Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రిస్మస్, కొత్త సంవత్సరం, పుట్టిన రోజు ఇలా కొన్ని వేడుకలకే పరిమితమైన కేక్ కట్టింగ్ ఇప్పుడు పార్టీల్లోనూ, పండగల్లోనూ, ఇంట్లో శుభకార్యాల్లోనూ చోటు సంపాదించింది. పాశ్చాత్య వేడుకలో భాగమైన కేక్ కొత్తగా, సరికొత్తగా, క్రియేటివ్‌గా ఉంటేనే మజా అంటున్నారు నేటితరం. పార్టీ ఏదైనా, పండగేదైనా కేక్ క్రియేటివ్‌గా ఉండాలనుకుంటున్నారు. పెండ్లి రోజు నుంచి బారసాల దాకా, నామకరణ నుంచి షష్టి పూర్తి దాకా ఇలా పార్టీకి తగ్గట్టు, సంప్రదాయం, సందేశం ప్రతిబింబించేలా కేక్‌లను తయారు చేస్తున్నారు 'సింధు ఈట్స్ అండ్ ట్రీట్ ' ఫౌండర్ సింధు కిలారి. విదేశాల్లో నేర్చుకున్న విద్యతో స జనాత్మకతకు, శ్రమను జోడించి కళాత్మక కేకులతో జాతీయ స్థాయి బేకింగ్ పోటీల్లో విజేతగా నిలుస్తున్న ఆమె పరిచయం..
నాన్న కిలారి కృష్ణారావు, అమ్మ శైలజారాణి ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగస్తులు. అమ్మ మంచి ఆర్టిస్ట్. చిన్నతనం నుంచి ఆమె చేసే బొమ్మలను, వేసే చిత్రాలను చూసేదాన్ని. దాంతో డ్రాయింగ్, మినియేచర్ ఆర్ట్‌పై ఆసక్తి పెరిగింది. స్కూల్లో చదువుతున్న ప్పుడు జిల్లా స్థాయిలో జరిగే డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా ఎన్నో బహుమతులు అందుకున్నాను. డిగ్రీకి వచ్చాక క్యాండిల్ మేకింగ్, గ్లాస్ పెయింటింగ్, క్రాఫ్ట్ వర్క్‌లతో ఖాళీ సమయాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నేదాన్ని. బిఎస్సీ (హౌమ్సైన్స్) వరకు చదువంతా గుంటూరులోనే సాగింది. ఆ తర్వాత బయోటెక్నాలజీలో ఎం ఎస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళాను. అక్కడ సరదాగా స్నేహితులతో కలిసి కేక్ మేకింగ్ నేర్చుకున్నాను. చదువు పూర్తి చేసి తిరిగి ఇండియాకు వచ్చాను. ఐటిసిలో కొద్దిరోజులు ఉద్యోగం చేసినా నచ్చకపోవడంతో మానేశాను.
సొంతంగా..
ఉద్యోగం కాకుండా సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. చుట్టు పక్కల ఉన్న పిల్లల కోసం కేకులు, స్వీట్లు, చాక్లెట్లు తయారు చేసేదాన్ని. చిన్న చిన్న పార్టీలకు ఇంట్లోనే కేక్స్ తయారుచేసేదాన్ని. ఇదే అలవాటుగా మారి ఇంకా మంచి కేకులు తయారు చేయాలనే ఆసక్తి పెరిగింది. అప్పుడే ఆస్ట్రేలియాలో సరదాగా నేర్చుకున్న కేక్ మేకింగ్ వైపు దృష్టి మళ్లింది. కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఉన్న నేను కస్టమైజ్డ్ కేకులను తయారు చేయడం ప్రారంభించాను. ఆస్ట్రేలియాలోని స్నేహితులు ఇక్కడ ఉన్న తమ ఇతర స్నేహితులకు నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. దాంతో గుంటూరు చుట్టుపక్కల ఉన్నవారు నాకు ఫోన్ చేసి కేక్ ఆర్డర్ ఇచ్చేవారు. క్రమంగా మౌత్‌పబ్లిసిటీ ద్వారా చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు. కస్టమర్స్ ఏ డిజైన్‌ను కోరుకుంటే ఆ డిజైన్‌ను వీలైనంత తక్కువ బరువుతో చేసేదాన్ని. ఎప్పటికప్పుడూ సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో పెద్ద కేక్‌లను, కప్ కేకులను కూడా తయారు చేశాను. కెమికల్స్ లేకుండా, పటిష్ఠమైన బేస్‌తో తయారు చేస్తున్నది. సహజమైన ఉత్పత్తులను వాడడం వల్ల కేక్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు ఆరోగ్యకరం కావడంతో రోజురోజుకు నేను చేసే కేక్‌లను డిమాండ్ పెరిగింది.
