Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని కుటుంబాల్లో పిల్లలపై తరచూ కోపగించుకుంటూ ఉంటారు. చీటికిమాటికి అరుస్తుంటారు. అయితే కోపాన్ని అదుపు చేసుకోలేని వారు తమ పిల్లలకు మంచి పెంపకాన్ని, అలాగే మంచి భవిష్యత్‌ను కూడా అందించలేరని నిపుణులు చెబుతున్నారు. మీ పిల్లలకు నాణ్యమైన పెంపకాన్ని అందించి వాళ్లకు అద్భుతమైన జీవితాన్ని కానుకగా ఇవ్వాలంటే ముందు మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకోలేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఉద్వేగాలను అదుపు చేసుకోలేని వారిగా తయారవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
- పిల్లల విషయంలో కోపం తాలూకూ ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయి. కోపంతో పసిపిల్లల లేత మనస్సులు గాయపడటమే కాదు, కోపంలో తల్లిదండ్రులు చేసే శారీరక, మానసిక హింస వాళ్లను జీవితాంతం వెంటాడుతుంది. క్షణికావేశంతో పిల్లల విషయంలో చూపించే కోపం వాళ్ల భవిష్యత్ ను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని పేరెంట్స్ గుర్తించాలి.
- కోపాన్ని అదుపు చేసుకోవడం ఎలాగో ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. భావోద్వేగాల పరంగా తీవ్రమైన అలజడి ఉన్నప్పుడు అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. పరిస్థితి అంత తీవ్రంగా లేనట్టయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని కోపాన్ని అదుపు చేసుకోవచ్చు.
- కోపం తెప్పించే విషయాలకు దూరంగా ఉండటం, ఒక వేళ కోపం వస్తు న్నట్టు అనిపిస్తే ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవడమో లేక నంబర్ కౌంటింగ్ టెక్నిక్‌ను అప్లరు చేయడమో చేయాలి. అలాగే గట్టిగా ఊపిరి పీల్చి వదిలినా మంచి ప్రయోజనమే ఉంటుంది.
- అయితే చాలా సందర్భాల్లో పిల్లలు కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ , మొండిగా వ్యవహరిస్తూ తల్లిదండ్రుల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటారు. అటువంటుప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడమే కాక పిల్లలు ఆ విధంగా ప్రవర్తించకుండా కట్టడి చేసే బాధ్యత తల్లిదండ్రులదే. సరిగ్గా ఇక్కడే పేరెంట్స్ గా మీ సత్తా, మీ సామర్ధ్యం బయటపడుతుంది.
కోపాన్ని అదుపు చేయడం ఎలా?
- కోపాన్ని ఒక సాధారణ ఉద్వేగంగానే పరిగణించి, ఆ విషయాన్ని అంగీకరించాలి.
- మీ పిల్లలు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారని, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు ఎమోషనల్ ఫీల్ అయి కోపం తెచ్చుకోవద్దు.
- మీకు దేనికి కోపం వస్తుంది. ఏ పని చేస్తే మీరు ఓవర్‌గా రియాక్ట్ అవుతారు అన్న విషయం మీ పిల్లలకు తెలియజేయండి. అది కోపంతో కాకుండా చాలా శాంతంగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి.
- భావోద్వేగాలకు సంబంధించి పిల్లలతో మీ సంబంధాలు దఢంగా ఉండేలా చూసుకోండి. మీ పిల్లలకు కోపం వస్తే దాన్ని వారు ప్రదర్శిస్తే అసలు వాళ్ల కోపం దేనికోసమో తెలుసుకోండి.
- కోపం వచ్చిన సందర్భంలో ఏ విధంగా నియంత్రించుకోవాలో, అలా చేయకపోతే జరిగే పర్యవసానాలను వాళ్లకు వివరించి చెప్పండి. పిల్లలకు కోపం దుష్పరిణామాలు చెబుతూనే అదే సమయంలో తాము కోపాన్ని జయించేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారు.