిల్ని బ్రేక్ చేయాలంటే ఒత్తిడికి చెక్ చెప్పటం ఒక్కటే పరిష్కారం. రోజూ కొంత సేపు వ్యాయామం చేయటం, మెడిటేషన్ వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
- ఒకోసారి ఎందుకో తెలియదు.. అస్సలు నిద్ర పట్టడం లేదు అంటారు చాలామంది. ఆ ఎందుకో వెనక ఒత్తిడి దాగుందని తెలుసుకోరు. నిజానికి ఏదో ఆందోళన మనసులో నిండి వుంటే అది హార్మోన్ల మీద ప్రభావాన్ని చూపించి నిద్రని దూరం చేస్తుంది. బాగా ఒత్తిడిలో వుంటే కంటి నిండా నిద్రా కరువే. అందుకు పరిష్కారం రోజు రాత్రి పడుకునే ముందు ఓ పది నిముషాలు ధ్యానం చేయటం, మంచి మ్యూజిక్ వినడం మంచిది. నిద్ర వచ్చేదాకా ఇంటర్నెట్ ముందో, టీవీ ముందో గడిపితే అది ఒత్తిడిని మంరింత పెంచుతుంది కాని తగ్గించదు. నచ్చిన పుస్తకం చదవటం కూడా మనసుని రిలాక్స్ చేస్తుంది.
- ఒత్తిడి ఎప్పుడు, ఎందుకు వస్తుందో తెలియదు. ఒకోసారి చిన్న విషయాలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. ఎందుకు అని తీవ్రంగా ఆలోచించే కంటే... ఒత్తిడి దరిచేరకుండా మనం ఏం చేయగలమన్నది తెలుసుకుని, అది పాటించటం మంచిది. ఇందుకు నిపుణులు చెప్పేది ఒక్కటే... మీ మనసుకు నచ్చే పనుల కోసం రోజూ కొంత సమయం కేటాయించి.. ఒత్తిడికి దూరంగా వుండాలని. మనలని అన్నివిధాలా ఇబ్బంది పెట్టె ఒత్తిడిని సకాలంలో గుర్తించి... అందులోనుంచి బయట పడటం అన్నివిధాలా ఏంతో ముఖ్యం.