ఆలోచనకు ప్రోత్సాహం తోడై..
సందర్భానికి తగ్గట్టు సంప్రదాయాన్ని జోడించి నేను చేసే కేక్‌లకు మంచి ఆదరణ పెరిగింది. రోజు రెండు మూడు ఆర్డర్లు కూడా వచ్చేవి. అప్పుడు ఒకదాన్ని చేయడం కష్టమై ఇంట్లో అమ్మ సహాయం తీసుకునేదాన్ని. వాసుదేవ్‌తో ఏడాది కిందట పెండ్లి అయ్యింది. దాంతో హైదారాబాద్ వచ్చేశాను. అత్తింటి వారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. మా వారు, అత్తగారు కూడా సహాయం చేస్తున్నారు. కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కుటుంబం ప్రోత్సాహం ఉంటే మరింత ఉత్సాహంగా నూతన పంథాలో ముందుగు పోయే వీలుంటుంది.
అన్ని సందర్భాలకు తగ్గట్టుగా..
సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది అంటారు. అలాంటి సంతోషం సమయంలో సెలబ్రేట్ చేసుకునేలా కేక్‌ను వినూత్నంగా డిజైన్ చేస్తాను. వారివారి అభిరుచుల మేరకు, ఆయా సందర్భాలను బట్టి కేక్ తయారీలో జాగ్రత్తలు తీసుకుంటాను. పండుగకు కేక్ కావాలనుకున్నప్పుడు ఆ పండుగకు దగ్గరగా ఉండే అంశాలు, వ్యక్తిగత సందర్భాలకు కావల్సినప్పుడు ఆయా వ్యక్తుల ఆసక్తులు తెలుసుకుంటాను. దాంతో వారికి నచ్చేలా కేక్ తయారు చేయడం సాధ్యమవుతుంది. కేక్ ఆర్డర్స్ కోసం కేవలం ఫేస్బుక్ పేజీని, ఇస్టాగ్రామ్ను మాత్రమే వాడుతున్నాను. ఒకసారి ఆర్డర్ ఇచ్చిన వారే మా కేక్స్ నచ్చి రిపీటెడ్‌గా ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇతరులకు రెఫర్ చేస్తున్నారు.
బేకింగ్ పోటీల్లో..
ప్రతి ఏడాది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కేక్ మేకింగ్, బేకింగ్ పోటీలు జరుగుతాయి. ఇటీవల మన నగరంలో జరిగిన హైదరాబాద్ బేక్ షోలో, గ్రేట్ ఇండియా బేక్ షోలో పాల్గొనడంతో పాటు అవార్డులు కూడా అందుకున్నాను. బేకింగ్ క్లాస్‌లు కూడా నిర్వహిస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు ఫేస్బుక్ పేజీ ద్వారా సంప్రదించవచ్చు.
సృజనాత్మకత ఫలితమే..
ఆర్డర్లు ఎక్కువనే వస్తున్నాయి. వీఐపీలు, సెలబ్రెటీలు కూడా కేకులను ఆర్డర్ ఇస్తున్నారు. 25కేజీల పెద్ద సైజ్ కేక్ వరకు తయారుచేయగలిగాను. అయితే శక్తిని మించిన ఆర్డర్లు తీసుకోను. వారి వారి అభిరుచి మేరకు కేక్ ను తయారు చేయడానికి రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు టైమ్ పడుతుంది. తీసుకున్న ఆర్డర్‌ను అందంగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా వారికి నచ్చేలా అందించాలన్నదే నా లక్ష్యం.
సందర్భానికి తగ్గట్టు, వారి వారి అభిరుచి మేరకు పెద్ద సైజ్ కేక్‌లను, కప్ కేక్‌లను తయారు చేస్తున్నాం. కేక్‌లోని ఎగ్, ఎగ్ లెస్ అనేక రకాలు తయారు చేస్తాను. త్వరలోనే కేక్ ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది.