Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న జీవన శైలితో ఎన్నో అనారోగ్య సమస్యలు. వాటన్నింటికీ యోగాతో చెక్ పెట్టొచ్చంటోంది.. యోగా నిపుణురాలు రీనా హిందోచ. కోల్‌కత్తాలో పుట్టి పెరిగిన ఈ గుజరాతీ మహిళ స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌లో. పెండ్లి, పిల్లల తరువాత జీవితమే లేదనుకునే చాలా మందిలా కాకుండా.. ఆ రెండింటి తరువాతనే అసలు జీవితాన్ని మొదలుపెట్టింది యోగా గురువుగా. ఉరుకుల పరుగుల జీవితాలకు యోగా అసవరాన్ని, తన ప్రయాణాన్ని... మానవితో పంచుకుంది.
మీ నేపథ్యం చెప్పండి?
సంప్రదాయ గుజరాతీ కుటుంబం మాది. కానీ పుట్టిపెరిగిందంతా కోల్‌కతాలో. ఒక చెల్లి. చిన్నప్పటి నుంచి చాలా స్వేచ్ఛగా ఉండేదాన్ని. బాగా చదవాలని, ఇది కావాలి, అది కావాలి అన్న ఒత్తిళ్లు లేవు. దాంతో నేను ఎలాంటి లక్ష్యాలు, కెరీర్ ప్లాన్స్ కూడా లేకుండా పెరిగాను. ఆ నిమిషంలో సంతోషంగా జీవించడం ఎట్లా... అనేదే ఉండేది. ముందే చెప్పాను కదా... సంప్రదాయ కుటుంబం అని. దాంతో 19 ఏండ్లకే పెండ్లి చేశారు. మావారు తేజస్ హిందోచ. వాళ్లు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అట్లా కోల్‌కతా నుంచి నేను హైదరాబాద్ వచ్చేశాను. కలకత్తాను ఎంత ప్రేమిస్తానో... హైదరాబాద్ కూడా అంతే నచ్చేసింది. ప్రత్యేకించి ఇక్కడి బిర్యానీ. కోల్కతాలాగానే ఇక్కడి మనుషులూ ఆత్మీయంగా ఉండటం... బాగా నచ్చి రెండు నగరాల మధ్య పెద్ద తేడా అనిపించలేదు.
హైదరాబాద్‌లో స్థిరపడ్డారు సరే... యోగా నేర్చుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇతరులకు నేర్పేవరకు ఎలా ఎదిగారు?
పాప పుట్టిన తరువాత... బాగా లావయ్యాను. బరువు తగ్గాలంటే కచ్చితంగా యోగా క్లాసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. పోనైతే పోయాను కానీ... మొదటి రోజయితే అక్కడినుంచి పారీపోవాలన్నంత భయమేసింది. బరువు తగ్గాలి కాబట్టిచేస్తున్నానన్నట్టుగా ఉండేది. కారణం... అసలు అవగాహన లేకపోవడం. కానీ కొద్ది రోజులు చేసిన తరువాత వచ్చిన ఫలితాలు చూస్తే నాకే ఆశ్చర్యం, ఆనందం కలిగింది. గుండె మీద చెయ్యేసుకుని, నిజాయితీగా చెప్పగలిగే మాట.. ఊహకందని ఆనందమేదో నన్నక్కడికి లాక్కెళ్లేది. యోగా మీద ఆసక్తి బాగా పెరిగింది. సాధన ఎక్కువ చేయడం మొదలుపెట్టాను. యోగా నా జీవితంలో భాగమైపోయింది. రానురాను... యోగా చేస్తే ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఫోకస్డ్గా అనిపించేది. నా గురువులు కూడా నాకెంతో ప్రేరణ ఇచ్చేవారు. దాంతో మరింత ఇష్టంతో ఇంటిదగ్గరే ప్రాక్టీస్ చేసుకునే విధంగా నేర్చుకున్నాను. యోగా అలయన్స్ సర్టిఫికెట్ కూడా పొందాను. చూస్తుండగానే పది ఏండ్లయిపోయింది. నాలో మార్పులు నేను ప్రత్యక్ష్యంగా చూస్తున్నాను కదా... అది మరింత మంది జీవితాల్లో మార్పు తెస్తుందని యోగా నేర్పించడం మొదలుపెట్టాను. అష్టాంగ విన్యాస యోగా నా ప్రత్యేకత. 'రీనా హిందోచ యోగా' పేరుతో చాలా మందికి నేర్పిస్తున్నాను. వ్యక్తిగతంగానే కాకుండా... హైదరాబాద్‌లోని చాలా కార్పొరేట్ సంస్థలకు కూడా యోగా ట్రైనర్‌గా ఉన్నాను. శారీరకంగా, మానసికంగా ఏదైనా అవ్వగానే డాక్టర్ల దగ్గరకు పరుగెడతాం. కానీ అవేవీ దరిచేరకుండా నివారించేది యోగా. యోగావల్ల మీ శరీరంతో మీరు ప్రేమలో పడిపోతారు.
ఇప్పుడు ఉరుకులుపరుగుల జీవితంలో ఒత్తిళ్లు ఎక్కువైపోయాయి. వీటిని తగ్గించడానికి చేయాల్సిందేమిటి?
మానసికంగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచగలిగేది మెడిటేషన్. ప్రాణాయామం ప్రతికూల ఆలోచనలు రాకుండా, ఒత్తిడి లేకుండా చేస్తుంది. కొన్ని నిమిషాల ప్రాక్టీస్... రోజంతా ఎలాంటి ఆందోళనలు లేకుండా చేస్తుంది. మెడిటేషన్‌కి ప్రత్యేకంగా సమయం కేటాయించి చేయాల్సిన అవసరం కూడా లేదు. రోజువారీ పనుల్లో కూడా ఏకాగ్రతను పెట్టగలిగితే మెడిటేషన్ అయినట్టే. వంట చేస్తూ, ఎరోబిక్స్ లేదా యోగా, స్ట్రెచెస్ చేస్తూ, గోల్ఫ్ ఆడుతూ, సంగీత వాయిద్యాన్ని పలికిస్తూ, పెంపుడు జంతువులతో ఆడుకుంటూ... పనేదైనా దానిమీదే శ్రద్ధపెట్టి చేస్తే చాలు.. మీరు మెడిటేషన్ చేసినట్టే. మెడిటేషన్ ఇచ్చే ఉపశమనం అంతా ఇంతా కాదు. దీర్ఘకాలికమైన ఒత్తిడిని కూడా ఇట్టే మాయం చేస్తుంది. నేనయితే ఎక్సర్సైజ్ చేస్తాను.. ఎందుకంటే అది వర్కవుట్లా పనిచేయడమే కాదు... రిలాక్సేషన్ కూడా ఇస్తుంది.
మెడిటేషన్, యోగా అవసరం మహిళలకు ఇంకా ఎక్కువేమో కదా?
కచ్చితంగా. ఎందుకంటే.. ఇప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా శ్రమలో భాగమై ఉన్నారు. దీంతో ఏండ్లుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక పురుషులతో పోల్చు కుంటే ఈ సమస్యలు మహిళలకు మరింత ఎక్కువ. ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న మహిళల్లో ఒత్తిళ్ల వచ్చే అనారోగ్యంతోపాటు, జీవన విధానం వల్ల కూడా అనేకరమైన జబ్బులొస్తున్నాయి. ప్రాణానికే హాని కలిగించే ఈ వ్యాధుల మీద పోరాటం చేయాలంటే... కచ్చితంగా మహిళలకు ఫిట్నెస్ అవసరం. శారీరకంగా దృఢంగా ఉంటే అది గుండె, శ్వాస సంబంధిత, మానసిక ఆనందానికి మేలు చేస్తుంది. శారీరక దృఢత్వం మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుందని అనేక పరిశోధనలు కూడా చెప్పాయి. కాబట్టి ఉద్యోగాలు చేస్తే, ప్రత్యేకించి నిర్ణయాధికార స్థానాల్లో ఉన్న మహిళలు ఫిట్నెస్ మీద దృష్టి సారిస్తే... వారి పనులు మరింత సులువుగా, మంచిగా చేయగలుగుతారు. ఒత్తిడిని కూడా అధి గమించగలుగుతారు. వాళ్లు చేసే వృత్తులతో సంబంధం లేకుండా శారీరక దృఢత్వం అనేది ప్రతి మహిళకు అవసరం. రోజువారీ చేసే పనులవల్ల పెద్ద పెద్ద కండరాలతోపాటు, చిన్న కండరాలు పనిచేయాల్సి వస్తుంది. శారీరకంగా దృఢంగా ఉంటే ఆ పనులు కూడా ఈజీగా అయిపోతాయి. అందుకే వాకింగ్, జాగింగ్, యోగా, ఈత, సైక్లింగ్ వంటివి ఎంచుకుంటే మంచిది. కానీ ఇంతకుముందె న్నడూ లేని విధంగా ఈరోజుల్లో మహిళలు చాలా బిజీగా ఉంటు న్నారు. వ్యాయామానికి కూడా సమయమే లేకుండాపోతోంది. కేవలం 30 నిమిషాలు కేటాయించగలిగితే చాలు.
యోగా అంటే అదో మతపరమైన ప్రక్రియగా చేసేశారు కొందరు. దాన్ని మీరెలా చూస్తారు?
యోగా ఏ మతానికి సంబంధించినది కాదు. శారీరక, మానసిక ఆరోగ్య శాస్త్రం అది. దాన్ని ఒక మతానికో, సంస్కృతికో పరిమితం చేయడం సరికాదు. అది కేవలం శారీరక వ్యాయామం లేదా ఆసనాలు కాదు. యోగా అనేది శాస్త్రీయ విజ్ఞాననం. అది శరీరం, మనసును ఏకం చేస్తుంది. మనిషికి కావాల్సిన శాంతిని ఇస్తుంది. వ్యక్తుల ప్రవర్తనలోనూ, వ్యక్తిత్వంలోనూ మార్పు తెస్తుంది. చాలా మంది ఓమ్ అనేది మతపరమైన మంత్రం అనుకుంటారు. కానీ అది ఊ... మ్ కలగలిసి ఓమ్గా ధ్వనిస్తుంది. స్వరపేటికల తోపాటు శారీరక, మానసిక క్రియలను వృద్ధి చేస్తుంది. చాలామంది ముస్లిమ్స్ నా దగ్గర యోగా నేర్చుకుంటున్నారు. వాళ్లు సూర్య నమస్కారాలు చేస్తారు, ఓమ్ పఠిస్తారు. నిజానికి మతంకంటే కూడా.. రాజకీయ ప్రభావం యోగా మీద ఎక్కువుందేమో అనిపిస్తుంది.
ఆందోళనలు దరిచేరవు...
యోగా నా శరీరంలోని ప్రతి కణాన్నిమేల్కొలుపుతుంది. యోగా వల్ల నేను జీవించి ఉన్నాననిపిస్తుంది. ప్రశాంతతనిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. యోగావల్ల నేనెంతో శక్తిమంతురాలినని పిస్తుంది. ఇప్పుడు నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను. ఎలాంటి అనవసర ఆందోళనలు నా దరి చేరవు. నా కుటుంబం, ఫిట్నెస్.. ఇవి రెండే వ్యాపకాలు. ఎన్ని ఉన్నా.. క్రమశిక్షణ లేకపోతే వృథా. నేను చేస్తున్న పనుల మీద నాకెంతోశ్రద్ధ, ఆసక్తి ఉంది. దానివల్లే సంతోషంగా ఉండగలుగుతున్నా.
మీకంటూ సమయం కేటాయించండి
సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీకోసం మీరు కచ్చితంగా విలువైన సమయాన్ని కేటాయించుకోండి. ఆ బ్రేక్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే... ఇంటికి, కెరీర్‌కి మధ్య మీకంటూ సమయమే కాదు... శక్తి కూడా మిగలదు. కానీ మీరంటూ ఆరోగ్యంగా లేకపోతే అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని సమన్వయం చేయలేరు. విశ్రాంతి తీసుకోవడానికి, మీకు నచ్చింది చేయడానికి కొంత సమయం కేటాయించుకోండి. నిద్రపోవడానికి ముందో పుస్తకం, యోగా, ఎక్సర్సైజ్ ఏదైనా క్లాస్‌కు వెళ్లండి. మీ అభిరుచుల మీద దృష్టిసారించండి. అన్నింటికీ మించి పోషకాహారం తినండి, సరిపడా విశ్రాంతి తీసుకోండి.